ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 23:29:40

తెలంగాణ జలసిరి

తెలంగాణ జలసిరి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిన విషయం తెలిసిందే. ఓ దిక్కు ఎండిపోతున్న కృష్ణా. పోచంపాడు ప్రాజెక్టూ నిండలేని పరిస్థితి మరోదిక్కు. అన్నంపెట్టే రైతన్న తన వ్యవసాయ భూమికి నీళ్లు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో దశాబ్దాల కల అయినటుంటి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, ఆ రాష్ర్టానికి ఉద్యమ నేత కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలు చేసుకున్న అదృష్టం. రాష్ట్ర భౌగోళిక పరిస్థితులపై అణువణువూ అవగాహన ఉన్న కేసీఆర్‌ ప్రజా అవసరాలను, గ్రామాలను, రైతు బతుకును మననం చేసుకున్నారు. మెజారిటీ ప్రజల జీవనాధారమైన వ్యవసాయ వృత్తిని, అందుకు అవసరమైన సాగునీటిని అందుబాటులోకి తీసుకురావడం గురించి ఎన్నో పథకాలు రచించాడు. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే కాళేశ్వర మహా ప్రాజెక్టు. ఇదో అద్భుతం. 

ఒకప్పుడు ఎండిపోయి ఇసుకదిబ్బలు కనబడే గోదావరి నదిలో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జలసిరి కనబడుతున్నదిప్పుడు. గోదావరి నిండా నీళ్ల ప్రవాహమే. ఇదో మహాద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ దేశానికే ఓ రోల్‌ మోడల్‌. నీటి లభ్యత ఉన్న గోదావరి తెలంగాణలో ఉత్తర ప్రాంతం నుంచి ప్రవహిస్తుంది. ఇది నదుల ప్రాంతంలో ఉన్నది. దీనికి కుడివైపున ఉన్న తెలంగాణ అంతా గోదావరి నదికంటే ఎత్తయిన ప్రాంతంలో ఉన్నది. మహారాష్ట్రలో గోదావరిపై కట్టిన అనేక ప్రాజెక్టుల వల్ల ఆ రాష్ట్రంలో ప్రవహించే ఉపనదులు, వాగులు, కాలువలు, వర్షపు నీటిలో గోదావరి రాష్ర్టాన్ని దాటిరాకుండా చేశాయి. అందుకే పోచంపాడు కూడా సరిగా నిండలేదు. ఇక తెలంగాణ నుంచి ప్రవహించే ప్రాణహిత, మానేరు, మూసీ, కడెం, అనేక వాగులు, చెరువులు, వరద నీరంతా గోదావరిలోనే వస్తుంది. వర్షాకాలంలో ఈ నీటితో గోదావరి నిండుగా వరదై పారుతున్నది. ఈ నీటిని గోదావరిలోనే నిల్వ చేసుకోవడానికి కట్టిందే కాళేశ్వరం ప్రాజెక్టు. నీరు అందాల్సిన భూములు ఎత్తయిన ప్రదేశంలో ఉన్నాయి కాబట్టే ఇక్కడ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ (ఎత్తిపోతల) ప్రాజెక్టు కట్టాల్సి వచ్చింది.

ఇలా పలు దశల్లో తెలంగాణలోని వివిధ ప్రదేశాలకు భారీ పంపుల ద్వారా, గ్రావిటీ ద్వారా నీరు పోచంపాడు ప్రాజెక్టుకు, మిడ్‌ మానేరుకు, అప్పర్‌ మానేరుకు, కొండపోచమ్మ ప్రాజెక్టుకు, మల్లన్నసాగర్‌కు, రంగనాయకసాగర్‌కు అందుతున్నది. హైదరాబాద్‌ మహానగరం తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా, తెలంగాణ దక్షిణాదిన ఉన్న సూర్యాపేట వరకూ గోదావరి నీరు వెళ్తున్నది. తెలంగాణ ఉత్తర ప్రాంతంలో ప్రారంభమై పడమటి తీరం హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలు, దక్షిణాది సూర్యాపేటలతో తెలంగాణ అంతటినీ జలసిరులతో నింపేసే ప్రాజెక్టు ఇది. ఈ వివిధ ప్రాజెక్టుల ఫలితంగా తెలంగాణ చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలవుతున్నాయి. ఎండకాలంలోనూ అన్ని చెరువులు, రిజర్వాయర్లు, కుంటలు నీటితో కళకళలాడటానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టే. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలకు వరప్రదాయిని అయిన ఈ ప్రాజెక్టు తెలంగాణను కచ్చితంగా వ్యవసాయక్షేత్రంగా నిలుపుతుంది. ఆంధ్రప్రదేశ్‌ను కాటన్‌బ్యారేజ్‌ కళకళ లాడిస్తే, అంతకుమించిన తెలంగాణ జలసిరి కాళేశ్వరం ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రతి అంగుళానికి నీరంది ప్రతి కంచంలో బువ్వముద్దలతో తెలంగాణ ఆకలి తీరుతుంది. ఇది మనకాలపు మహా భారతం.


logo