శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 17, 2020 , 22:33:00

కవితా వైచిత్రి!

కవితా వైచిత్రి!

ప్రపంచ సాహిత్య పరిణామ వికాసాల్లో తెలుగు సాహిత్యంలో జరిగినన్ని ప్రయోగాలు.. ఆవిష్కరణలు మరే సాహిత్యంలోనూ జరిగి ఉండలేదేమో. పైశాచీభాషలో గుణాఢ్యుడి బృహత్కథ నుంచి రెండువేల ఏండ్లపాటు తెలుగు సాహిత్యం అనేక పుంతలు తొక్కింది. ఎన్ని ప్రక్రియలు.. ఎన్నెన్ని ప్రయోగాలు..? అసలు మన సాహిత్యంలో అవతరించిన ప్రక్రియలు.. పదబంధాలు.. విన్యాసాలు మరే సాహిత్యంలోనూ కనిపించవు. కథ, పురాణం, యక్షగానం, శతకం, దేశి, ద్విపద, ప్రహరి, ప్రహేళిక, ఉదాహరణం, ద్వ్యర్థి, త్య్రర్థి కావ్యాలు, బంధ కవిత్వం, గర్భ కవిత్వం, చిత్ర కవిత్వం, అనులోమ, విలోమ కావ్యాలు ఇలా చెప్పుకొంటూపోతే.. ఎన్నో ప్రక్రియలు.. తెలుగు నేలపై అసాధారణ సారస్వత సేద్యం చేశాయి. అందులో చిత్రకవిత్వం ఒక అద్భుత ప్రక్రియ. చిత్రాలలో ఛందోబద్ధంగా పద్యాన్ని బంధించడం మన కవులకు మాత్రమే సాధ్యమైన నైపుణ్యం. ఇవాళ ఇన్‌స్టంట్‌గా నాలుగు వాక్యాలు రాసి నాలుగు పదాల మధ్య ఎంటర్‌ కొట్టి దాన్నే కవిత్వం అనుకొనే కొందరు పండితమ్మన్యులకు ఈ కవితాసాధన గురించి కనీసం తెలుసో.. లేదో. మన సాహిత్యాన్ని.. అందులోని పాండిత్యాన్ని, శబ్దజాలాన్ని, ఆ శబ్దజాలంతో చేసిన ప్రయోగాలను అధ్యయనం చేస్తే.. తెలుగు కవిత్వంలోని సౌందర్యమేమిటో అర్థమవుతుంది.

సాధారణంగా కావ్యరచన చేయాలంటే భాష మీద అధికారం.. పద్య విద్యలో ప్రావీణ్యం అవసరమవుతుంది. చిత్రకవిత నిర్మాణానికి, పద ప్రయోగంలో ఏయే అక్షరాలు ఎక్కడెక్కడ ఒదిగి ఉండాలో.. కవి స్ఫురణలో, ధారణలో ఉండటం ప్రధాన లక్షణం. చిత్ర కవితలో గర్భ కవిత్వం, బంధ కవిత్వం, ఏకాక్షర, ద్యక్షర పద్యాలు, పద్య భ్రమక, పాద భ్రమకాలు.. అనులోమ విలోమ రీతులు అంతర్గతంగా ఉంటాయి.

చిత్రకవిత్వంలో ఒక అక్షరంతోటి, రెండు అక్షరాలతోటి పద్యాలు నిర్మించే ప్రక్రియ ఉన్నది. ఇలా ఒకట్రెండు అక్షరాలతోనే పద్యం రాయాలంటే ఆ కవికి ఏ స్థాయిలో భాషాధ్యయనం, నిఘంటు పరిజ్ఞానం ఉండాలో అర్థంచేసుకోవచ్చు.  పద్య భ్రమక, పాద భ్రమకాలు, భాషమీద. ఛందస్సు మీద పట్టు లేకపోతే ఇలా ఒకట్రెండు అక్షరాలతో పద్యరచన సాధ్యమయ్యే పనికాదు. శ్రీరామా, రామాశ్రీ అన్న కంద పద్య తొలిపాదం పాద భ్రమక రీతికి ఒక ఉదాహరణ. నాలుగు పాదాలు ఇలాగే రచన సాగుతుంది. శబ్దాలకు ఉండే అనేక అర్థాల వల్ల అక్షరాలను ఒకదాని వెంట సమకూర్చడం, తక్కువ అక్షరాలతో పద్యాన్ని రచించడం.. ఛందస్సులో లఘుగురువుల చేర్పు కూడా చిత్రకవితలో అత్యవసర సాధనాలుగా ఉపయోగపడుతాయి. 


బంధ కవిత్వం విషయం వస్తే ఇందులో రకరకాల ఆకారాలను కల్పిస్తారు. ఛత్రము, ఖడ్గము, నాగము, గజము వంటి చిత్రాలను తయారుచేసి వాటిలో తాను ఇమిడించదలచుకున్న పద్యానికి తగిన గడులను ఏర్పరిచి.. ఆ గడులలో అక్షరాలను రెండు మూడు సందర్భాలలో, భిన్న భిన్న అర్థాల్లో కుదిరేటట్లు పొందుపరుస్తారు. దీనిలో గణ యతి ప్రాసలకు భంగం కలుగకుండా జాగ్రత్తపడతారు. కరీంనగర్‌ జిల్లా కోరుట్లకు చెందిన శతావధానం కృష్ణమాచార్యులు.. వందకు పైగా బంధాలలో ఈ బంధ కవిత్వాన్ని చిత్రించి చరిత్ర సృష్టించారనే చెప్పాలి. వరంగల్‌కు చెందిన ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు తమ అనేక ప్రబంధాలలో 60 వరకు అద్భుతమైన బంధ భేదాలు నిర్మించారు. ఈ పద్యాలు వందకు పైగానే ఉంటాయి. 

చిత్ర కవిత నిర్వహించాలంటే ఛందస్సు మీద ఉన్న అధికారం గర్భ కవిత్వానికి ప్రధానమైన అర్హత. సీస        పద్యంలో మత్తేభం నాలుగు పాదాల్లో ఇమిడిపోతుంది. గీత పద్యంలో కందం ఇమిడిపోతుంది. పై పాదాలలో మొదట చివర చేర్చవలసిన అక్షరాలు యతులకు అనుగుణంగా తెలిస్తే ఇది తేలికగా సాధ్యపడుతుంది. అట్లాగే ఇతర గర్భ పద్యాలకు కూడా. ప్రబంధరాజ వేంకటేశ్వర విలాసంలో గణపవరపు వెంకటకవి ఒక సీస పద్యంలో సుమారు 190 పద్యాలను ఇమిడించాడంటే ఆశ్చర్యమేస్తుంది. ఇది ప్రపంచ సాహిత్య చరిత్రలోనే అసామాన్య పోటీలేని ఒక గొప్ప రికార్డు అని చెప్పాలి. కందపద్యంలో ఆయా భాగాల్లో విరుపులతో నాలుగు కంద పద్యాలు ఇమిడిపోతాయి.   యతి ప్రాసలను ఆయా స్థానాల్లో చేర్చుకోవడమనే నేర్పు ఉంటే దీన్ని సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. ఆధునిక కాలంలో ఒక కవి భారత గర్భ రామాయణం అని ఒక అపూర్వ ప్రబంధాన్ని నిర్మించాడు. గర్భ పద్యాలలో రామాయణ గాధ, మొత్తం పద్యంలో భారత గాధ ఇమిడి ఉంటాయి. ఇది ఒక విధంగా ద్వ్యర్థి కావ్యాలకు విలక్షణమైన చేర్పు. సంస్కృతంలో అనులోమ విలోమ కావ్యంగా రామాయణ భారతాలను ఇమిడించిన ఒక అద్భుత కావ్యం కూడా ఉన్నది.

చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో చాలావరకు కనిపిస్తుంది. 

చిత్ర కవిత్వ అభ్యాసం ప్రధానంగా తెలంగాణాలోని కవుల రచనల్లో చాలావరకు కనిపిస్తుంది. ఈ రకమైన విలక్షణ స్థితికి ఈ ప్రాంత కవులలో ఉండే సృజనశీలంలోని ప్రయోగదృష్టి కారణం అని చెప్పాలి. ఈ విషయంపై, ప్రక్రియపై ప్రత్యేకంగా పరిశోధిస్తే ఈ కవులు చేసిన ప్రయోగాలలోని వైశిష్ట్యం, నైపుణ్యం తెలుస్తాయి. చిత్రకవిత్వ పద్యాలు సాధారణంగా కావ్యమధ్యంలో దేవతా స్తుతులలో కనిపిస్తాయి. ఈ కావ్యాలలో చక్రబంధం విలక్షణమైంది. ఒక వలయంలో కావ్యం పేరు, ఇంకొక వలయంలో కవి పేరు ఉంటాయి. మరింగంటి సింగరాచార్యులు రచించిన బిల్హణీయ కావ్యం వేరొకరి రచనగా ముందుగా ప్రచారంలోకి వచ్చినా.. ఆ కావ్యంలోని చక్రబంధంలో పొందుపరిచిన కవి పేరు వల్ల అది ఆయన రచనగా సురవరం ప్రతాపరెడ్డి తేల్చిచెప్పారు.  చిత్ర కవిత్వం కవి అసాధారణ ప్రజ్ఞకు ఉదాహరణ. ఇది ఒక ప్రత్యేకమైన విద్యావిశేషమని చెప్పాలి. ప్రహేళికల వంటి నిర్మాణం. ఆధునిక సాహిత్య విమర్శకులు దీన్నేదో గారడీ విద్య అని నిరసించే ప్రయత్నం చేశారు. ఈ కాలంలో అసాధారణ ప్రతిభాభ్యాసాలకు గిన్నిస్‌ బుక్‌ వంటి వాటిలో స్థానం లభిస్తుంది. అయితే తెలుగు కవిత్వం సాధించిన ఈ అసాధారణ ప్రజ్ఞా విశేషాలను గూర్చి మనం ఎందుకు గర్వించకూడదో అర్థం కాదు. కవిత్వం అంతా భావకవిత్వంలా ఉండదు. జీవితమంతా హంసతూలికాతల్పంలా ఉండదు. జీవితంలో వైవిధ్యం ఎలాంటిదో కవిత్వంలోని వైచిత్రి కూడా అలాంటిది. జీవితంలో అద్భుతం, మనస్సుకు ఎంత ఉదాత్తతను కల్పిస్తుందో, చిత్ర కవిత్వం అలాగే మన మనసుకు ఉన్నతిని కల్పిస్తుంది. 

- కోవెల సంతోష్‌ కుమార్‌, 91827 77900


logo