బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 17, 2020 , 00:11:52

మన జీవన నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలెవ్వరు?

మన జీవన నిర్మాణానికి రాళ్లెత్తే కూలీలెవ్వరు?

కొవిడ్‌ వైరస్‌ మానవ జీవితాలను ఉల్టాపల్టా చేయడంతో ఈ నిట్టూర్పు మాటల వాడకం ఎక్కువయ్యింది. చైనా, ఐరోపాల్లో పరిస్థితి కొంత నిదానిస్తున్న సూచనలు కనిపిస్తున్నా, యావత్‌ ప్రపంచం భూతలస్వర్గమని.. మనిషన్న ప్రతివాడూ చేరితీరాల్సిన తీరమదేనని అనుకున్న అమెరికాలో రోజుకు వెయ్యికి తగ్గకుండా మరణాలు సంభవిస్తుంటే భయం అందరినీ ఆవహించింది. కొవిడ్‌ భయానికి వణుకుతూ పనులు వదిలేసి ఇండ్లలో కూర్చుంటే ఆకలిచావులు చూడాల్సివస్తుందని అంతటి ధనిక యూఎస్‌ బెంబేలెత్తుతుంటే.. మిగిలిన దేశాలూ దిక్కుతోచక సతమతమవుతున్నాయి.

ప్చ్‌... గడ్డుకాలం...

అబ్బో... చాలా కష్టం...

వామ్మో... ఎట్లనో ఏమో?

అయ్యో.. బతుకుడెట్లా?

ఓర్నాయనో... ఇదేమి ఖర్మ?

ఒక శక్తి లేస్తే పేకమేడలై కుప్పకూలిన మన జీవిత సౌధం పునర్నిర్మాణానికి స్వయంగా మనమే ఉపక్రమించాలి. ఈ పనికి కూలీలు లేరు. ఇప్పుడు అందరం కూలీలమే. 

మూతికి మాస్క్‌, చేతికి శానిటైజర్లను నిత్యం చేసి, మనుషుల మధ్య దూరం తప్పనిసరి చేసిన ఈ వైరస్‌ మన దేశానికి ఇప్పటికే రెండునెలలపాటు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మరణించిన నిస్సహాయులు, అసహాయుల హాహాకారాలు, చల్లారిన సంసారాల మధ్యనే వైరస్‌తో కలిసి జీవించాలన్న నగ్నసత్యాన్ని జీర్ణించుకొని బతికేయాలని నిపుణులు ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

లాక్‌డౌన్‌ 4.0కు భారత్‌ సన్నద్ధమైన వేళ.. ఎక్కడచూసినా నిస్సహాయత, నిరాశ, భయం, నిస్పృహ అలుముకున్నాయి. అంతుచిక్కని, మందులేని వైరస్‌ వల్లా, అది మిగిల్చిన విషాదం వల్లా ఇప్పుడు ప్రతి ఒక్కటీ పెద్ద సమస్యగానే కనిపిస్తున్నది. ఎన్నడూ లేనివిధంగా ఇప్పుడు మనిషికి మనిషి సమస్య, ఇల్లు సమస్య, వీధి సమస్య, సమాజం సమస్య, సరుకులు సమస్య, రోడ్డు సమస్య, ప్రయాణం సమస్య, ఉజ్జోగం సమస్య, తిండి సమస్య, చివరాఖరికి బతుకే ఒక సమస్య! సమస్యల సాగరంలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతున్న ఇలాంటి సమయంలో.. అస్సలు సమస్యలు లేకపోతే బాగుండనిపిస్తుంది కదా! అసలు సమస్య అన్నదే లేనివాళ్లు ఈ భూమ్మీద ఉన్నారా?..

అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ కుటుంబ సన్నిహితుడు, సానుకూల/ సకారాత్మక ఆలోచనల మహత్తు మీద అద్భుతమైన ‘ది పవర్‌ ఆఫ్‌ పాజిటివ్‌ థింకింగ్‌' అనే పుస్తకం రాసిన నార్మన్‌ విన్సెన్ట్‌ పీల్‌ సమస్యలు లేనివారి గురించి ఒక ప్రసంగంలో వెల్లడించారు.

ఒకరోజు పార్క్‌కు వాకింగ్‌కు వెళ్లిన పీల్‌కు జార్జ్‌ అనే వ్యక్తి కలిశాడు. మర్యాదపూర్వకంగా.. ‘హే జార్జ్‌! హౌ ఆర్‌ యూ?’ అని పీల్‌ కుశలం అడిగారు. దానికి ప్రతిగా జార్జ్‌ తనకున్న సమస్యల చిట్టాను ఏకధాటిగా ఏకరువు పెట్టాడు. ఇంట్లో సమస్య.. బైట సమస్య.. ఆఫీసులో సమస్య.. అటు సమస్య.. ఇటు సమస్య.. ముందు సమస్య.. వెనుక సమస్య.. అని చెప్పాడు. వాటిని ఓపిగ్గా విన్న పీల్‌.. ‘నీ బాధ అర్థమయ్యింది జార్జ్‌. నువ్వు సమస్యల సుడిగుండంలో ఉన్నట్టున్నావు. సమస్యలు లేని ఒక ప్రాంతం ఉంది.. తెలుసా? అక్కడ ఉన్నవారిలో ఒక్కరంటే ఒక్కరికైనా ఒక్క సమస్య అయినా లేదు’ అని చెప్పాడు. ఆ మాటకు జార్జ్‌ మొహం ఒక వెలుగు వెలిగింది.

‘ఓహ్‌ పీల్‌.. నిజంగానా? ఏ ఖండంలో, ఏ దేశంలో అది ఉంది? దయచేసి నన్ను అక్కడికి తీసుకుపో.. నేనీ సమస్యలను భరించలేకుండా ఉన్నాను, నీకు పుణ్యముంటుంది’ అని జార్జ్‌ అన్నాడు.

‘ఏ దేశంలోనో కాదు. ఈ పార్క్‌కు చాలా దగ్గర్లో ఆ ప్రదేశం ఉంది. అక్కడ వేలమంది ఏ చీకూచింతా లేకుండా.. ఎలాంటి జంఝాటం గానీ బాదరబందీ గానీ లేకుండా.. అసలు సమస్యల ఊసే లేకుండా పీస్‌ఫుల్‌గా రెస్ట్‌ తీసుకుంటున్నారు’ అని పీల్‌ చెప్పేసరికి జార్జ్‌ మొహం మరింత వికసించింది. ‘వావ్‌.. నాకు కావలసింది అలాంటి ప్రదేశమే.. ఈ సమస్యలను భరించలేకుండా ఉన్నా. వీటినుంచి దూరంగా పోయి అక్కడే ఉంటా’ అని చెప్పి ఆ అద్భుతమైన ప్రాంతపు చిరునామా అడిగాడు జార్జ్‌.

‘ఇక్కడికి మూడు వీధుల అవతల.. ఒక విశాల ప్రాంగణం అది. దానిని శ్మశానం అంటారు. అక్కడికి వెళ్లిచూడు. ఎలాంటి సమస్యలు లేనివాళ్ళు సమాధుల్లో హాయిగా ఉంటారు. నిజంగానే వారిలో ఒక్కరికీ ఒక్క సమస్యయినా లేదు’ అని పీల్‌ చెప్పేసరికి జార్జ్‌కు తత్త్వం బోధపడింది. ‘చూడు జార్జ్‌.. మనిషి జీవించి ఉన్నాడని చెప్పడానికి సాక్ష్యం సమస్యలు. పోయినోళ్లకు మాత్రమే సమస్యలు ఉండవు. బతికున్నవాళ్లకు సమస్యలంటూ తప్పకుండా ఉంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకుపోవడమే జీవితం. మనకు ఒక్క సమస్యయినా లేదంటే మన జీవితం ప్రమాదంలో పడుతున్నట్లే.. మనం చరమాంకం చేరుతున్నట్లే’ అని పీల్‌ దివ్యబోధ చేశాడు.

యాభయ్యేండ్లకుపైగా ‘ది ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌' అనే రేడియా కార్యక్రమం నిర్వహించి, పాజిటివిటీ మీద లెక్కలేనన్ని ప్రసంగాలు చేసిన పీల్‌ చెప్పే దాన్నిబట్టి మన తాత ముత్తాతలు తమకు ఎదురైన సమస్యలను చూసి బెదరలేదు.. ఏడుస్తూ కూర్చోలేదు. ‘మన పూర్వీకులు, తత్త్వవేత్తలు, మేధావులు ఈ అద్భుత విశ్వం నిర్మాణ చాతుర్యాన్ని బాగా అర్థం చేసుకున్నారు. మనం నివసిస్తున్న ప్రపంచానికి కేంద్రంగా ఉన్న దృగ్విషయాన్ని వాళ్లు పట్టేశారు. దానిపేరు సమస్య. సమస్యలను అర్థం చేసుకొని ఒక పథకం ప్రకారం వాటి అంతు చూశారు. మనిషికి ఎన్ని సమస్యలుంటే అంత గొప్పగా జీవిస్తున్నట్లు’ అని పీల్‌ అంటారు.

నిజమే.. జీవితపు సంద్రంలో అలలు, ఆటుపోట్లు, సుడిగుండాలు సర్వసాధారణమేగానీ ఒక్కసారిగా ప్రపంచం స్తంభించిపోయి, యావత్‌ మానవాళి అనిశ్చితిలో పడిపోవడం అసాధారణం. పీల్‌ అన్నట్టు దీన్ని ఒక గొప్ప అవకాశంగా మలుచుకొని బతికేయడం చెప్పినంత తేలికేమీకాదు. బాధాసర్పద్రష్టులలో ఉత్తేజం నింపి కార్యోన్ముఖులను చేయడం కోసం పీల్‌ ఈ ఉపన్యాసం ఇచ్చే సమయానికి ప్రపంచ యుద్ధాలు, ప్రచ్ఛన్న యుద్ధాలు ఉన్నాయి కానీ కరోనా లేదు. సుఖంగా ఉన్నారనుకున్న అమెరికన్లు పిట్టల్లా రాలిపోవడం అనేది లేదు. ప్రపంచం మొత్తం అన్నీ మూసుకుని ఇల్లుకదలకుండా కూర్చొనే లాక్‌డౌన్‌ మాటా లేదు. సంపద సృష్టి అనే బృహత్‌ కార్యక్రమానికి ఒక్కసారిగా తెరపడలేదు. పట్టణాల్లో బతుకు జట్కాబండి లాగిస్తున్న లక్షలమంది వలస కార్మికులు వేల కిలోమీటర్లు కాలినడకన దయనీయ స్థితిలో ఇంటిముఖం పట్టడం అనేది లేదు. ఈ పెను విషాద సమస్యల పరంపరను.. మానవ జీవితాలను పరిపుష్టం చేయడానికి వచ్చిన అత్యద్భుత అవకాశాలు అని అనుకోడానికి వీల్లేదు. అయితే, రానున్న సమస్యలను నవ్వుతూ తీసుకొని ముందుకు సాగిపోవడం మినహా ఇప్పుడు మనిషి చేయగలిగింది ఏమీ లేదు.!

సమస్యకు ఒక మంచి గుణం ఉంది. దాన్ని చూసి పారిపోవాలనుకుంటే సమస్య వెంటపడుతుంది. భయపడితే మరింత భయం సృష్టిస్తుంది. మనోనిబ్బరం కోల్పోకుండా గుండె ధైర్యంతో ఎదుర్కొంటే.. ఏదో ఒక పరిష్కార మార్గాన్ని అదే సూచిస్తుంది. తాళానికి (లాక్‌కు) చెవి (కీ) ఉన్నట్లే సమస్యలోనే పరిష్కారం కూడా ఉంటుంది. అది మనందరి జీవితంలో ఈపాటికే అనుభవంలోకి వచ్చి ఉంటుంది.

‘యూ కెన్‌ విన్‌ అండ్‌ యూ కెన్‌ అచీవ్‌ మోర్‌' వంటి పుస్తకాల రచయిత, ఉత్తేజపూరిత        ప్రసంగాలు చేసే శివ్‌ ఖేడ.. కొవిడ్‌ అనంతర పరిస్థితిని ఎట్లా ఎదుర్కోగలమో చెప్పారు. ఆయన చెప్పేదాని ప్రకారం.. జీవితం అంటే ఐచ్ఛికాలు        (చాయిస్‌), రాజీల (కాంప్రమైజ్‌) సమాహారం. ఇప్పుడు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాల్సింది మనం. ఈ విషాదం మిగిల్చిన ప్రత్యేక పరిస్థితుల్లో ఎంతో కొంత రాజీపడక తప్పదు. జీవితం యథాపూర్వస్థితికి రావడానికి కొంతకాలం పడుతుంది. 2019 చివరిదాకా మనం అనుభవించిన జీవితం ఒకటి రెండేండ్లు మనకో సుమధుర అనుభూతిగా ఉండిపోతుంది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకొని భావి సవాళ్లకు మానసికంగా సిద్ధపడటం ఇప్పటి మన కర్తవ్యం. విజ్ఞాన పరిధిని, సాధన సంపత్తిని విస్తృతపరుచుకొని, ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టి మరింత క్రమశిక్షణ, దృఢదీక్షతో జీవనయానాన్ని పునర్నిర్వచించుకోవడం ఒక్కటే మనం చేయాలిప్పుడు.

బ్రతుకు కాలి, పనికిమాలి, శని దేవత రథ చక్రపుటిరుసులో పడి నలిగిన దీనులం.. హీనులం.. అని కూర్చోకుండా.. ఇతరేతర ఒక శక్తి లేస్తే పేకమేడలై కుప్పకూలిన మన జీవిత సౌధం పునర్నిర్మాణానికి స్వయంగా మనమే ఉపక్రమించాలి. ఈ పనికి కూలీలు లేరు. ఇప్పుడు అందరం కూలీలమే. మన రాళ్లు, ఇటుకలు మనమే ఎత్తుకోవాలి. మన సిమెంట్‌ మనమే తగు పాళ్ళలో కలుపుకోవాలి. మన తాపీ మనమే పట్టాలి. మన కప్పు మనమే వేసుకోవాలి. ఇప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సమస్య (లాక్‌) లోనే పరిష్కారం (కీ) ఇమిడి ఉందని సదా గుర్తుంచుకుని సకారాత్మక ధోరణితో సాగిపోవాలి. ఇది వినా మనకు మరో మార్గం లేదు. క్రమశిక్షణ, ధైర్యం, ఆత్మైస్థెర్యం మనముందున్న ఏకైక మార్గం. నో అదర్‌ చాయిస్‌!

(వ్యాసకర్త: సీనియర్‌ జర్నలిస్ట్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌ కమ్యూనికేషన్స్‌ నిపుణుడు)


logo