బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 15, 2020 , 23:17:24

కేంద్రం ‘పవర్‌' గేమ్‌

కేంద్రం ‘పవర్‌' గేమ్‌

దేశంలో కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఎన్నికైన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తుతున్నది. కరోనా కష్టకాలంలో ఆర్థికాభివృద్ధి దెబ్బతిన్న సమయంలో అసమంజస, అభ్యంతరకర నిర్ణయాలను తీసుకుంటున్నది.

భారతదేశం రాష్ర్టాల సమాహారం. ఆర్థికరంగానికి సంబంధించి పన్నుల వసూళ్లలో కేంద్రం లబ్ధి పొందుతున్నది కానీ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు బాధ్యతలు అధికంగా రాష్ర్టాలే చూసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఒకే దేశం-ఒకే పన్ను విధానం’ వల్ల కూడా రాష్ర్టాలు మరింత నష్టపోతున్నామనే భావనకు వచ్చాయి. సెస్‌లు, సర్చార్జీలు, వస్తుసేవల పన్నుల వసూళ్లలో చూపినంత శ్రద్ధ రాష్ర్టాలకు ఇవ్వాల్సిన వాటా విషయంలో చూపడం లేదని అభిప్రాయం. నిధుల వాటాలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ మరోవైపు రాష్ర్టాలను మరింత నష్టపోయేలా, వాటి హక్కులను హరించేలా కేంద్రం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్న విమర్శలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కేం ద్రం ముందుకు తీసుకొచ్చిన విద్యు త్‌ చట్టం సవరణ బిల్లు అనేక భయానుమానాలకు దారితీస్తున్నది. 2003 నాటి చట్టాన్ని మారు స్తూ తీసుకొస్తున్న విద్యుత్‌ సవరణ బిల్లు (2020) యథాతథంగా ఆమోదం పొంది అమలైతే రాష్ర్టాల పై కోలుకోలేని భారం పడుతుంది. ప్రజలు, రైతులు, పేదలు రాయితీలను కోల్పోయే ప్రమాదం ఉం టుంది. ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతుందని విద్యుత్‌ నిపుణులు, సం ఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను కలుపుకొని ఈ అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్‌ రంగాల్లో దేశంలోనే అనూహ్యమైన అభివృద్ధిని సాధించింది. గత సమైక్యాంధ్ర పాలనలో విద్యుత్‌ కోతలతో వ్యవసాయం, పారిశ్రామిక, గృహావసరాల కోసం సరిగ్గా అందక వినియోగదారులు, పారిశ్రామికులు, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని స్థితి నుంచి ఇప్పుడు కొరతను తీర్చుకొని మిగులుకు చేరుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయం.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్‌ సంస్థల ప్రయోజనాల కోసమే విద్యు త్‌ చట్ట సవరణ బిల్లును తీసుకురాబోతున్నట్లు ముసాయిదా అంశాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. మూడు ప్రధాన కారణాలతో బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఒకటి.. వెనుకబడినవర్గాలకు చేయూతనివ్వడం కోసం రాష్ట్రం అందజేసే రాయితీలపై ప్రభావం పడే అవకాశం. రెండు.. రాష్ర్టాల హక్కులను హరించడం, రాష్ర్టాల పాత్రే లేకుండా చేసే ప్రయత్నం. మూడు.. విద్యుత్‌రంగాన్ని ప్రైవేటీకరించే ఉద్దేశం కనిపించడం. ప్రస్తుతం 25 లక్షల మంది రైతులకు ఉచిత నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. చట్టం అమల్లోకి వస్తే 25 లక్షల పంపుసెట్లకు మీటర్లు బిగించాల్సి ఉంటుంది. అందుకోసం 375 కోట్ల రూపాయలు ఖర్చుచేయాల్సి వస్తుంది. నెలనెలా రీడింగ్‌ తీశాక రైతుల నుంచి బిల్లులు వసూలుచేయాలి. ఆ తర్వాత రాయితీ సొమ్ము వారి ఖాతాల్లోకి బది లీ చేయాలి. ఇది రాష్ర్టాలకు అదనపు భారం. కరెంటు చార్జీలను ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో నిర్ణయిస్తుంటే సవరణలతో ఆ అధికారం కేంద్రానికి దాఖలవుతుంది. ప్రస్తు తం ఉచితంగా లభిస్తున్న విద్యుత్‌కు అప్పుడు ఒక్కో రైతు నెలకు సుమారు ఐదు వేల రూపాయల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు నెలకు 100 యూనిట్ల వరకు కరెంటు ఉచితం. కానీ ఇకపై వారు కూడా నెలకు రూ. ఏడు వందల దాకా కట్టాల్సి వస్తుంది.

దేశంలో కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఎన్నికైన తర్వాత దూకుడుగా ముందుకు వెళ్తున్నది. కరోనా కష్టకాలంలో ఆర్థికాభివృద్ధి దెబ్బతిన్న సమయంలో అసమంజస, అభ్యంతరకర నిర్ణయాలను తీసుకుంటున్నది. రూ.69 వేల కోట్ల మేర బ్యాంకులకు కొల్లగొట్టిన వారి రుణాలను వసూలుకాని బాకీల కింద చేర్చి రద్దుకు సిద్ధపడింది. కరోనా సంక్షోభకాలంలో క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నాయి. కేంద్రం పెట్రోల్‌ ధరలు మాత్రం తగ్గించడం లేదు. ఇప్పుడు విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లును రూపొందించింది. ఈ బిల్లుపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు జూన్‌ 5 నాటికి అభిప్రాయాలను చెప్పాలని కేం ద్రం గడువుపెట్టింది. ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లును ప్రాం తీయ భాషల్లోకి తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అభిప్రాయాలను చెప్పే గడువు పెంచాలి. పవర్‌ (కరెంటు)ను చేతుల్లోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపర్చాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతున్న నేపథ్యం లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా ముందుకుపోవాలి. పార్లమెంట్‌లో కూడా అలాగే వ్యవహరించా లి. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్‌ అంశంపై ఇప్పటివరకు విధాన నిర్ణయాధికారాలు రాష్ర్టానికే ఉన్నాయి. కానీ ఈ బిల్లు ఆమోదం పొందితే ఆ అధికారాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి పోతాయి. ఇది ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధం. ఒకే దేశం.. ఒకే చట్టం.. ఒకే ఎన్నిక నినాదంతో రాష్ర్టాల హక్కులను హరిస్తూ ప్రాంతీయ పార్టీలను నియంత్రించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు భావించడానికి ఇప్పటికి తీసుకుంటున్న నిర్ణయాలే సంకేతాలని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు భావిస్తున్నారు. ఈ ప్రమాదకర పోకడలను అరికట్టడం అవసరం. ఈ పవర్‌గేమ్‌లో రాష్ర్టాలు సంఘటితంగా కదిలి పార్టీలకు అతీతం గా రాష్ర్టాల ఆత్మగౌరవానికి భంగం కలుగకుండా రక్షించుకోవాలి.

-మేకిరి దామోదర్‌


logo