ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 20, 2020 , 23:16:53

పంటమార్పిడితో రైతుకు లబ్ధి

పంటమార్పిడితో రైతుకు లబ్ధి

మన రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మక్కలు రాష్ట్ర అవసరాలకే సరిపోవడం లేదు. 60 శాతం మక్కలను పౌల్ట్రీల కోసమే వాడుతున్నారు. పౌల్ట్రీ దాణా ఖర్చులో 70 శాతం మక్కలకే. పౌల్ట్రీల మక్కల వినియోగం ఏటా 8-10 శాతం పెరుగుతూ వస్తున్నది. కాబట్టి కచ్చితంగా మార్కెటింగ్‌ ఉన్న పంట మొక్కజొన్న. రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. 

వ్యవసాయ రంగంలోనూ ఆధునిక సాంకే తిక పరిజ్ఞానం పెరిగింది. రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రభుత్వమే పెట్టుబడి అందిస్తున్నది. కాలువల ద్వారా సాగునీరు అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ వనరులు కూడా రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయం రైతుకు నికర లాభాన్నిచ్చేదిగా ఉండాలి. రైతు పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి అంతకుమించిన ఆదాయం రావాలి. ఇందుకోసం సాగులో సమూల మార్పులు, సంస్కరణలు చోటుచేసుకోవాలి.

ఇప్పుడున్న సాగులో కొన్ని లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొందరు రైతులు తరతరాలుగా ఒకే పంటను పండిస్తున్నారు. పంటలను ఎంపిక చేసుకునేటప్పుడు మార్కెట్‌ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవటంలేదు. స్థానిక వాతావరణం అనుకూలత, భూసారం, సాగునీటి అందుబాటు, కాలాలవారీగా ఎదురయ్యే చీడ-పీడల సమస్యను విస్మరించటంతో అధిక దిగుబడులు, నాణ్యత తగ్గుతుంటాయి. తద్వారా పండించిన పంట ఉత్పత్తులు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితులను మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తున్నది. 

ఒకే పంట సాగుతో ముడిపడి ఉన్న సమస్యలు పంజాబ్‌ రాష్ర్టానికి బాగా తెలుసు. మొదటి హరిత విప్లవ ఫలితాలు పొందిన రాష్ట్రం అది. ఏండ్ల తరబడి వరి, గోధుమ సాగుచేయటం వల్ల భూములు క్షారమయ మయ్యాయి. విచక్షణారహితంగా ఎరువులు వాడటం వల్ల భూములు రసాయనమయమై క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం భారీగా ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించింది. ఆ పంట స్థానంలో సాగునీటి ఆధారంగా రైతులు మక్కలు, కూరగాయల సాగుతో ముందుకంటే అధిక ఉత్పాదకత లాభాలు పొందగలిగారు. భూములు తిరిగి సారవంతం అవుతున్నాయి. ఒడిశా రైతులు కూడా తరచూ వరదలు, అధిక వర్షాల కారణంగా ఏండ్ల తరబడి వరి సాగు చేస్తున్నారు. ఫలితంగా పురుగులు, తెగుళ్ల తాకిడి పెరిగింది. దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు ఆ రాష్ట్రం అపరాల పంటలైన మినుము, పెసర్లు, కంది, నూనెగింజల పంటలకు భారీ ప్రోత్సాహకాలతో పంటల మార్పిడిని ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అపరాలను అందుబాటులోకి తేగలిగింది. గతేడాది ప్రపంచంలో మక్కలకు అత్యంత నష్టం కలిగించిన కత్తెర పురుగు బాగా ఉధృతంగా ఉండటానికి కారణం అమెరికాలో మొదట లక్షల ఎకరాల్లో బీటీ మొక్కజొన్ననను ఒకే పంటగా ఏండ్ల తరబడి సాగుచేయటం. అందుకే పంటమార్పిడి, వైవిధ్య పంటసాగు చేపట్టడం భూమి ఆరోగ్యానికి, రైతుల ఆదాయానికి మేలు.

రాష్ట్రంలో రైతులు నికరాదాయం పొందడానికి శాస్త్రీయమైన పంట మొక్కజొన్న. మన రాష్ట్రంలోనే పుష్కలమైన వినియోగం ఉన్నది. మార్కెటింగ్‌ పరంగా ఎక్కువ అవకాశాలున్న పంట ఇది. దేశంలో మనతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర కూడా ఎక్కువగా మక్కలు సాగుచేస్తున్నాయి. మన రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన మక్కలు రాష్ట్ర అవసరాలకే సరిపోవడం లేదు. 60 శాతం మక్కలను పౌల్ట్రీల కోసమే వాడుతున్నారు. పౌల్ట్రీ దాణా ఖర్చులో 70 శాతం మక్కలకే. పౌల్ట్రీల మక్కల వినియోగం ఏటా 8-10 శాతం పెరుగుతూ వస్తున్నది. కాబట్టి కచ్చితంగా మార్కెటింగ్‌ ఉన్న పంట మొక్కజొన్న. రాష్ట్రంలో వరి, పత్తి తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట మొక్కజొన్న. ఈ పంట వానకాలం, యాసంగిలలో సాగవుతుంది. అయితే వానకాలంలో మక్క కండెలు ఏర్పడిన తర్వాత వానలు పడితే నల్లబూజు ఏర్పడుతుంది. ఆ మక్కలు పౌల్ట్రీ బర్డ్స్‌కు దాణాగా పెడితే అనారోగ్యానికి గురవుతాయి. అందుకే సాధ్యమైనంతవరకు వానకాలం బదులుగా యాసంగిలోనే మొక్కజొన్నను సాగుచేస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనికితోడు వానకాలం కంటే రెట్టింపు దిగుబడి యాసంగిలోనే వస్తుంది. కాబట్టి మక్కల సాగును యాసంగికి మార్చడం అత్యంత శాస్త్రీయం. రాష్ర్టావసరాలు తీరితే నేపాల్‌, బంగ్లాదేశ్‌, వియత్నాం, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలు దిగుమతి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎగుమతుల ద్వారా మంచి ధర అందుతుంది.

రైతుకు సాగు నికర లాభాలు ఇవ్వాలంటే ఏ పంటలోనైనా పెట్టుబడి ఖర్చులు తగ్గాలి, నాణ్యతతో కూడిన దిగుబడులు రావాలి. అందుకు అనుకూల వాతావరణం అవసరం. మంచి నాణ్యతతో కూడిన అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న ఎండుమిర్చి నర్సంపేట, మహబూబాబాద్‌ డివిజన్లలో, ఖమ్మం జిల్లాలలో వస్తుంది. అలాగే సోయాబీన్‌ ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో, కూరగాయలు వికారాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలలో అత్యంత నాణ్యంగా ఉంటాయి. నిజామాబాద్‌లోని కమ్మరపల్లి ప్రాంతం, జగిత్యాల, కేసముద్రం ప్రాంతాలు నాణ్యతతో కూడిన పసుపు పంటల సాగుకు అత్యంత అనుకూలం. ఇటువంటివాటినే పంట కాలనీలు అంటారు. ప్రత్యేకంగా ఒకే పంటకు అక్కడి సూక్ష్మ వాతావరణం నేలలు వర్షపాతం అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఆయా పంటల నాణ్యత, దిగుబడులు ఎక్కువ.. పెట్టుబడి ఖర్చులు తక్కువ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన నియంత్రిత సాగుతో రైతులకు లాభమే తప్ప ఏ మాత్రం నష్టం ఉండదు. 

(వ్యాసకర్త: అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం)

-డాక్టర్‌ పిడిగెం సైదయ్య


logo