శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 20, 2020 , 23:16:55

నిజం నిగ్గు తేలాలె

నిజం నిగ్గు తేలాలె

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వేదికగా అమెరికా, చైనాలు ఆధిపత్య రాజకీయాలకు తెరలేపాయి. చైనా అనుకూల వైఖరి విడనాడకపోతే డబ్ల్యూహెచ్‌వోకు నిలిపేసిన వార్షిక నిధులను శాశ్వతంగా రద్దుచేస్తామని ట్రంప్‌ హెచ్చరిస్తుంటే, ఆడలేక మద్దెల ఓడన్నట్లు స్వదేశంలో కరోనాను కట్టడిచేయలేక తమదేశంపై అక్కసు వెళ్లగక్కుతున్నాడని చైనా విమర్శిస్తున్నది. మరోవైపు చైనాపై అమెరికా చేస్తున్న వాదనలకు స్వదేశంలోనే మద్దతు లభించడం లేదు. అమెరికాలోని అంటువ్యాధుల నిపుణుడు సైతం వైరస్‌ మానవసృష్టి అనేందుకు ఆధారాల్లేవని ఓ పత్రికా సమావేశంలో ట్రంప్‌ ఎదుటనే ప్రకటించాడు. జంతు జన్యుచిత్ర క్రమాన్ని పరిశీలిస్తే అదే స్పష్టమవుతున్నదని వివరించాడు. అలాగే అమెరికా జాతీయ నిఘావిభాగం డైరెక్టర్‌ కార్యాలయం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేయడం గమనార్హం.

వైరస్‌ వ్యాప్తి వెలుగులోకి వచ్చిన నాటినుంచీ అమెరికా చైనాను అనుమానిత దేశంగా చూపుతున్నది. అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నది. మార్చి 25న జరిగిన జీ-7 దేశాల సదస్సులో చైనాకు వ్యతిరేకంగా తీర్మానం చేసేందుకు ట్రంప్‌ ప్రయత్నించినా అది ఫలించలేదు. కరోనా వైరస్‌ను చైనా వైరస్‌ అనీ, వైరస్‌ పుట్టుకకు చైనాయే కారణమని చెప్పే తీర్మానాన్ని జీ-7 దేశాలు తోసిపుచ్చాయి. క్లిష్ట సమయాల్లో ఒక దేశాన్ని తప్పుబట్టడం కాకుండా, అన్ని దేశాలూ సమన్వయంతో కలిసి నడువాల్సిన అవసరం ఉంటుందని తేల్చిచెప్పాయి. దీంతో ట్రంప్‌ వెనుకకు తగ్గి వైరస్‌పై అంతర్జాతీయ దర్యాప్తు చేయాలన్న నినాదాన్ని ముందుకుతెచ్చాడు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సదస్సు (డబ్ల్యూహెచ్‌ఏ) కరోనా పుట్టుక, వ్యాప్తిపై నిష్పాక్షిక, స్వతంత్ర, సమగ్ర అంతర్జాతీయ మదింపు జరుగాలని తీర్మానించింది. దీనికి 120 దేశాలు మద్దతు పలికాయి. ఈ సందర్భంలో కూడా ప్రపంచ కూటమి రాజకీయాలు వెలుగుచూశాయి. జపాన్‌, ఆస్ట్రేలియా, అమెరికాలు చైనాకు వ్యతిరేకంగా గళం విప్పగా, నేపాల్‌, పాకిస్థాన్‌ దూరంగా ఉన్నాయి. పరస్పర ఆధారిత ప్రయోజనాల దృష్ట్యా తీర్మానానికి భారత్‌ మద్దతు తెలిపింది. ఇదే సందర్భంగా భారత్‌ తన వ్యూహాలకు పదునుపెట్టాల్సి ఉన్నది. తైవాన్‌కు డబ్ల్యూహెచ్‌వోలో పరిశీలకదేశం హోదా లభించేలా మద్దతు తెలుపడం ద్వారా పీవోకే విషయంలో చైనా కట్టడికి వ్యూహరచన చేయాలి.

అమెరికా, చైనాల మధ్య కొంతకాలంగా ట్రేడ్‌ వార్‌ నడుస్తున్నది. వర్తక వాణిజ్యరంగాల్లో ఆధిపత్యం కోసం ఇరుదేశాలూ పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే  ప్రపంచ ఆరోగ్య సంస్థ వైఖరిని తప్పుబడుతూ సంస్థ నుంచి వైదొలుగుతామని ట్రంప్‌ హెచ్చరించాడు. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఆంబోతుల కొట్లాట లేగ దూడలకు ప్రాణసంకటంగా మారిన చందంగా, అమెరికా- చైనాల ఆధిపత్యపోరు వర్ధమాన దేశాలకు చేటు చేస్తుందన్నది నిర్వివాదం. దేశాల మధ్య వైరుధ్యాలు వైషమ్యాలు డబ్ల్యూహెచ్‌వో మనుగడకు ముప్పుగా మారడం గర్హనీయం. డబ్ల్యూహెచ్‌ఏ తీర్మానంతోనైనా దర్యాప్తుకు చైనా సహకరించి అనుమానాలను నివృత్తిచేయాలి. కరోనా నివారణ, పరిశోధనల్లో ప్రపంచదేశాలకు అన్నివిధాలా సహకరించాలి.


logo