సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 00:09:01

మాటల మూటలు

మాటల మూటలు

కరోనా కష్టాల నుంచి దేశాన్ని కాపాడటం కోసమంటూ ప్రధాని మోదీ గత మంగళవారం రాత్రి 20 లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. నాటినుంచి మొదలు మొన్న ఆదివారం దాకా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఐదు విడుతలుగా ఆయా రంగాలవారీగా ఉద్దీపనలు ఎలా ఉంటాయో తెలియజేశారు. ఈ ఆర్థిక ప్యాకేజీ తీరంతా అనునయపు మాటలు, కనిపించని వాతలుగా ఉన్నది. ఉద్దీపనల వాటాలు చూసినవారికెవరికైనా ఇది కాకులను కొట్టి గద్దలకు వేసిన చందమని తేటతెల్లమవుతుంది. దశలవారీగా ఆర్థికమంత్రి వివరణల్లో ఎక్కడా సగటు జీవి కనిపించలేదు. అంతకంటే మిన్నగా వ్యవసాయాధారిత సమాజంగా ఉన్న దేశాన్ని ఈ కష్టకాలం నుంచి ఎలా గట్టెక్కిస్తారో ఎక్కడా చెప్పలేదు. దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈ) ఆదుకోవటం కోసం కేటాయించింది కొసరుగా పిసరంత.

దశలవారీగా ఆర్థికమంత్రి తెలిపిన ఉద్దీపనల్లో ఎంఎస్‌ఎంఈలకు పూచీకత్తులేని రుణాలుగా ఇచ్చింది మూడు లక్షల కోట్లు మాత్రమే. రెండోవిడుతలో వలస కార్మికులకు ఉచిత ఆహార పంపిణీకోసం 3,500కోట్లు, వీధి వ్యాపారుల కోసం ఐదువేల కోట్లు. సువిశాల దేశంలో వీధివీధినా విస్తారంగా ఉన్న వీధివ్యాపారుల కోసం ఐదువేల కోట్లు ఏ మూలకు సరిపోతాయో పాలకులే చెప్పాలె. ఈ ఉద్దీపనలను కొన ఊపిరితో ఉన్నవారికి చావు గంజిపోసిన తీరుగా కూడా లేదు. చివరిదైన ఐదో విడుతలో మోదీ ప్రభుత్వం తనదైన ఆర్థిక విధానాన్నంతటిని బయటపెట్టుకున్నది. వ్యూహాత్మకం కాని సమస్త రంగాలను ప్రైవేటుపరం చేస్తామని ఏ జంకూ బొంకూ లేకుండా చెప్పుకొన్నది. బడా కార్పొరేట్‌ కంపెనీలకు ఇన్నాళ్లూ అడ్డుగా ఉన్న కార్మికహక్కుల రక్షణ చట్టాలన్నింటినీ సులభ వ్యాపారం పేరిట ఎత్తివేయటానికి సమాయత్తం కావటం గమనార్హం. పాఠశాలల్లో కనీస వసతులైన తరగతి గదులు, విద్యుత్‌, తాగునీరు, మరుగుదొడ్లు, నల్లబోర్డు సౌకర్యం లేని పాఠశాలలు దేశంలో గణనీయమైన సంఖ్యలో ఉన్నాయని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి స్థితిలో ఆన్‌లైన్‌ విద్యాబోధన విద్యార్థులందరికీ ఎలా చేరుతుందో ప్రభుత్వం ఆలోచించిన దాఖలాలు లేకపోవటం విషాదం.

కరోనా మహమ్మారి కన్నా ముందునుంచే అనేక రాష్ర్టాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అయినా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ఆయా రాష్ర్టాలు అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వమైతే పెద్ద ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి, తగిన సాయం కోసం ఎన్నోమార్లు కేంద్రానికి విన్నవించింది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఉదారంగా నిధులిచ్చి ఆదుకోవటమే కాదు, జీఎస్టీ, తదితర పన్నుల్లో రాష్ర్టాలకు దక్కాల్సిన వాటాను అందించి సహకరించాలి. కానీ అదేమీ పట్టించుకోకుండా రాష్ర్టాలు రుణాలు సమీకరించుకునేందుకు వీలుగా ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నది. అది కూడా సవాలక్ష ఆంక్షలతో! కేంద్రం తీరు ఇలాగుంటే ఇక సమాఖ్య స్ఫూర్తి వర్దిల్లేదెక్కడ? ఎట్లా? 


logo