సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 00:10:15

కేంద్రం ప్యాకేజీ ఓ భ్రాంతి

కేంద్రం ప్యాకేజీ ఓ భ్రాంతి

కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ఎవరి కోసం, ఎందుకోసం అనుకోవాలి? ఈ ప్యాకేజీ ఎవరికోసమో అర్థం కావడం లేదు.ఈ ప్యాకేజీ పేదలను, వలస కూలీలను వెంటనే ఆదుకునేదేమీకాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఉందని పెదవి విరుస్తున్నారు. వివిధ రంగాలకు అన్ని కేటాయించాం, ఇన్ని నిధులుకేటాయించామని ఆర్థికమంత్రి ప్రకటిస్తున్నారు. కానీ నిధులు ఎక్కడినుంచి తెస్తారో ఎలా వస్తాయోప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 

కేంద్ర సర్కార్‌ ప్రకటించిన ఉద్దీపన నీటి మీది రాత అనే అనుమానం వస్తున్నది. 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రధాని మోదీ ప్రకటించారు. దీనికి కావాల్సిన నిధులు ఎక్కడ నుంచి సమీకరిస్తారో ఎలా సమీకరిస్తారో మాత్రం చెప్పలేదు. పైగా ఆర్థికమంత్రి విడుతలవారీగా ఉద్దీపన పథకం వివరాలు ప్రకటించడం చూస్తుంటే నవ్వాలో, ఏడ్వాలో తెలియడం లేదు. లాక్‌డౌన్‌తో దేశవ్యాప్తంగా సుమారు 40 కోట్ల మంది వలస కూలీలు రోడ్డున పడ్డట్లు గణాంకాలు చెప్తున్నాయి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వలసకూలీలు పిల్లాపాపలతో ముల్లె మూటలను నెత్తిన పెట్టుకొని జాతీయ రహదారుల వెంట, రైలుమార్గాల వెంట నడుస్తున్న దృశ్యాలను నిత్యం మీడియాలో చూస్తున్నాం. దారిపొడవునా వారు పడుతున్న కష్టాలను, కొందరు చిన్నారులు, వృద్ధులు మృత్యువాత పడుతున్న తీరును, మరికొందరు సుదీర్ఘ దూరం రోజుల తరబడి నడిచి అనారోగ్యం పాలవుతున్న పరిస్థితిని తెలుసుకుంటున్నాం. సామాజిక మాధ్యమాల్లో కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. 

కేంద్ర ఆర్థికమంత్రి ఇవేవీ తమకు పట్టనట్లు గత మూడ్రోజులుగా మీడియా ముందుకువచ్చి ఒక గంటసేపు ఉద్దీపన పథకం వివరాలను ప్రకటిస్తున్నారు. వారి ప్రకటన వలస కూలీల కష్టాలను గటెక్కించలేదు. వలసకూలీలు ఎంతమందికి ఈ పథకం గురించి తెలుస్తుంద న్నది సందేహమే. వాళ్ల మానాన వాళ్లు తమ కాలినడక ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఎవరైనా పిడికెడు అన్నం పెట్టి గుక్కెడు నీళ్లు పోస్తే తాగి అనేక అడ్డంకులను దాటుకుంటూ తమ గమ్యానికి చేరుకోవడానికి వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. కేంద్రం ప్రకటించిన ఉద్దీపన ఎవరి కోసం, ఎందుకోసం అనుకోవాలి? ఈ ప్యాకేజీ ఎవరికోసమో అర్థం కావడం లేదు. ఈ ప్యాకేజీ పేదలను, వలస కూలీలను వెంటనే ఆదుకునేదేమీకాదని  విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మరో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినట్లు ఉందని పెదవి విరుస్తున్నారు. వివిధ రంగాలకు అన్ని కేటాయించాం, ఇన్ని నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి ప్రకటిస్తున్నారు. కానీ నిధులు  ఎక్కడినుంచి తెస్తారో ఎలా వస్తాయో ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. 

ఉద్దీపనకు వెచ్చించేది 20 లక్షల కోట్లు కాదు 20 వేల కోట్లు మాత్రమేనని ఆర్థిక నిపుణులు తేల్చిచెప్తున్నారు. ఉద్దీపన ప్యాకేజీ అమలు చేయడానికి కేంద్రం దగ్గర చాలా పరిమిత అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక   సంవత్సరానికి రూ.7 లక్షల 8 వేల కోట్లను అప్పు తీసుకోనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. బడ్జెట్‌లో ప్రకటించిన కేటాయింపులు అమలుచేయాలంటే వస్తున్న ఆదాయం సరిపోదు కాబట్టి ఆదాయ నష్టాన్ని భర్తీ    చేయడానికి ఈ అప్పు చేయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే లాక్‌డౌన్‌ సంక్షోభంతో మరింత కష్టం వచ్చిపడింది. అందువల్ల మరో 4 లక్షల 3 వేల కోట్లు అప్పు తీసుకోవాల్సి వచ్చిందని మోదీ సర్కార్‌ చెప్తున్నది. దీంతో మొత్తం అప్పు సుమారు రూ.12 లక్షల కోట్లు. ఈ మొత్తం అప్పు ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి సరిపోతుంది. అంటే దాదా పు 95.1శాతం ఆదాయ నష్టానికి సరిపోతుంది. ఇక మిగిలేది రూ.20వేల కోట్ల్లే. అందుకే 20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ కాదు 20 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ మాత్రమే అని ప్రముఖ ఆర్థికవేత్త దేవేందర్‌ కుమార్‌ పంథ్‌ స్పష్టం చేశారు. ఇండియా రేటింగ్స్‌ అనే సంస్థ కూడా ఈ విషయాన్ని ప్రకటించింది.

మోదీ సర్కార్‌ ముందు రెండు ఆప్షన్స్‌ ఉన్నాయి. ఒకటి బడ్జెట్‌లో ప్రవేశపెట్టిన మూలధన వ్యయాన్ని బాగా తగ్గించుకోవడం, ఇంకొకటి ప్రాధాన్యాలను మార్చుకోవడం. ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తే తప్ప ఉద్దీపన పథకాలకు నిధులు కేటాయించలేరు, లేదంటే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ నీటిమీద రాతగానే ఉంటుంది.   లాక్‌డౌన్‌ వల్ల 2020-21 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాలలో పేర్కొన్న ఆదాయానికి భారీ కోత పడుతుంది. స్థూల పన్ను ఆదాయం రూ.4.32 లక్షల కోట్ల మేర అలాగే పన్నేతర ఆదాయం 1.48 లక్షల కోట్ల మేర తగ్గే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వ వనరులు చాలా పరిమితం. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ దశలవారీగా, రంగాలవారీగా ఉద్దీపన ప్యాకేజీ వివరాలను ప్రకటించడంపై ఆర్థిక విశ్లేషకులు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. నిధుల్లేవు, ఎక్కడినుంచి తెస్తారో చెప్పడం లేదు. ఉద్దీపన ప్యాకేజీకి నిధులను సమీకరించకపోతే 2020-21 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ కేవలం రూ.30,42,230 కోట్ల వ్యయానికే పరిమితం కావాల్సి ఉంటుంది. 

ఉద్దీపన పథకం కోసం అదనపు అప్పు అయినా చేయాలి లేదా అదనపు కరెన్సీని అయినా ముద్రించాలి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్రవ్య ఉద్దీపనలను పరిశీలిస్తే అదనంగా అప్పు తీసుకోవడమనేది కీలకాంశంగా కనపడుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో తక్షణమే డిమాండ్‌ పెంచాలి. అంటే ద్రవ్య ఉద్దీపన కావాలి. నేరుగా పేదలకు నగదు బదిలీ చేయడం లేదా మౌలిక సదుపాయాలకు నిధుల కేటాయింపు కావాలి. తద్వారా పేదలను, వలసకూలీలను ఆదుకోవాలి. లేదంటే నరేంద్రమోదీ సర్కార్‌ ఈ దేశ ప్రజలకు మరో తప్పుడు హామీ ఇచ్చిందనుకోవాల్సి వస్తుంది. వలస కూలీలకు ఉద్దీపన ప్యాకేజీ అమలుచేయాలంటే వారి వివరాలుండాలి. అవేవీ కార్మికశాఖ దగ్గర ఉన్నట్లు కనపడటం లేదు. లెక్కలు ఉంటే వారిని ఆదుకోవడం సులభం.

(వ్యాసకర్త: ‘టీ’ న్యూస్‌ ఇన్‌పుట్‌ ఎడిటర్‌)

-పీవీ శ్రీనివాసరావు


logo