శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 20, 2020 , 23:16:51

వికేంద్రీకరణే విద్యుత్తుకు రక్ష

వికేంద్రీకరణే విద్యుత్తుకు రక్ష

విద్యుత్‌ వ్యవస్థలు రాష్ట్రాల పరిధిలో ఉంటేనే స్థానిక అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అభివద్ధికి బాటలు పడుతాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం బిల్లు కార్యరూపం దాలిస్తే అన్నివర్గాలకు నష్టదాయకమే.

మహాత్మాగాంధీ కలలు కన్న.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ కోరుకున్న వ్యవస్థ అధికార వికేంద్రీకరణ. ప్రభుత్వ పాలనా విభాగంలో వికేంద్రీకరణ ఇచ్చిన ఫలితాలు మరే ఇతర విధానాలు ఇవ్వవనేది ఇప్పటికే నిరూపితమైన వాస్తవం. గ్రామీణాభివృద్ధి మొదలుకొని విద్యుత్‌ వ్యవస్థ వరకు ప్రజలకు మెరుగైన సేవలు అప్పుడే సాధ్యం. కానీ ఇప్పుడు మానవ మనుగడకు అత్యవసర సేవలు అందించే విద్యుత్‌ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం కేంద్రీకృతం చేయాలని ప్రయత్నిస్తున్నది. ఇది అన్ని విధాలా నష్టదాయకం. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 17న విద్యుత్‌ సవరణ చట్టం-2020 పేరిట ఒక ముసాయిదా విడుదల చేసింది. ఈ ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపి జూన్‌ 5లోగా అభిప్రాయాలను తెలుపాల్సిందిగా గడువు విధించింది. అనంతరం ప్రతిపాదిత సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదించి చట్టంగా అమలుపరుచాలన్నది అభిమతం.

కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని ప్రదర్శించాల్సిందిపోయి రాష్ర్టాలకు తోడ్పాటు అందించకుండా హ్రస్వదృష్టితో వ్యవహరిస్తున్నది. కర్రపెత్తనం చేస్తూ రాష్ర్టాల విద్యుత్‌ సంస్థలపై గుత్తాధిపత్యాన్ని నెరపాలనుకోవడం నియంతృత్వ ధోరణే అవుతుంది. విద్యుత్‌ వ్యవస్థలు రాష్ర్టాల పరిధిలో ఉంటేనే స్థానిక అవసరాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అభివృద్ధికి బాటలు పడుతాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ చట్టం బిల్లు కార్యరూపం దాలిస్తే అన్ని వర్గాలకు నష్టదాయకమే. విద్యుత్‌పై రాష్ర్టాలకున్న అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వం గుప్పిట్లోకి వెళ్లిపోతాయి. నిపుణులు చెప్తున్న ప్రకారం అన్ని క్యాటగిరీల్లోని వినియోగదారులు మొదలుకొని విద్యుత్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి విఘాతం కలుగక తప్పదు. 

కేంద్రం తొలుత క్రాస్‌ సబ్సిడీని ఎత్తివేస్తుంది. దీనివల్ల రైతాంగం, బలహీనవర్గాలకు చెందిన గృహ వినియోగదారులు నష్టపోవాల్సి వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఉచిత విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఇవ్వలేని పరిస్థితులు నెలకొంటాయి. రాష్ట్రంలో 24 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నింటికి మీటర్లు బిగించాల్సి ఉంటుంది. డిస్కవ్‌ అధికారుల అంచనా ప్రకారం.. మీటర్లు బిగించడానికి రూ.976కోట్లు అవసరమవుతాయి. వ్యవసాయానికి కరెంటు వినియోగం పరిశీలిస్తే.. ఒక మోటర్‌ ఉన్న రైతు ఏడాదికి సుమారు 8 వేల యూనిట్లు వాడుతున్నారు. ప్రస్తుతం కాస్ట్‌ ఆఫ్‌ సర్వీస్‌ యూనిట్‌ (సబ్సిడీ లేకుండా) ధరతో పోల్చితే ఏడాదికి సుమారు రూ.59 వేల బిల్లు చెల్లించాల్సి వస్తుంది. అంటే నెలకు సుమారు 5 వేలు కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ సబ్సిడీని నగదు రూపంలో కొంతమేర ఇచ్చినా మిగిలింది రైతులే భరించాల్సి ఉన్నది. ఇలా రైతాంగం మెడపై కరెంటు కత్తి పడినట్లే. విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరించే రహస్య అజెండా కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నట్లు స్పష్టమవుతున్నది. 

ఏటా కరెంటు చార్జీలు, ప్రభుత్వం భరించాల్సిన రాయితీలను రాష్ట్ర ఈఆర్సీ (స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌) ప్రకటిస్తుంది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్లను) కూడా కమిషనే నిర్ణయిస్తుంది. ఇప్పుడు కేంద్రం ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఈసీఈఏ (ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ)ని నియమిస్తుంది. దీనివల్ల రాష్ట్రాల అధికారాలన్నీ కేంద్రం చేతుల్లోకి వెళ్తాయి. కరెంటు చార్జీలను నిర్ణయించడం, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల వంటి అంశాలన్నీ కేంద్రానికి బదిలీ అవుతాయి. రాష్ర్టాలు స్వయంప్రతిపత్తి కోల్పోతాయి. 

విద్యుత్‌ పంపిణీ కాంట్రాక్టర్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉన్నది. ఆ ప్రక్రియ వల్ల లాభాలు వచ్చే ప్రాంతాలన్నీ ప్రైవేటు చేతుల్లోకి వెళ్లి అంతగా ఆదాయం లేని గ్రామీణ ప్రాంతాలు ప్రభుత్వ ఆధీనంలో మిగులుతాయి. దానివల్ల డిస్కంలు నష్టపోయే అవకాశం ఉన్నది. రెన్యువబుల్‌ ఎనర్జీ పాలసీ పేరిట రాష్ర్టాలపై కేంద్రం మరో గుదిబండ మోపే సూచనలు కనిపిస్తున్నాయి. సబ్‌లైసెన్స్‌, ఫ్రాంచైజీలు, ఓపెన్‌ యాక్సెస్‌ వంటి విధానాల వల్ల ప్రైవేటు గుత్తాధిపత్యం మొదలవుతుంది. రాష్ట్రంలో ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థల్లో 50 వేల మందికిపైగా ఉద్యోగులున్నారు. వీరిలో సుమారు 27 వేల మంది ఉద్యోగులు కాగా 23 వేల మంది ఆర్టిజన్స్‌ ఉన్నారు. ప్రైవేటు యాజమాన్యాలు తక్కువ మానవ వనరులతో ఎక్కువ పని తీసుకుంటాయి. గోల్డెన్‌ షేక్‌హ్యాండ్‌, వాలంటరీ రిటైర్మెంట్‌ సర్వీస్‌ వంటి పథకాలను రుద్దుతాయి. నూతన ఉద్యోగాల కల్పన మృగ్యమవుతుంది. 

ఉద్యోగుల భద్రతకు ముప్పు వాటిల్లే ఎలాంటి పరిణామాన్నయినా కార్మిక సంఘాలు ఐక్యంగా ఎదుర్కొంటాయి. స్వరాష్ట్రం సాధించుకొని అన్నిరంగాల్లో స్వావలంబన దిశగా వెళుతుంటే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నది. ఈ బిల్లును మన రాష్ట్రంతోపాటు పలు రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ ఆయా ప్రభుత్వాలకు మద్దతుగా ఉద్యమించేందుకు విద్యుత్‌ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారు.

(వ్యాసకర్త: టీఎస్‌ పవర్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు)

ఎం.ఎ.వజీర్‌ 


logo