మంగళవారం 26 మే 2020
Editorial - May 23, 2020 , 00:11:13

‘షికాగో స్కూల్‌' చూపిన మార్గంలో..

‘షికాగో స్కూల్‌' చూపిన మార్గంలో..

విద్యుత్‌ సవరణ బిల్లును ప్రతిపాదించిన కేంద్రం, దానిపై అభిప్రాయాల కోసం రాష్ర్టాలకు ఇచ్చిన గడువు పూర్తికాకుండానే నిర్ణయం తీసుకున్నది. విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటుకు ఇచ్చివేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించేశారు. ఈ చర్య వెంటనే అమలుకు వచ్చేది కేంద్రపాలిత ప్రాంతాలలోనే కావచ్చుగాక. కానీ రాష్ర్టాలలో అమలుకు ఇదొక నమూనా కాగలదని ఆమె స్పష్టం చేశారు. 

స్వావలంబన కోసం రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు చెప్పిన మోదీ ప్రభుత్వం చివరికి రూ.3.2 లక్షల కోట్లు మాత్రమే ప్రకటించి, అకస్మాత్తుగా భారీ ఎత్తున ప్రైవేటీకరణకు పూనుకోవడమేమిటని అందరూ ఆశ్చర్యపోయినట్లున్నారు. కానీ, ఏవైనా విపత్తులు సంభవించినప్పుడే ప్రజలకు కలిగిన ఆ ‘షాక్‌'ను అనువుగా చేసుకొని ‘భారీ సంస్కరణలను, అతివేగంగా’ అమలుకు తేవాలన్న షికాగో స్కూల్‌ గురువు మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ సిద్ధాంతాన్నే ఆర్థిక సంస్కర్తలు దేశదేశాలలో అనుసరిస్తూ వస్తున్న చరిత్రను గమనిస్తే ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు.

ముందుగా తెలంగాణకు వర్తించే ఒక ఉదాహరణ గురించి చెప్పుకొని షికాగో స్కూల్‌ సిద్ధాంతమేమిటో తర్వాత చూద్దాం. విద్యుత్‌ సవరణ బిల్లు-2020ను ప్రతిపాదించిన కేంద్రం, దానిపై అభ్యంతరాలు, సూచనలు తెలియజేసేందుకు జూన్‌ 5 వరకు గడువు ఇచ్చింది. ఆ బిల్లును కేసీఆర్‌ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించటం, బిల్లు వల్ల రాష్ర్టానికి కలిగే నష్టాల గురించి కొన్నిరోజులుగా విస్తృతమైన చర్చ జరుగుతుండటం తెలిసిందే. ఇప్పుడు ఆ గడువు అయినా ముగియకుండా, తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాలన్నీ తమ అభిప్రాయాలు తెలియజేయకుండానే, పార్లమెంటులో చర్చ కూడా జరుపకుండానే విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటుకు ఇచ్చివేస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించి వేశారు. ఈ చర్య వెంటనే అమలుకు వచ్చేది కేంద్రపాలిత ప్రాంతాలలోనే కావచ్చుగాక. కానీ రాష్ర్టాలలో అమలుకు ఇదొక నమూనా కాగలదని ఆమె స్పష్టం చేశారు. ఇంత ముఖ్యమైన ప్రైవేటీకరణ చర్యను, కరోనా విపత్తు వంటి తీవ్ర సమయంలో దేశమంతా షాక్‌కు గురై ఉద్దీపనల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ, పిడుగుపాటు వలె తీసుకోవలసిన అత్యవసరం ఏమైనా ఉన్నదా? మామూలుగానైతే లేదు. కానీ షికాగో స్కూల్‌ సిద్ధాంతం ప్రకారమైతే ఉంది. ఈ మాట కొందరికి నమ్మశక్యంగా తోచకపోవచ్చు. బట్టతలకు మోకాలికి ముడిపెట్టడం అనిపించవచ్చు. కానీ ఇందులోని నిజమేమిటో ఆ స్కూల్‌ గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉదారవాద ఆర్థిక సంస్కరణల చరిత్ర గురించి రేఖామాత్రంగానైనా తెలిసినవారికి ఇదేమీ కొత్త కాదు. ఇదొక వ్యూహంగా అమలవుతున్నది. మన ప్యాకేజీపై 18న జపానీస్‌ నొమూరా, రాజకీయంగా సున్నితమైన ప్రైవేటీకరణల కోసం కరోనాను ఒక సాకు చేసుకున్నారనటం గమనార్హం.

ఇప్పుడు మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ గురించి కొద్దిగా చెప్పుకొందాం. ఆయన షికాగో యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్‌. అమెరికా సహా పాశ్చాత్య దేశాలలో, మాజీ వలస రాజ్యాల్లో ఆర్థికమాంద్యం, రెండవ ప్రపంచయుద్ధం, సోవియెట్‌ సోషలిజం, చైనా విప్లవ ప్రభావాలతో ఏదో ఒక మేరకు సంక్షేమ వ్యవస్థలు, మిశ్రమ ఆర్థిక విధానాలు అమలవుతుండిన రోజులవి. ప్రపంచమంతటా ఆర్థిక శాస్త్రవేత్తలు కూడా ఈ తరహా వ్యవస్థలు, విధానాల వల్లనే సమాజంలో సమతులనాన్ని పాటించగలమని నమ్మారు. ఇలాంటి ఆలోచనలకు ఆద్యుడు జాన్‌ మేనార్డ్‌ కీన్స్‌ అనే మరొక ప్రొఫెసర్‌. మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌ దీనికంతా బద్ధ వ్యతిరేకి. ఆయన నూటికి నూరు శాతం ప్రైవేట్‌ పెట్టుబడిదారీ, ఆ రంగానికి నూటికి నూరుశాతం స్వేచ్ఛ ఉండాలని, సంక్షేమరంగానికి పూర్తిగా స్వస్తి చెప్పాలని వాదించాడు. కానీ ఇందుకు ఏ దేశమూ ముందుకు రానందున కొంతకాలం ఒంటరిగా మిగలటం, తర్వాత అమెరికన్‌ ఎమ్మెన్సీలు, సీఐఏ తోడ్పాటుతో లాటిన్‌ అమెరికాతో ఆరంభించి క్రమంగా ముందుకు తీసుకుపోవటం ఒక సుదీర్ఘ చరిత్ర. అందులోకి పోకుండా ప్రస్తుతానికి సంబంధించి రెండు విషయాలు తెలుసుకోవాలి.

తను చెప్పిన తరహా ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణలు సాధారణ సమయాలలో ఇంచుమించు అసాధ్యమని, కనుక యుద్ధం, మహా తుఫాను, తీవ్ర ఆర్థిక మాంద్యం వంటి పెద్ద విపత్తులేవో సంభవించి ప్రజలు నిజంగా ‘షాక్‌'కు గురై దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు దానిని అనువుగా చేసుకొని ‘పెద్ద పెద్ద సంస్కరణలు, అతివేగంగా’ ప్రవేశపెట్టవచ్చునని సూచించాడు మిల్టన్‌ ఫ్రీడ్‌మన్‌. మనం తెలుసుకోవలసిన రెండు విషయాలలో ఒకటి ఇది కాగా, తర్వాత కాలంలో షికాగో స్కూల్లో శిక్షణ పొందిన అనేకులు ప్రపంచస్థాయిలోనే గాక ఇండియాతో సహా అనేక దేశాలలో వివిధ సంస్థలలో, ప్రభుత్వాలలో కీలక స్థానాలను ఆక్రమించి ఫ్రీడ్‌మన్‌ సిద్ధాంతాలను వీలైనంతవరకు క్రమంగా ముందుకుతీసుకుపోతూ ఉన్నారు. ఫ్రీడ్‌మన్‌ స్కూల్‌ అభిమాన బృందాలలో సాక్షాత్తూ చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులు సైతం ఉన్నారంటారు. ఇది 1989లో థియెన్‌ ఆన్‌ మన్‌ హత్యాకాండ సృష్టించిన షాక్‌ అనంతరం, సోషలిస్టు చైనా కాస్తా పెట్టుబడిదారీ చైనాగా మారిన తరువాతి పరిణామం. ఇక ఇతరదేశాల గురించి చెప్పేదేమిటి. మంచి తరుణం మించిన దొరుకదన్నట్లు వ్యవహరిస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం మెరుపు వేగంతో చేస్తున్న ప్రైవేటీకరణలకు, కార్మికరంగ సంస్కరణలకు బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ అయిన బీఎంఎస్‌ సైతం షాక్‌ తింటున్నది. దీనిపట్ల గల ఉత్సాహం కేంద్రానికి రాష్ర్టాల సూచనలపై లేకపోయింది. కోట్ల మంది వలస కార్మికుల హృదయవిదారకమైన కడగండ్లు కంటికి ఆనడం లేదు. స్వావలంబన లక్ష్యాల పేరిట మొదట 12వ తేదీన ప్రధాని ప్రకటించిన చర్యలకు తర్వాత ఐదు రోజుల్లో ఆర్థికమంత్రి వెల్లడించిన వివరాలలో చోటెక్కడనో వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో దేశం తిన్న షాక్‌ మధ్య షికాగో స్కూల్‌ ప్రైవేటీకరణలు మాత్రం మెరుస్తున్నాయి. 

-టంకశాల అశోక్‌


logo