మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - May 17, 2020 , 22:32:59

తాళయంత్రం

తాళయంత్రం

ఆత్మలకి ఏమీ అంటుకోదట..

కరోనా క్రిములు కూడానా?

ఏ నిప్పూ, ఏ నీరూ, ఏ గాలీ

ఏ శస్త్రమూ ఏమీ చేయలేనిదానిని

ఏమిచేయగలదు మహమ్మారి?


తలుపులు మూసుకోడమెందుకు

క్రిమికీటకాల వంటి మనతోపాటు

జగద్రక్షకులూ, జగన్మాతలూ,

ప్రవక్తలూ, పునరుత్థాన ప్రభువులూ?


ముప్ఫయి మూడుకోట్ల దేవతలు

స్వర్గారోహణ చేసి అయిదు నిత్యప్రార్థనల

ఆదేశాలు తీసుకువచ్చిన అపార కరుణామయులు

గడప దాటలేని గత్యంతర రహిత దశలో..


మానవజాతి మనుగడ కోసం

మానవుడే సాగించవలసిన యుద్ధం.

అన్యమానవ సమాజాల మీద

మానవుడు సాగించిన అన్ని దండయాత్రల కన్నా

వినాశకారి ఇది. విలయ ప్రహారి ఇది.


సముద్రగర్భంలోని విస్మయకర ప్రాణికోటి,

వాయుసీమలలో విహరించే

      పరమాద్భుత పక్షి ప్రపంచం,

ఆకాశదేవర ధరించే సూర్యచంద్ర కుండలాలు

అన్నీ నిశ్చింతగా, అన్నీ ఎప్పటిలాగే.


ఇప్పుడు మానవుడే మనుగడ పోరులో

ఇప్పుడు మనిషే తీనుగీసుకున్న బరిలో.


కనబడని శత్రువుతో

జరుగుతున్న మాయా యుద్ధం

ఇది మానవుడు గెలిచితీరవలసిన

మరొక మహా సమరం.


అయిదు ఖండాలు కలిసి

ఏక పతాక ఛాయలో ఐచ్ఛిక ఏకాంత

ఆయుధం ధరించి ఎదిరించి గెలవవలసిన రణం.


అవునిది మనిషి మనుగడకోసం

మనిషే ఒక తాళయంత్రమై చేయవలసిన యుద్ధం.

సమస్త మానవ నాగరికతల సంరక్షణ కోసం

మానవుడు జయించి తీరవలసిన

మూడవ ప్రపంచయుద్ధం

యుద్ధరహిత జగతికోసం సాగుతున్న

నిరంతర నిరాయుధ యుద్ధం.

- దేవీప్రియ, 98661 11874


logo