శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 00:09:01

తన తప్పులెరుగని అమెరికా

తన తప్పులెరుగని అమెరికా

వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి చైనా తనకు ముందు తెలుపలేదని ట్రంప్‌ ఆగ్రహిస్తున్నాడు. తన ఆధిపత్యం, నియంత్రణలోని గూఢచార సంస్థ.. సీఐఏ ఆ వైరస్‌ చైనాలోని ఏ ప్రయోగశాలలో ఎప్పుడు పుట్టిందో, ఏ విధంగా విస్తరించిందో తెలియజేయలేదా?.. ప్రమాదం గురించి జనవరిలోనే హెచ్చరించినా ట్రంప్‌ ఖాతరు చేయలేదని, ఇండియాలో మిలియన్ల మంది తనకు ‘నమేస్తే నమేస్తే’ అంటూ ఘనస్వాగతం ఇవ్వబోతున్నారంటూ కాలక్షేపం చేశారని అమెరికన్‌ ఉన్నతాధికారులు, పాత్రికేయులు లబోదిబోమంటున్నారు.

గుజరాత్‌ ఆదర్శరాష్ట్రమని ఇంతకాలం ఒకటే ఊదరగొట్టారు. నిజానికి ఆ ‘మోడల్‌' పసలేనిదని, ఇదంతా వట్టి ప్రచారమని కరోనా దెబ్బతో ప్రపంచానికి వెల్లడైంది.. నిజానికి ఈరోజు తెలంగాణయే దేశానికి, అన్ని రాష్ర్టాలకు ఆదర్శప్రాయ రాష్ట్రం అనడంలో సందేహం అవసరం లేదు. 

అమెరికా ఇండియాకు రాక చాలా ఏండ్లయిన తరుణాన, ఆ వెలితి కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఇరుదేశాల సంబంధాల్లో సంచలనం కలిగిస్తున్న సందర్భంలో యూఎస్‌ఏ 43వ అధ్యక్షుడు జార్జ్‌ వాకర్‌బుష్‌ 2006 మార్చిలో ఇక్కడికి వచ్చి నిజంగానే కొన్ని సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. న్యూక్లియర్‌ఎనర్జీ, కౌంటర్‌ టెర్రరిజం తదితర అంశాలపై (2001 సెప్టెంబర్‌ 11న న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య కేంద్రం భారీ భవనంపై ఒసామా బిన్‌లాడెన్‌ వర్గ మతోన్మాద టెర్రరిస్టులు పొద్దున్నే విమాన దాడి జరిపి ఆ మహాభవనాన్ని నేలమట్టం చేయడమేకాకుండా మూడువేలమంది అమాయకులను పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో అధ్యక్షుడు వాకర్‌బుష్‌ ఏం మాట్లాడినా చెల్లేది. కానీ, ఆయన తన తండ్రి, 41వ అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ విలియమ్‌ బుష్‌ స్వభావానికి భిన్నంగా మాట్లాడి ‘భారతీయులు బాగా తింటారు’ అని అన్నాడు. అక్కడ, ఇక్కడ, అన్నిచోట్ల పరిశీలకులు అనేకులు ముక్కుమీద వేలేసుకున్నారు. తనకు అంత ఘనంగా ఆతిథ్యం ఇచ్చిన దేశంలో ఈయన ఇంత ఇదిగా మాట్లాడటం ఏమిటి అని ఎందరో ప్రశ్నించారు. 

73 ఏండ్ల కిందట భారత ఉపఖండ విభజనతో స్వాతంత్య్రం పొందినప్పుడు స్వతంత్ర భారతదేశం ఆహార సంక్షోభంలో ఇరుక్కుంది. అప్పుడు శైశవదశలో స్వతంత్ర భారతదేశం ఎదుర్కొన్న క్లిష్ట సమస్యలు ఇప్పటి కరోనా కఠిన సమస్యల కంటే తీవ్రమైనవని కొందరు అభిజ్ఞులు అంటారు. నాడు దేశ ప్రజల ఆకలి తీర్చడానికి అమెరికా సరఫరా చేసిన కొన్ని వేలటన్నుల ఆహారధాన్యాల బిల్లు తడిసి మోపెడైంది. భారత ప్రభుత్వం ఆ బిల్లు చెల్లించలేదు. అప్పటి అమెరికన్‌ పాలకులు ఆ బిల్లును రుణమాఫీ పద్దులో చేర్చారు. అయినా, భారత ప్రభుత్వం నాడు సోవియట్‌ యూనియన్‌ వైపు మొగ్గుచూపే వైఖరిని మార్చుకోలేదు. ఇప్పటి ట్రంపే అప్పుడు అధ్యక్షుడైతే భారతదేశం మెడలు వంచి వడ్డీతో సహా వసూలు చేసేవాడు. బిల్లు కట్టకపోతే ఆయన భారత ప్రజలు తిన్నది కనికరం లేకుండా కక్కించేవాడు. ట్రంప్‌ను రానున్న నవంబర్‌ ఎన్నికల్లో తిరిగి గెలిపించాలని మన ప్రధాని మోదీజీ గత సెప్టెంబర్‌లో స్వయంగా హూస్టన్‌ వెళ్లి, ‘హౌడీ మోదీజీ’ కార్యక్రమంలో పాల్గొని అమెరికాలోని భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి లెక్కలు, అంచనాల ప్రకారం ట్రంప్‌ మళ్లీ గెలిచే అవకాశాలు హళ్లి.

కమ్యూనిస్టు చైనా మీద దావా వేసి-        కరోనా రక్కసి ఘాతుకాల నష్టపరిహారం లాగడానికి ట్రంప్‌జీ నడుం బిగిస్తున్నారట! వైట్‌హౌజ్‌లో ఇప్పుడు అన్నీ లెక్కలే. వేల మంది అమెరికా ప్రజలు, కష్టజీవులు, పొట్ట చేతపట్టుకొని ఎక్కడెక్కడి నుంచో (తల్లిదండ్రులకు, దగ్గరివాళ్లకు, కన్న దేశానికి విమానాశ్రయాల్లో కన్నీళ్లతో వీడ్కోలు పలికి) వచ్చినవాళ్లను కరోనాకు బలికాకుండా కాపాడితే ఖజానాకు ఎంత నష్టం వాటిల్లుతుందో కొందరు లెక్కలేస్తున్నారు (ట్రంప్‌ మన కేసీఆర్‌ కాడు ప్రజల ప్రాణాలకు మాత్రమే విలువ ఇవ్వడానికి). చైనా తన పాముల పెట్టెలోనుంచి కరోనా విష క్రిమిని తీసి ప్రపంచం మీదికి, ముఖ్యంగా అమెరికాపైకి వదిలిందన్నది ట్రంప్‌ వాదన. ఈ వాదనతో ట్రంప్‌ ఉన్నతాధికారులు, సలహాదారులు, అమెరికన్‌ శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్లు ఏకీభవించడం లేదు. 

కరోనా ప్రమాదం గురించి జనవరిలోనే హెచ్చరించినా ట్రంప్‌ ఖాతరు చేయలేదని, ఇండియాలో మిలియన్ల మంది రోడ్ల   మీదికి వచ్చి తనకు ‘నమేస్తే నమేస్తే’ అంటూ ఘనస్వాగతం ఇవ్వబోతున్నారని కబుర్లు చెప్తూ కాలక్షేపం చేశారని ఈరోజు అమెరికన్‌ ఉన్నతాధికారులు, పాత్రికేయులు లబోదిబోమంటున్నారు. వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి గురించి చైనా తనకు ముందు తెలుపలేదని ట్రంప్‌ ఆగ్రహిస్తున్నాడు. తన ఆధిపత్యం, నియంత్రణలోని గూఢచార సంస్థ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) కరోనా వైరస్‌ చైనాలోని ఏ ప్రయోగశాలలో ఎప్పుడు పుట్టిందో, ఏ విధంగా విస్తరించిందో తెలియజేయలేదా? ఆ సంస్థ ప్రపంచమంతటా ఏ దేశంలో ఎవరు ఆవలించినా పేగులు లెక్కపెట్టగలిగిన గూఢచార సంస్థగా, భయంకర కుట్రల పుట్టగా పేరొందింది. 

భారతీయులు తినేది తక్కువ, తినలేకపోయేది ఎక్కువ. అమెరికా అప్పటి అధ్యక్షుడు జార్జ్‌ వాకర్‌ బుష్‌కు భారతీయులు బాగా     తింటారని చెప్పినవాళ్లు భారతీయ పరిజ్ఞానం లేనివాళ్లు. భారతీయులు ఎంత తిన్నప్పటికీ, ఆ తిండిలో వ్యాధి నిరోధక గుణాలు, పోషక పదార్థాలు అధికమని ప్రపంచం గుర్తిస్తున్నది. 

కరోనా వంటి కొన్ని విపత్తులు సంభవించినప్పుడు కొన్ని కఠిన యదార్థాలు వెలుగులోకి వస్తాయి, కొన్ని ముఖ్య సమస్యలు, వివాదాలు మరుగునపడుతాయి. ఇప్పుడు నరేంద్రమోదీ ప్రభుత్వంలో అదే జరుగుతున్నది. అభివృద్ధి విషయంలో గుజరాత్‌ మొత్తం దేశానికి ఆదర్శప్రాయ రాష్ట్రమని గత ఆరేండ్లుగా ఒక్కటే ఊదరగొట్టారు. కానీ ఆ ప్రభుత్వ వ్యవస్థలోని బలహీనతలు, లోపాలు కరోనా విజృంభణతో బహిర్గతమైనాయి. కేవలం ఆరేండ్ల కిందట అవతరించిన కొత్త రాష్ట్రమైన తెలంగాణ మహా నాయకుడు, పరిపాలనాదక్షుడు కేసీఆర్‌ సమర్థ నేతృత్వంలో బహుముఖ అద్భుత ప్రగతిని సాధించి, కరోనా రక్కసిని గణనీయంగా నియంత్రించగలిగింది. ఈరోజు తెలంగాణయే దేశానికి, అన్ని రాష్ర్టాలకు ఆదర్శప్రాయ రాష్ట్రం అనడంలో సందేహం అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం 2024 నాటికి 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించే సంగతి కరోనా రాకతో పగటికలగా మారింది. కరోనా పేరులోనే ‘రోనా’        (ఏడ్వటం) ఉండటం విచిత్రం.


logo