మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 23:29:41

సమీపతీరం ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’

సమీపతీరం ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’

స్పానిష్‌ ఫ్లూ, ఏషియన్‌ ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ అని రకరకాల ఫ్లూలు ఏదో పేరుతో ఏటా వచ్చిపోతున్నాయి. వాటికి మందే తప్ప వ్యాక్సిన్‌ లేదు. ఇన్ని ఫ్లూలు దాడిచేసినా మానవజాతి తట్టుకోవడానికి కారణం ఫ్లూను జయించే హెర్డ్‌ ఇమ్యూనిటీ సమకూరడమే. ప్రతీ సందర్భంలో వ్యాక్సిన్‌, మెడిసిన్‌ రాకముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ కారణంగా వాటి వ్యాప్తి క్షీణించింది. కొవిడ్‌-19కు వ్యాక్సిన్‌ కనిపెట్టడం సుదూర, అంతిమ పరిష్కారమైతే, ఈ భయంకర పరిస్థితిలో ప్రపంచానికి సమీపంలో కనిపించే తీరం హెర్డ్‌ ఇమ్యూనిటీ.

భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించుకుంటూ పోవడం వెనుక, పాజిటివ్‌గా తేలినవారిని కూడా పదిరోజుల తర్వాత పరీక్షలు నిర్వహించకుండా వదిలేయాలనే మార్గదర్శకాల వెనుక కారణం కాలం గడుస్తున్నకొద్దీ హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకమే.  

క్రిస్టఫర్‌ కొలంబస్‌ పసిఫిక్‌ మహాసముద్రంలో నౌకాయాత్ర చేస్తూ 1492లో అమెరికాను గుర్తించి, యూరప్‌కు పరిచయం చేశాడు. ఆ క్రమంలో కొలంబస్‌ బృందం ద్వారా అంటురోగాలు సోకి, దక్షిణ అమెరికాలో స్థానిక రెడ్‌ ఇండియన్స్‌ అసంఖ్యాకంగా చనిపోయారు. తమ శరీరంలో సజీవంగా ఉన్న వైరస్‌ ఇతరులకు సోకిందే తప్ప, కొలంబస్‌ బృందాన్ని ఏమీచేయలేకపోయింది. యూరప్‌లో అప్పటికే స్మాల్‌పాక్స్‌, ఇన్‌ఫ్లుయెంజా లాంటి వైరస్‌లకు మంద లేదా సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సాధించిన కారణంగా కొలంబస్‌ బృందం తట్టుకోగలిగింది.

తట్టు, గవదబిల్లలు, పొంగు లాంటి జబ్బులు రాకుండా వేసే ఎంఎంఆర్‌ వ్యాక్సిన్‌ పిల్లల్లో బుద్ధిమాంద్యానికి కారణమవుతున్నదని ఇంగ్లండ్‌ వైద్య పరిశోధకుడు వేక్‌ ఫీల్‌ 1997లో ఓ అశాస్త్రీయ విషయం వెల్లడించాడు. అది నిజమని నమ్మిన చాలామంది టీకాలు తీసుకోవడానికి వెనుకంజ వేశారు. దీంతో ఆ వ్యాధులు మళ్లీ తిరుగబెట్టాయి. అయినప్పటికీ మానవాళి ఎక్కువ ప్రాణనష్టం లేకుండా బయటపడింది. దీనికి కారణం అప్పటికే పెంపొందిన హెర్డ్‌ ఇమ్యూనిటీ.

పోలియో వ్యాధి ప్రబలంగా ఉన్నప్పుడు అమెరికా వ్యాక్సిన్‌ కనిపెట్టింది. ఈ వ్యాక్సిన్‌ పట్ల భారత్‌ సహా చాలాదేశాల్లో ప్రత్యేకించి ఓ మతం వారు వ్యతిరేకత చూపారు. అపోహతో జనం టీకాలు నిరాకరించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్‌ వచ్చిన తర్వాత కూడా కేసులు నమోదయ్యాయి. అయినా పెద్ద సంఖ్యలో జనం జబ్బుబారిన పడకపోవడానికి కారణం హెర్డ్‌ ఇమ్యూనిటీ. 

స్పానిష్‌ ఫ్లూ, ఏషియన్‌ ఫ్లూ, బర్డ్‌ ఫ్లూ, స్వైన్‌ ఫ్లూ అని రకరకాల ఫ్లూలు ఏదో పేరుతో ఏటా వచ్చిపోతున్నాయి. వాటికి మందే తప్ప వ్యాక్సిన్‌ లేదు. ఇన్ని ఫ్లూలు దాడిచేసినా మానవజాతి తట్టుకోవడానికి కారణం ఫ్లూను జయించే హెర్డ్‌ ఇమ్యూనిటీ సమకూరడమే. ప్రతీ సందర్భంలో వ్యాక్సిన్‌, మెడిసిన్‌ రాకముందే హెర్డ్‌ ఇమ్యూనిటీ కారణంగా వాటి వ్యాప్తి క్షీణించింది. కొవిడ్‌-19కు ఎప్పుడు విరుగుడు మందు వస్తుందో ఎవరూ ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారు. వ్యాక్సిన్‌ కనిపెట్టడం సుదూర, అంతిమ పరిష్కారమైతే, ఈ భయంకర పరిస్థితిలో ప్రపంచానికి సమీపంలో కనిపించే తీరం హెర్డ్‌ ఇమ్యూనిటీ.

శరీరంలోకి ప్రవేశించే వైరస్‌, బ్యాక్టీరియా, ఫంగస్‌, ప్రొటోజోవా తదితర వ్యాధికారక క్రిములపై తెల్ల రక్తకణాల్లో ఉత్పత్తయ్యే ప్రొటీన్స్‌ సైనికుల్లా పోరాడుతాయి. రోగనిరోధక శక్తి కలిగి ఉండే ఆరోగ్యవంతుల శరీరాలు పోరాటంలో విజయం సాధిస్తాయి. వైరస్‌, బ్యాక్టీరియాలు సోకినప్పటికీ, వాటిని జయించిన మనుషుల సంఖ్య పెరుగడం వల్ల హెర్డ్‌ ఇమ్యూనిటీ ఏర్పడుతుంది.

కరోనానే తీసుకుంటే, ఇతర ప్రయత్నాల కన్నా మానవాళిలో ఉండే సహజసిద్ధమైన రోగనిరోధక శక్తే వైరస్‌వ్యాప్తిని ఎక్కువగా నియంత్రిస్తున్నది. శరీరతత్వాలను బట్టి వైరస్‌ మూడురకాలుగా ప్రభావం చూపుతుంది. మొదటిరకంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉండే శరీరాల్లో ప్రవేశించే వైరస్‌ మనిషిని జబ్బున పడేస్తుంది, వారిద్వారా ఇతరులకూ సోకుతుంది. రెండోరకంలో కొందరిలో వైరస్‌ ప్రవేశించి, వారిద్వారా ఇంకొందరికి సోకుతుంది. కానీ వారిని ఇబ్బంది పెట్టలేదు. వారిద్వారా వ్యాప్తి మాత్రం జరుగుతుంది. ఇక మూడో రకం.. శరీరంలో ప్రవేశించిన వైరస్‌ను వారిలోని రోగనిరోధక శక్తి అంతమొందిస్తుంది. వైరస్‌ వ్యాప్తి ఆగుతుంది. చైన్‌ అక్కడికక్కడే బ్రేక్‌ అవుతుంది. మూడోరకం మనుషుల సంఖ్య పెరుగడమే హెర్డ్‌ ఇమ్యూనిటీ. 

ఇప్పటిదాకా మానవాళిని ఇబ్బందిపెట్టిన వైరస్‌ల వ్యాప్తి ప్రభావాన్ని బట్టి  ఎంత శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ ఉండాలనేది శాస్త్రీయంగా నిర్ధారించారు. డిఫ్తీరియా వ్యాప్తి నియంత్రణకు 83 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ కావాలి. శ్వాసనాళ సంబంధ వ్యాధి (ఇన్‌ఫ్లుయెంజా)కి 29, తట్టు (చిన్నమ్మవారు- మీజిల్స్‌)కు 92, గవదబిళ్లల (మంప్స్‌)కు 75, పోలియోకు 50, రుబెల్లాకు 83, పెద్దమ్మవారు (స్మాల్‌ పాక్స్‌)కు 80 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ కావాలి. కరోనా వ్యాప్తిని నిరోధించాలంటే 55 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ కావాలి. అంటే సమాజంలోని 55 శాతం మందిలో వైరస్‌ ప్రవేశించి, అంతమొందితే హెర్డ్‌ ఇమ్యూనిటీ సమకూరినట్లే.

ప్రపంచ ఆరోగ్యసంస్థ అంచనాల ప్రకారం జనాభాలో 70 శాతం మందికి కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉన్నది. వ్యాధి లక్షణాలు కనిపించినవారికి, అనుమానితులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు నిర్వహించని చాలామందిలో వైరస్‌ వచ్చిపోతున్నట్లు కూడా పరిశోధనల్లో తేలుతున్నది. 80 శాతం మంది 44 ఏండ్లలోపే కలిగిన భారత్‌లో హెర్డ్‌ ఇమ్యూనిటీ చాలా తొందరగా సాధ్యమనే అంచనాలున్నాయి. భారత్‌లో కూడా హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరిగితే వ్యాక్సిన్‌, మెడిసిన్‌ రాకముందే కరోనా వైరస్‌ వ్యాప్తి గణనీయంగా తగ్గే అవకాశాలున్నాయి.

భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించుకుంటూ పోవడం వెనుక, పాజిటివ్‌గా తేలినవారిని కూడా పదిరోజుల తర్వాత పరీక్షలు నిర్వహించకుండా వదిలేయాలనే మార్గదర్శకాల వెనుక కారణం కాలం గడుస్తున్నకొద్దీ హెర్డ్‌ ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకమే.  అది పెరిగాక వైరస్‌ బాధలు వ్యక్తిగతంగా మాత్రమే ఉంటాయి తప్ప, మొత్తం సమాజానికి ముప్పు ఉండదు.

వైరస్‌లను నిరోధించడానికి మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంచడమే లక్ష్యం కావాలి. భారతదేశంలో శిశుమరణాల్లో 69 శాతం పౌష్టికాహార లోపం వల్లే జరుగుతున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల ఏటా 41.85 లక్షల మంది మరణిస్తున్నారు. పోషకాహార సూచికలో భారత్‌ 118వ స్థానంలో ఉన్నది. ఈ గణాంకాలు ప్రజల రోగనిరోధక శక్తిని పెంచాలని హెచ్చరిస్తున్నాయి. ప్రజలకు సరైన ఆహారం అందించడానికి అయ్యే ఖర్చు లాక్‌డౌన్‌ వల్ల కలిగే నష్టంతో పోలిస్తే చాలా తక్కువ కూడా.


logo