మంగళవారం 26 మే 2020
Editorial - May 23, 2020 , 00:11:05

క్రమశిక్షణే రక్షణ

క్రమశిక్షణే రక్షణ

నాలుగో విడత లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ సడలింపులతో ప్రజాజీవనం సాధారణ స్థితికి వస్తున్నది. రాత్రిపూట మినహా మిగతా సమయాల్లో ప్రజలు తమ వృత్తిపనుల్లో మునిగిపోతున్నారు. ఆర్థిక స్థితిగతులను తీర్చిదిద్దుకునేందుకు ఉత్పత్తి రంగాల్లోకి ఉత్సాహంతో కదులుతున్నారు. అర్ధాంతరంగా నిలిచిపోయిన అన్నిరకాల వ్యవహారాలను తిరిగి ప్రారంభించుకునేందుకు ముందుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే జాగరూకతతో వ్యవహరించాలి. భౌతికదూరం పాటిస్తూ, కొవిడ్‌ వైరస్‌ బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జీవనాన్ని తీర్చిదిద్దుకోవాలి. అన్నిరకాల సామూహిక కార్యక్రమాలను తక్కువ సంఖ్యతో నిర్వహించుకునేందుకు సంసిద్ధులవ్వాలి. ఇది దుబారాను నివారించడం మాత్రమే కాదు, విలువైన సామాజిక సంపదను సంరక్షించడంలో మనల్ని భాగస్వాములను చేస్తుంది. ప్రస్తుత పరిస్థితిలో కష్టమైనదే అయినా అందరూ ఇష్టపూర్వకంగా అనుసరించాల్సిన మార్గం ఇదే. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ తనతోపాటు, తోటివారి ఆరోగ్యానికీ హామీగా నడుచుకోవాలి.

దేశంలో గత ఐదురోజుల్లోనే 26 వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సగటున రోజుకు 5,283 మంది చొప్పున కొవిడ్‌ బారిన పడుతున్నారు. పరీక్షలు చేయించుకున్న ప్రతి పద్దెనిమిది మందిలో ఒకరికి పాజిటివ్‌ వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రయాణాలూ మొదలవుతున్నాయి. ఇప్పటికే బస్సులు నడుస్తున్నాయి. దేశంలో ఈ మూల నుంచి ఆ మూలకు రాష్ర్టాల సరిహద్దులను దాటి ప్రయాణించే వెసులుబాటు ఏర్పడుతున్నది. ఈ నెల 25 నుంచి విమాన సర్వీసులు, జూన్‌ 1 నుంచి రైళ్లు పునఃప్రారంభమవుతున్నాయి. రైలు ప్రయాణాల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం ఇవ్వడంతో గురువారం ఒక్కరోజే రెండు గంటల్లోనే 73 రైళ్లలో 1,49,025 మంది టికెట్లు బుక్‌ చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జనగమనం ఏ రీతిన ఉండబోతున్నదో ఇది తెలుపుతున్నది. బస్సులు మొదలు రైళ్లు, విమానాల దాకా ప్రభుత్వాలు ప్రయాణ పరిసరాలను శానిటైజ్‌ చేసి ప్రమాద రహితంగా మారుస్తున్నాయి. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజల్లో క్రమశిక్షణ, బాధ్యత అత్యవసరం. ఏ మాత్రం కట్టుతప్పినా పెను ప్రమాదం ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. 

వైరస్‌ వ్యాప్తి ప్రారంభ సమయంలో ముందస్తు చర్యగా కేంద్రం దేశవ్యాప్త దిగ్బంధం ప్రకటించింది. అవసరమైన పకడ్బందీ చర్యలు చేపట్టింది. వీటికి ప్రజలనుంచి హర్షాతిరేకాలతో సంపూర్ణమద్దతు లభించింది. అభివృద్ధి చెందిన యూరప్‌ దేశాలు, అమెరికా, ఇంగ్లండ్‌ కన్నా దేశంలో వైరస్‌ వ్యాప్తి, మరణాలు తక్కువ ఉండటానికి ప్రభుత్వాల ముందుచూపే కారణం. ఈ సానుకూల పరిస్థితుల్లో పౌర జీవనం చలనంలోకి వస్తున్నది. దీన్ని ఎంత సమర్థంగా సద్వినియోగం చేసుకుంటామన్న దానిపైనే మన విజయం ఆధారపడి ఉన్నది. దేశంలో కరోనాతో ఆర్థిక, సామాజిక, ఉత్పత్తిరంగాల్లో జరిగిన నష్టం అంతులేనిదే. తిరిగి పూర్వపు స్థితికి రావడానికి ఎన్ని నెలలు, సంవత్సరాలు పడుతుందో ఆర్థికవేత్తలు కూడా చెప్పలేని స్థితి. మన క్రమశిక్షణాయుతమైన జీవన విధానమే దీనికి మున్ముందు జవాబు చెబుతుంది.


logo