శనివారం 30 మే 2020
Editorial - May 23, 2020 , 00:11:27

ఆదర్శ రాష్ట్రంపై అల్పబుద్ధి

ఆదర్శ రాష్ట్రంపై అల్పబుద్ధి

తెలంగాణలో కరోనా మహమ్మారిపై ముందస్తుగానే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వ యంత్రాంగం  దాని నియంత్రణకు సర్వశక్తులను ఒడ్డి ప్రయత్నిస్తున్నది. ప్రణాళికాబద్ధ, పకడ్బందీ వ్యూహం వల్ల కరోనా తగ్గుముఖం పడుతుంటే, కాంగ్రెస్‌, బీజేపీల రాజకీయ కరోనా వేగం పుంజుకు న్నది. ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 22న జనతా కర్ఫ్యూను విధిస్తే అంతకంటేముందే మార్చి 14నుంచే తెలంగాణలో పాక్షిక కర్ఫ్యూను విధించి కరోనా కట్టడికి పూనుకున్నారు. పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులతోపాటుగా ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. 

ప్రజలు భౌతికదూరం పాటించాల్సిన అవసరాన్ని కరోనా దుష్ఫలితాలను తనదైన పద్ధతిలో చెప్పి ప్రజలను చైతన్యం చేశారు. ఒకరకంగా చెప్పాలంటే కరోనాతో తెలంగాణ యుద్ధమే చేస్తున్నది. ఈ యుద్ధంలో ఎటువంటి భాగస్వామ్యం లేని, ఏ ఒక్కరికి పట్టెడన్నం, పిడికెడు బియ్యం విదిలించని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇంతకాలం ప్రాణ భయంతో ఏసీ గదులకే పరిమితమయ్యారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి చిలుక పలుకులు పలుకుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాల్సినవారు అత్యంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో పకడ్బందీ లాక్‌డౌన్‌, వైద్యపరీక్షలు, చికిత్స అందిచటంతోపాటు పనులు కోల్పోయిన పేదలకు 1500 రూపాయలు 12కిలోల బియ్యం అందజేశారు. ఇతర రాష్ర్టాలకు చెందిన వలస కార్మికులను కూడా తమ బిడ్డలుగా గుర్తించి ఆదుకున్నారు. దళారులు రైతులను నిలువుదోపిడి చేస్తారని కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థికరాబడి లేకున్నా, తెలంగాణలో పండిన ప్రతి ధాన్యపు గింజను కనీస మద్దతు ధరతో కొంటామని కేసీఆర్‌ ప్రకటించారు. దీనికోసం రూ.25,000 కోట్లు కేటాయించారు. 7,077 కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగనిది. 

దేశాన్ని, తెలంగాణను సుదీర్ఘకాలం పాలించి ప్రజల సర్వ అవస్థలకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రైతులు, పేదలు, వలస కూలీల గురించి మాట్లాడటం, పత్రికల్లో వ్యాసాలు రాయడం విడ్డూరం. ప్రధాని మోదీని కాంగ్రెస్‌ నాయకులు విమర్శిస్తే రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని ముఖ్య మంత్రి కేసీఆర్‌ హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారు. కలిసి పనిచేయాలనే స్ఫూర్తికి మార్గదర్శకుడైన కేసీఆర్‌ను స్థానిక బీజేపీ నాయకులు విమర్శించడం అసమంజసం. 

నరేంద్ర మోదీ ప్రభుత్వం జనతా కర్ఫ్యూ, గంటలు, దీపాలు, టీవీ సందే శాలు తప్ప రాష్ర్టాలకు, పేద ప్రజలకు, వలస కార్మికులకు ఎటువంటి సాయం అందించారో బీజేపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. రాష్ర్టాలు తమ శక్తికి మించి శ్రమిస్తుంటే కేంద్రం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. రుణాల ఎగవేతదారులకు 60 వేల కోట్లను రద్దుచేసిన మోదీ ప్రభుత్వం వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకయ్యే ఖర్చును వారు, ఆయా రాష్ర్టాలే చెల్లించాలనడం అత్యంత దారుణం, బాధ్యతారాహిత్యం. సుదీర్ఘ అనుభవం గల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి సంక్షోభం ఒక ఫలితానికి మార్గం చూపుతుంది. కరోనా సంక్షోభం అనుభవాలను గుణపాఠాలుగా తీసుకొని తెలంగాణ రాష్ట్రం మరింత ముందుకు వెళుతుంది. 

-డాక్టర్‌ రాజారాం యాదవ్‌


logo