శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 20, 2020 , 23:16:48

ఒక తరగతి ఒక చానెల్‌

ఒక తరగతి ఒక చానెల్‌

కొవిడ్‌-19 పరిణామాలు విద్యావ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విశ్వవ్యాప్తంగా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు దాదాపు 150 కోట్ల మంది విద్యార్థుల చదువులు ప్రభావితమయ్యాయి. ఈ పరిస్థితి మొత్తం విద్యావ్యవస్థలో సమూల మార్పులకు దారితీయనున్నది. విద్యా సంవత్సరం ప్రారం భం, నిర్వహణ గురించి సందేహాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్‌ తయారీలో ఆలస్యం, ప్రస్తుత దుస్థితి దీర్ఘకాలం కొనసాగుతుందన్న అంచనాలతో విద్యారంగం కొత్త వ్యూహాలకు సానపట్టాల్సిన తరుణమిది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో విద్యా రంగం ముందున్న ప్రత్యామ్నాయం డిజిటల్‌ విద్య, ఆన్‌లైన్‌ బోధన.

అభివృద్ధి చెందిన దేశాల్లో దాదాపు 70 శాతం మందికి తరగతి గదుల ద్వారానే బోధన కొనసాగుతుంది. ఆన్‌లైన్‌ విధానంలో విద్యాబోధన చాలా మందికి కొత్త అనుభవమే అయినా ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు నూతన పరిణామాలకు మారాల్సిన అనివార్యత ఏర్పడింది. మెకన్సీ 2019 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ పాఠాల కోసం స్మార్ట్‌ఫోన్లు వినియోగించే యువత 70 శాతానికి పైగా ఉన్నది. జూమ్‌, కైజాల్‌ వంటి రకరకాల యాప్‌లతో ఇప్పుడు ఆన్‌లైన్‌ పాఠాలు స్మార్ట్‌ఫోన్ల ద్వారా విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. 

జాతీయస్థాయిలో లాక్‌డౌన్‌ అనంతరం తెరుచుకోనున్న విద్యాసంస్థలకు కేంద్రం పలు జాగ్రత్తలతో మార్గదర్శకాలను జారీచేసింది. రాబోయే విద్యాసంవత్సరం కూడా భౌతిక దూరాన్ని పాటించేందుకు సరి-బేసి విధానాన్ని అమలుచేయాలని జాతీయ విద్య పరిశోధన, శిక్షణ మండలి.. మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఆదేశించాయి. ఈ విధానంలో 50 శాతం మంది విద్యార్థులకు రోజువిడిచి రోజు ఆఫ్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలి. మిగతా 50 శాతం మంది విద్యార్థులకు ఆన్‌లైన్లో ఇంటి వద్దనే తరగతులు నిర్వహించాలి. 

ఉన్నతవిద్య వరకు ఆన్‌లైన్‌ విధానం బాగానే ఉన్నా, పాఠశాల స్థాయిలో ఆన్‌లైన్‌ విద్యను మరింత ప్రోత్సహించే విధంగా ఒకటి నుంచి 12 తరగతుల విద్యార్థులకు వేర్వేరుగా విద్యాచానళ్లు ప్రారంభిస్తున్నారు. ఒక తరగతి.. ఒక చానెల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులకు ప్రస్తుతం మూడు చానెళ్ల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తున్నారు. మరో 12 స్వయంప్రభ చానెళ్లతో ప్రతి తరగతికి ఒక చానెల్‌ ఉండేవిధంగా ఏర్పాటుచేస్తున్నారు. దీనికి టాటా స్కై, ఎయిర్‌టెల్‌ వంటి డీటీహెచ్‌ ప్రైవేట్‌ ఆపరేటర్ల సహాయం తీసుకుంటున్నారు. డిజిటల్‌, ఆన్‌లైన్‌ విద్యకు సంబంధించి పీఎం ఈ-విద్య పేరుతో ఒక బహుముఖ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. పాఠశాల విద్యలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫర్‌ నాలెడ్జ్‌ షేరింగ్‌ (దీక్ష) యాప్‌ను విస్తృతంగా వాడకంలోకి తీసుకొచ్చి అవసరమైన పాఠ్యాంశాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వయంగా డౌన్‌లోడ్‌ చేసుకునే విధానాన్ని కల్పిస్తున్నారు. కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల, తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురాక తప్పదు. పాఠ్యాంశాలు పూర్తిచేయడం, పరీక్షలు పెట్టడం, మూల్యాంకనం చేయడం విద్యాసంవత్సరాన్ని కాపాడుకోవడం మనముందున్న సవాళ్లు. దీనికోసం సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడం తప్ప వేరే మార్గం లేదు.

(వ్యాసకర్త: రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం)

-డాక్టర్‌ చల్లా ప్రభాకర్‌ రెడ్డి


logo