శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 21, 2020 , 23:20:51

రుణం కాదు, ధనం ఇవ్వాలి

రుణం కాదు, ధనం ఇవ్వాలి

ఆర్బీఐ వివేచనతో జోక్యం చేసుకొని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బ్యాంకులకు అవసరమైన ఆర్థిక రుణాలను సమర్థంగా అందించగలిగింది. కానీ, ఈ ఫలితాలు బ్యాంకర్ల నుంచి వినియోగదారులకు చేరడం లేదు. ఫలితంగా తుది కస్టమర్లు నిస్పృహకు లోనవుతున్నారు. కరోనా విషాదాలు, ఆర్థికసంక్షోభాల కారణంగా రుణాలు మళ్లీ తిరిగి వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులు భయపడుతున్నాయి. 

భారత ఆర్థికవ్యవస్థకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కేంద్ర ప్రభుత్వం రెండూ రెండు కండ్లు. ఆర్బీఐ ద్రవ్య విధాన సూత్రీకరణతో వ్యవహరిస్తే, కేంద్రం ద్రవ్య విధానంతో ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఈ రెండు వ్యవస్థల లక్ష్యం ఆర్థికవ్యవస్థను పరిపు ష్టం చేస్తూ, సమాజంలో అన్నిరంగాల మధ్య సమతుల్యతను పాటించడం.. తద్వారా ఆర్థికస్థాయిని స్థిరీకరించి మెరుగుపరుచడం. ఈ రెండు వ్యవస్థలు దేశ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్దేశిత లక్ష్యాల సాధనకు కలిసి పనిచేస్తాయి. ఇప్పుడు అనూహ్యంగా వచ్చిన కొవిడ్‌-19 మహమ్మారితో గ్లోబల్‌ ఆర్థికవ్యవస్థ పరిస్థితే అయోమయంగా మారిపోయింది. అలాంటప్పుడు మన దేశ ఆర్థికవ్యవస్థ కూడా అతీతం కాదు. ఈ దశలో ఆర్బీఐ, కేంద్రం సమిష్టిగా ఆలోచించి, సమగ్ర విధానాలను రూపొందించి అమలుచేయకపోతే భారత ఆర్థికవ్యవస్థ బలహీనపడుతుంది. 

ఆర్బీఐ వివేచనతో జోక్యం చేసుకొని ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో బ్యాంకులకు అవసరమైన ఆర్థిక రుణాలను సమర్థంగా అందించగలిగింది. కానీ, ఈ ఫలితాలు బ్యాంకర్ల నుంచి వినియోగదారులకు చేరడం లేదు. ఫలితంగా తుది కస్టమర్లు నిస్పృహకు లోనవుతున్నారు. కరోనా విషాదాలు, ఆర్థికసంక్షోభాల కారణంగా రుణాలు మళ్లీ తిరిగి వసూలు చేసుకునే విషయంలో బ్యాంకులు భయపడుతున్నాయి. ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు, ఎన్బీఎఫ్‌సీల కన్వర్టబుల్‌ కాని డిబెంచర్లలో మాత్రమే బ్యాంకులు పెట్టుబడులు పెట్టాల్సి ఉందని ఆర్బీఐ గవర్నర్‌ తన టీఎల్టీఆర్వో 2.0లో పేర్కొన్నారు. ఆ రకంగా చూస్తే 50 శాతం చిన్న, మధ్యతరహా ఎన్బీఎఫ్‌సీలు, ఎంఎఫ్‌ఐలకు 50 వేల కోట్లు వెళ్తాయి. కానీ వాస్తవం వేరే విధంగా ఉన్నది. ఎంఎఫ్‌ఐలు దాన్ని పొందడం లేదు. కాబట్టి, ఆర్బీఐ ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించాలి, ప్రత్యామ్నాయ మార్గాలు కూడా    వెతుకాలి.

అన్నిరంగాలు ఇప్పుడు వ్యవస్థలో ద్రవ్యం అందుబాటులో ఉండటానికి వీలైన అవకాశాల కోసం ఆర్బీఐ వైపు చూస్తున్నాయి. ఆర్బీఐ పిలుపు మేరకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ను 25 బేసిస్‌ పాయింట్ల ద్వారా 3.75 శాతానికి తగ్గించింది. అవసరమైనవారికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులను సమాయత్తం చేయడం, ఎంఎస్‌ఎంఈలు లేదా ఇతర రంగాల ద్వారా, బ్యాంకుల ద్వారా ద్రవ్యాన్ని మార్కెట్లోకి పంపడం దీని ఉద్దేశం కావచ్చు. అయితే, బ్యాంకులు పలు రంగాలకు రుణాలిచ్చే లక్ష్యాన్ని దెబ్బతీస్తుంటాయనేది అనుభవంలో కనిపిస్తున్న వాస్తవం. 

ఆర్బీఐ 25 బేసిస్‌ పాయింట్లను తగ్గించింది. రివర్స్‌ రెపో ఆపరేషన్ల కింద శోషణ (absorption)ను కొన్ని వేల కోట్లకు తగ్గించింది. ఆర్బీఐ వద్ద  6.9 లక్షల కోట్లు ఉన్నాయి. బ్యాంకింగ్‌ వ్యవస్థను జాగ్రత్తగా చూసుకోవడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇది అవసరమే. కానీ, అదే సమయంలో వ్యాపారాలు, ఉత్పత్తి యూనిట్లు, పరిశ్రమలపై సమాన శ్రద్ధ చూపించాలి. ఆర్బీఐ నిజంగా మార్కెట్లోకి డబ్బును పంప్‌ చేయాలనుకుంటే, రివర్స్‌ రెపో రేటును సున్నా శాతానికి తగ్గించాలి. అప్పుడే ఆర్థికచక్రం కదులుతుంది. ఉత్పాదక కార్యకలాపాలు ప్రారంభమవుతాయి.

‘కరోనా వైరస్‌ మనకు అనేక గుణపాఠాలు నేర్పింది. మనకు మనం మన అవసరాలకు తగ్గట్లుగా స్వయంప్రతిపత్తితో, స్వయం సమృద్ధిగా ఉండాలని నేర్పించింది’ అని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని అందరూ గ్రహించాలి. ఆర్బీఐ రూ.50 వేల కోట్లు సమకూర్చింది. కానీ వినియోగాన్ని చూస్తే, అది రూ.2,000 కోట్లు మాత్రమే! కాబట్టి, హెచ్చరిక ఏమంటే, ఎన్బీఎఫ్‌సీలను ఈ ఫండ్‌ను ఒకేవిధంగా లేదా మరొకవిధంగా యాక్సెస్‌ చేయడానికి అనుమతించాలి. లేదా ఆర్బీఐ ఎన్బీఎఫ్‌సీల నుంచి కాగితాలను కొనుగోలు చేయవచ్చు. ఆర్బీఐ ఆర్థిక జోక్యాలు చేసుకుంటే తప్ప, డబ్బు అది ఉద్దేశించిన, అవసరమైనచోటికి చేరుకోదు. జీవనోపాధి భరోసా వంటి రంగాలకు రుణాలు చేరేలా చూడటం కేంద్రం బాధ్యత. బ్యాంకులు తమ మొత్తం బాండ్లలో 2 శాతం మేరకు ఎన్బీఎఫ్‌సీ ఫ్లోటెడ్‌ పేపర్లు లేదా డిబెంచర్లను కొనుగోలు చేయాలని కేంద్రం కోరవచ్చు. లేదా, ఆర్బీఐ స్వయంగా కొనుగోలు చేయవచ్చు. 

కరోనా వైరస్‌ కారణంగా, ఆతిథ్యం, విమానయానం, రవాణా, ఉత్పత్తి వంటి అన్నిరంగాల మూలధనం సున్నాగా మారింది. కాబట్టి, ఈ రంగాలకు కేంద్రం కొంత పరిపుష్టి ఇవ్వాలి. కుదేలైన రంగాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇంకా ఆలస్యం చేయకుండా 25 శాతం పని మూలధనాన్ని వెంటనే ప్రకటించాలి. ఆర్బీఐ లిక్విడిటీ కవరేజ్‌ రేషియో అవసరాన్ని 80 శాతానికి తగ్గించింది. బ్యాంకులు తమ నిధులను తక్కువ వడ్డీతో ఎందుకు పార్క్‌ చేస్తున్నాయని ఆర్బీఐ అడుగాల్సి ఉంది. ముఖ్యంగా ఎంఎస్‌ఎంఈలకు ఎవరు సహాయం చేస్తారు? ప్రస్తుతం దెబ్బతిన్న భారత ఆర్థికవ్యవస్థలో ద్రవ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆర్బీఐ సత్వరమే కొన్ని చర్యలు చేపట్టాలి. అవసరమైనవారికి రుణాలు ఇవ్వాలి. సవరించిన ఎంఎస్‌ఎంఈల వర్గీకరణ చాలాకాలం నుంచి పెండింగ్‌లో ఉన్నది. దానిని వెంటనే ఆర్డినెన్స్‌ ద్వారా అమలుచేయాలి. కరోనా సందర్భాన వైద్యు లు, ఫ్రంట్‌లైన్‌ కార్మికులను రక్షించడానికి కేంద్రం కొద్దిరోజుల కిందట అంటువ్యాధుల చట్టాన్ని సవరించడానికి ఒక ఆర్డినెన్స్‌ ప్రకటించడం స్వాగతించదగినది. అదే స్ఫూర్తితో, కొవిడ్‌ తదుపరి లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కోవటానికి రాష్ర్టాలకు ఎఫ్‌ఆర్బీఎం పరిమితిని తిరిగి నిర్ణయించాలి. ఇందుకోసం ఎఫ్‌ఆర్బీఎం చట్టాన్ని సవరించడానికి కేంద్రం మరొక ఆర్డినెన్స్‌ను తీసుకురావాలి.కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థను చక్కదిద్దేందుకు ఆర్బీఐ, కేంద్రం జోక్యం అత్యావశ్యకం. అది సరఫరా, డిమాండ్లను ఉత్తేజ పరిచేవిధంగా ఉండాలి. ఎందుకంటే డిమాండ్‌ లేకుండా ఆర్థిక లేదా ఇతర విధానాలు పెద్దగా సహాయపడవు. కాబట్టి, కరోనా కారణంగా కుదేలైన ఆర్థికవ్యవస్థ నేపథ్యంలో కేంద్రం, ఆర్బీఐలు మొత్తం పరిస్థితిని సమగ్రంగా చూడాలి. కుంటుపడిన ఆర్థికవ్యవస్థకు కలిసి కాయకల్ప చికిత్స చేయాలి. అప్పుడే మన ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందన్న భరోసా కలుగుతుంది. కరోనాతో కుదేలైన దేశ ఆర్థికవ్యవస్థ రెండంకెల వృద్ధితో వర్ధిల్లుతుందని ఆశిద్దాం.

(వ్యాసకర్త: చేవెళ్ల లోక్‌సభ సభ్యులు)

డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి


logo