బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 23:29:44

రైతుహిత సేద్యం

రైతుహిత సేద్యం

తెలంగాణలో నియంత్రిత వ్యవసాయ విధానంతో గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. పల్లెలన్నీ పసిడి పంటల లోగిళ్లుగా ధాన్యరాసులతో కళకళలాడనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పంటమార్పిడితో నియంత్రిత సాగుకోసం రైతులను చైతన్యపరుస్తూ, దానికనుగుణంగా నడుచుకోవాలని పిలుపునిచ్చింది. పంటలకు గిట్టుబాటు ధరలు రావాలన్నా, పండిన పంట మార్కెట్‌లో అమ్ముడుపోని దుస్థితి తలెత్తకుండా ఉండాలన్నా నియంత్రిత వ్యవసాయమే పరిష్కారమని ప్రభుత్వం తెలిపింది. దీనికి అవసరమైన కార్యాచరణను చేపట్టి, ఐదువేల ఎకరాల చొప్పున 2,604 క్లస్టర్లను ఏర్పాటుచేసింది. వ్యవసాయాధికారులతో నిరంతర పర్యవేక్షింపజేస్తూ మార్గనిర్దేశనం చేయనున్నది. రాష్ట్ర అవతరణ తర్వాత సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కోటీ 20 లక్షల ఎకరాలు సాగులోకి తేవటమే కాదు, వ్యవసాయరంగంలో అద్భుత ఫలితాలు సాధించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 90 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి అమ్మడం ద్వారా నవశకానికి నాంది పలికింది.

వ్యవసాయానికి జీవనాడిగా అవసరమయ్యే ఐదురకాల సారవంతమైన నేలలు తెలంగాణ సొంతం. వాతావరణ సమశీతోష్ణస్థితి అదనపు వనరు. ఈ సానుకూల భౌతిక, వాతావరణ పరిస్థితులను సద్వినియోగం చేసుకొని భిన్నరకాల పంటల సాగుతో రైతులు లాభాలబాట పట్టాలి. మూసపద్ధతి వ్యవసాయం నుంచి మారినప్పుడే ‘అమ్మబోతె అడివి- కొనబోతే కొరివి’గా ఉన్న రైతు బతుకు సమస్యల వలయం నుంచి బయటపడుతారు. అందుకనే ఈ వానకాలంలో కోటీ 33 లక్షల ఎకరాల సాగుభూమిలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేయాలో ప్రభుత్వం వివరించింది. ప్రజల ఆహార అవసరాలు తీర్చటంతోపాటు, రైతులు లాభాలు అర్జించేలా చూడాలన్నది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. కొందరు అపోహ పడుతున్నట్లు నిర్బంధంగా రైతులను వారి పంటలనుంచి దూరంచేస్తారనేది గిట్టనివారి ప్రచారమే. సాగుభూమి స్థితిగతులు, నీటి లభ్యత, పంట విస్తీర్ణాల ఆధారంగా రైతులను ఒప్పించి మెప్పించడం ద్వారా మాత్రమే నియంత్రిత వ్యవసాయాన్ని ఆచరణలోకి తేవాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

క్రమబద్ధమైన వ్యవసాయానికి చైతన్యంతోపాటు, వ్యవసాయ యంత్రపరికరాలు, విత్తనాలు, ఎరువులతో పాటు పురుగుమందులను అందుబాటులో ఉండాలి. వ్యవసాయంలో విత్తనాల పాత్ర కీలకం. నకిలీ విత్తనాలతోనే రైతులు ఎక్కువ నష్టపోతున్న దుస్థితి ఉన్నది. ఇలాంటప్పుడు విత్తనాల నాణ్యత వివరాలను రైతులకు చెప్పనవసరం లేకుండా కంపెనీలకు వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడం గర్హనీయం. కొన్నిరకాల పంటల సాగుకు మానవ వనరులు ఎక్కువ అవసరం. వరిసాగులో నాటు మొదలు పంట కోసేదాకా యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. పత్తిసాగులో అవసరమయ్యే యంత్రాలు అందుబాటులోకి రాలేదు. ఇలాంటి నిర్దిష్ట అవసరాలను గుర్తెరిగి వాటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం వీటన్నింటిని పరిగణనలోకి తీసుకునే రైతులకు మరింతగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే నియంత్రిత వ్యవసాయ విధానానికి సంకల్పించటం హర్షణీయం.


logo