ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 21, 2020 , 23:20:47

జనుల ‘భాగ్య’వర్మ

జనుల ‘భాగ్య’వర్మ

నిమ్నజాతుల నాయకుడు అనగానే గుర్తుకొచ్చే మొదటిపేరు అంబేద్కర్‌. ఆయనకన్నా ముందే హైదరాబాద్‌ కేంద్రంగా దళితుల అభ్యున్నతి కోసం కృషిచేసిన వ్యక్తి మాదరి వెంకట భాగ్యరెడ్డివర్మ. ఈయన 1888 మే 22న హైదరాబాద్‌లో రంగమాంబ-వెంకయ్య దంపతులకు జన్మించారు.భాగయ్యగా ఉన్న ఆయన పేరును కుల గురువు భాగ్యరెడ్డి గా మార్చారు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆర్యసమాజ్‌ వాళ్లు ‘వర్మ’ అనే బిరుదునిచ్చారు.భాగయ్య భాగ్యరెడ్డివర్మ అయ్యారు.

భాగ్యరెడ్డివర్మ 1906లో జగన్‌ మిత్రమండలిని స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. అంటరానితనం నిర్మూలనకు కృషిచేశారు. దేవదాసి, జోగిని దురాచారాల అంతానికి పనిచేశారు. బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పడానికి, దళితుల ప్రగతికి పాటుపడ్డారు. శుభకార్యాల్లో మద్య, మాంసాల వినియోగం జరుగకుండా చూశారు. హైదరాబాద్‌కే పరిమితం కాకుండా ఆంధ్రాలో, రాయలసీమలోనూ దళితుల పురోగతికి కృషిచేశారు. ఆది హిందూ ఉద్యమ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు.

1910లో భాగ్యరెడ్డివర్మ దళితుల్లో ధార్మిక, నైతిక, ప్రచారం కోసం ప్రచారిణీసభను ప్రారంభించారు. నాడు అంటరానివాళ్లకు విద్యాలయాల్లో ప్రవేశం లేదు.దీన్ని గుర్తించి 1910లో జగన్‌ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈసామియా బజార్‌లో మొదటి పాఠశాలను ప్రారంభించారు. తక్కువ సమయంలోనే 2,600 మంది విద్యార్థులతో 26 పాఠశాలలయ్యాయి. భాగ్యరెడ్డివర్మ ఉద్యమకారుడే కాదు పత్రికా సంపాదకుడు, రచయిత కూడా. 1912లో తొలిసారిగా ఆంధ్రపత్రికలో వ్యాసాలు రాశారు. ఆది హిందూ, భాగ్యనగర్‌ పత్రికల నిర్వాహకుడిగా వ్యవహరించారు. 1917 నవంబర్‌ 4,5,6 తేదీలలో మూడురోజులపాటు విజయవాడలో ఆంధ్రా ప్రాంత ప్రథమ పంచముల సభ భాగ్యరెడ్డి అధ్యక్షతన జరిగింది.  1917 డిసెంబర్‌ 15న కలకత్తాలో అఖిల భారత హిందూ సంస్కరణ సభ జరిగింది. నాటి సభలో ఆయన చేసిన ప్రసంగం ప్రశంసలు పొందింది. ఈ సభలో మహాత్మాగాంధీ పాల్గొన్నారు. భాగ్యరెడ్డివర్మ ఆది హిందూ సాంఘిక సేవాసమితిని స్థాపించారు. అనేక గ్రంథాలను ప్రచురించారు. ఆది హిందువుల్లో వివిధ ఉప కులాలకు చెందినవారందరినీ ఏకం చెయ్యాలనే లక్ష్యంతో 1931జులై 10న ఎంఎన్‌ ఆదెయ్య అధ్యక్షతన ఆది హిందూ ధార్మిక సమ్మేళనం నిర్వహించారు. భాగ్యరెడ్డి వర్మ మొదట్లో ఆర్యసమాజ్‌తో ఉన్నా, తర్వాత విభేదించి  బౌద్ధం వైపు మొగ్గుచూపారు. అట్టడుగు వర్గాల ప్రగతికి కృషిచేసిన భాగ్యరెడ్డివర్మ క్షయవ్యాధితో 1939 ఫిబ్రవరి 18న కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకున్నా సమాజానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.

- ఆచార్య గిడ్డి వెంకటరమణ 

(నేడు భాగ్యరెడ్డి వర్మ జయంతి)


logo