ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 17, 2020 , 00:11:52

కరోనాకు సంప్రదాయ మందు

కరోనాకు సంప్రదాయ మందు

కరోనా రుగ్మతను నిగూఢంగా పరిశీలిస్తే అదొక ఆధునికానంతర వ్యాధి అని అర్థమవుతుంది. ఎందుకంటే, ఆధునిక శాస్త్రీయ ధర్మం ప్రకారం ఏ వ్యాధయినా కచ్చితంగా మందుల ద్వారా నయం కావాలి. కానీ కరోనాకు మందులు లేవు. వాటికి బదులుగా ఇప్పుడు భౌతికదూరం, క్వారంటైన్‌, చేతులు కడుక్కోవడం లాంటి సామాజిక ఆచరణలను దాని నివారణోపాయాల్లో భాగంగా పాటిస్తున్నాం.

చికెన్‌ పాక్స్‌, స్మాల్‌ పాక్స్‌ వంటి రోగాలు సంక్రమించినప్పుడు మన దగ్గర పోచమ్మ, ముత్యాలమ్మ వంటి గ్రామీణ దేవతలను కొలుస్తుంటారు. నిజానికి వారు దేవతలు కారు. సాంక్రామిక వ్యాధులకు మందులు కనిపెట్టిన మొదటి వైద్యులు. 

ఆధునిక వైద్య సిద్ధాంతపు సరిహద్దులను దాటిన కరోనాకు ఆధునిక శాస్త్రీయ మెథడాలజీ ప్రకారం కచ్చితమైన మెడిసిన్‌ కనుక్కోవడం ఇప్పటికిప్పుడే సాధ్యం కాదు. అలాగే, ఆధునికానంతర వైజ్ఞానిక ప్రమేయాల భౌతికదూరం, క్వారంటైన్‌ వంటి సామాజిక ఆచరణల ద్వారా కరోనా నిర్మూలన అంత తేలికైన పనికాదు. చాలా సమయం కూడా వెచ్చించాల్సి ఉంటుంది. దీనికి ఈ రెండుకాలాల ముందున్న సజాతీయ వైజ్ఞానిక దృక్పథాల ద్వారా ఒక పరిష్కారమార్గాన్ని కనుగొనవచ్చు.

ఆధునిక చికిత్స సంపూర్ణంగా ‘రసాయన- భౌతిక పదార్థాల సమ్మేళనం’ ఆధారంగా జరుగుతుంటే, సజాతీయ చికిత్స మాత్రం ‘జైవిక- రసాయన సమ్మేళనం’ ద్వారా జరుగుతుంది. అందువల్లనే సజాతీయ వైద్యులు జీవశక్తి ఉన్న వనరులను, పదార్థాలను మందులుగా మారుస్తారు. జీవులన్ని తీసుకునే ఆహారం కూడా ఈ కోవకే చెందుతుంది. కానీ ఆధునిక వైద్యులు జడ పదార్థాల నుంచే మందులను తయారుచేస్తారు. ఇది పూర్తిగా యాంత్రికపరమైనది. ప్రస్తుత తరుణంలో కరోనా నివారణకు జైవిక పదార్థమైన రక్తం నుంచి వేరుచేసిన ప్లాస్మాను ఔషధంగా వాడాలనే వాదన ప్రపంచవ్యాప్తంగా ముందుకొస్తున్నది. ఈ చికిత్సా విధానం భారతీయ సాంక్రామిక వ్యాధుల నివారణను పోలి ఉన్నది. ఈ చికిత్స ఉదాహరణలు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారతీయ సజాతీయ విజ్ఞానపు చికిత్సకు ఆధునిక సాంకేతికతలను అన్వయిస్తే మంచి ఫలితాలను రాబట్టవచ్చు.

చికెన్‌ పాక్స్‌, స్మాల్‌ పాక్స్‌ వంటి రోగాలు సంక్రమించినప్పుడు మన దగ్గర పోచమ్మ, ముత్యాలమ్మ వంటి గ్రామీణ దేవతలను కొలుస్తుంటారు. నిజానికి వారు దేవతలు కారు. సాంక్రామిక వ్యాధులకు మందులు కనిపెట్టిన మొదటి వైద్యులు. హరప్పకాలం నాటి చారిత్రాత్మక మూర్తులు. ఆ తర్వాతికాలంలో ఆర్యుల రాక మూలంగా ఇలాంటి విజ్ఞానమంతా ఆయుర్వేదంగా సంస్కృత భాషలో గ్రంథస్థమయ్యింది. కొన్ని కుహనా ఆచరణల మూలంగా ఆయుర్వేదం సాధారణ జబ్బుల చికిత్సలకే పరిమితమైపోయింది. వైద్య-ఆరోగ్య అత్యవసర కేసులైన ప్రసూతి, ఎముకలు విరుగడం, పాము- తేలు కాటు, పశువైద్యం లాంటి సమస్యలకు నేటికీ మన గ్రామాల్లో సజాతీయ వైద్యులే చికిత్స అందించడం చూస్తున్నాం. శ్రమజీవులు, నిమ్నవర్గాలు ఈ రంగాలలో ఎక్కువగా ఉన్నందున ఈ చికిత్సలో శాస్త్రీయతను పరిశీలించకనే దానికి నాటువైద్యం అనే మోటు పేరును తగిలించారు. వాస్తవానికి క్వారంటైన్‌, వైరియోలేషన్‌ హెర్డ్‌ ఇమ్యూనిటీ భావనలు భారతీయ మూలవాసులకు ఏనాడో తెలుసు. ‘హెర్డ్‌' అంటే మంద.

జంతువుల్లో గాలిద్వారా వ్యాపించే స్ఫోటకం ఛాయలు (స్మాల్‌ పాక్స్‌) ఒక ప్రాంతంలో కనిపిస్తే గొర్రెల కాపరులు ఆ సమాచారాన్ని మిగతా గ్రామాలకు వేగంగా అందిస్తారు. గొర్రెల మందలకు అప్పటికప్పుడు హెర్డ్‌ క్వారంటైన్‌ నిబంధనను అమలుపరుస్తారు. ఈ వ్యాధి గాలి ద్వారా సంక్రమిస్తుంది కాబట్టి, క్వారంటైన్‌ కూడా రక్షించలేదని భావించిన గొర్రెల కాపరులు హెర్డ్‌ క్వారంటైన్‌తోపాటుగా ‘హెర్‌ ్డఇమ్యూనిటీ’ ప్రక్రియకు వెళుతారు. వ్యాధితో బాధపడుతున్న సమీప గొర్రెల మందలోకి వెళ్లి, అక్కడ చాలా సంక్లిష్టమైన వ్యాధి లక్షణాలున్న ఒక గొర్రెను ఎంచుకొని, దానిని ఎలాంటి ఇన్ఫెక్షన్‌ లేని మంద దగ్గరికి తీసుకువస్తారు. వ్యాధిగ్రస్థమైన ఆ గొర్రె స్ఫోటకాల నుంచి ప్లాస్మాను జాగ్రత్తగా తీసి, దానికి ఒక ప్రత్యేకమైన చెట్టు పసరును కలుపుతారు. తర్వాత ‘గోరుకాలు’, ‘కీలు కత్తి’ అనే సర్జికల్‌ పరికరాల ద్వారా ఆరోగ్యకరమైన గొర్రె చెవి మీద చిన్న గాటుపెట్టి ప్లాస్మాను ఇంజెక్ట్‌ చేస్తారు.

దీనివల్ల ఆరోగ్యకరమైన గొర్రెలకు కూడా వైరస్‌ సంక్రమించిన, పసరు ద్వారా గొర్రెల   శరీరంలోకి వెళ్లిన పసరుభరిత ప్లాస్మా విపరీతమైన యాంటీబాడీలను అభివృద్ధి చేసి, వైరస్‌ మ్యుటేషన్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. ఆ తర్వాత పదిహేను రోజుల క్వారంటైన్‌ మందలలో క్రమక్రమంగా వ్యాధి నిరోధకశక్తి వస్తుంది. ఇలాంటి చికిత్సను పొందిన ఒక జీవి, జీవితకాలంలో మళ్లీ ఆ వైరస్‌ బారిన పడదు. ఈ ప్రక్రియను గమనించిన ఆధునిక శాస్త్రవేత్తలు 1923లో ‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ భావనను ప్రజారోగ్యంలోకి తీసుకువెళ్ళారు. చైనాలో పరిశోధకులు పసరు మందులలో యాంటీవైరల్‌ సామర్థ్యాలు లేవనే పాశ్చాత్య భావనను విడనాడి, పాశ్చాత్య, సజాతీయ చైనా మందులను కొవిడ్‌-19 రోగులకు ఇవ్వాలని సూచించారు. జాతీయ విజ్ఞానం ఉన్న మన దేశంలో సంప్రదాయ వైద్యాన్ని ఇలాంటి సంక్లిష్టమైన సమయంలోనైనా ప్రభుత్వాలు, పరిశోధకులు గుర్తించాలి. 

(వ్యాసకర్త: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సోషియాలజీ విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ)


logo