ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 19, 2020 , 00:09:00

మాదిగల పెద్ద సుంకపాక

మాదిగల పెద్ద  సుంకపాక

రాష్ట్రంలో కొవిడ్‌-19 అదుపులోకి వచ్చిన సందర్భంలో మాదిగల పెద్ద సుంకపాక దేవయ్య క్యాన్సర్‌ వ్యాధితో మరణించారనే ఒక చేదు వార్త అందింది. దేవయ్య కరీంనగర్‌ జిల్లా బోయినపల్లి విలాసాగర్‌లో జన్మించారు. ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ఆలోచనతో ప్రారంభమైన ఎస్సీ హాస్టల్లో చదువుకున్న మొదటితరం విద్యార్థుల్లో ఈయన ఒకరు. మొజాంజాహీ మార్కెట్‌ ఎస్సీ హాస్టల్‌లో ఉంటూనే డిగ్రీ పూర్తిచేశారు. ఆ సమయంలోనే హాస్టల్‌ సమస్యలపై పోరాటం చేశారు. 

1994లో ప్రారంభమైన మాదిగ దండోరా పట్ల దేవయ్య ఆకర్షితుడయ్యారు. హైదరాబాద్‌లోని రాంనగర్‌లో ఉన్న ఆయన ఇల్లు ఉద్యమానికి కేంద్ర బిందువైంది. కాలక్రమంలో మందకృష్ణ మాదిగ నియంతృత్వ పోకడలతో విభేదించిన దేవయ్య తనే మహా ఎమ్మార్పీఎస్‌ అనే ఉద్యమ సంస్థను ప్రారంభించారు. 2004లో కేంద్ర ప్రభుత్వం ఏబీసీడీ బిల్లును రద్దుచేయడంతో పార్లమెంటులో ఆ బిల్లును ప్రవేశపెట్టాలంటూ పల్లెపల్లెనా మాదిగలను చైతన్యపరిచారు. 

తెలంగాణ ఆవిర్భావ అనంతరం ప్రభుత్వం ఆయనను గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ సభ్యుడిగా నియమించింది. దేవయ్య తన జీవితకాలమంతా మాదిగల అభివృద్ధి కోసమే పరితపించారు. 25 సంవత్సరాల ఉద్యమంలో మొదటితరం నాయకు న్ని మాదిగజాతి కోల్పోయింది. ఎస్సీ ఏబీసీడీ సాధనే సుంకపాక దేవయ్యకు నిజమైన నివాళి.

- పిడమర్తి రవి ,రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ మాజీ చైర్మన్‌


logo