ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - May 14, 2020 , 22:56:10

జల క్రీడలు

జల క్రీడలు

‘కోటి తెలుగుల బంగారు కొండ క్రింద/ పరచుకొన్నట్టి సరసు లోపల వసించి/ ప్రొద్దుప్రొద్దున అందాల పూలు పూయు/నా తెలంగాణ తల్లి కంజాత వల్లి’- అంటూ మన బంగారు భూమి సౌందర్యాన్ని అబ్బురంగా వర్ణించాడు మహాకవి దాశరథి. ఒక్క కంజాతవల్లిగానేనా! ‘నా తెలంగాణ కోటి అందాల జాణ’ అన్నాడు. ‘నా తెలంగాణ లేమ సౌందర్య సీమ, నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ ఆయన తెలంగాణ తల్లిని పరిపరి విధాల వర్ణించాడు. ఊరూరా తరులూ గిరులతోపాటు అందమైన చెరువులు గల తెలంగాణను ఒకప్పుడు తటాకాల భూమిగా చెప్పుకొనేవారట. కానీ కొన్ని దశాబ్దాలపాటు కాలం విషపు చూపు విసిరి, చెరువులు నిర్లక్ష్యానికి గురై ఎడారులను తలపించాయి. తెలంగాణ రాష్ట్రం అవతరించడంతో కాళేశ్వరం నీరు ప్రవహించి చెరువులు మళ్ళీ నీటితో కళకళలాడుతున్నాయి. ఆ చెరువుల్లో జలపుష్పాలు దోబూచులాడుతున్నాయి. చెరువు గట్టు కింద నుంచి, మనం మరిచిపోయిన పంట పొలాల పరిమళాన్ని సాయంత్రపు గాలి మోసుకువస్తున్నది! 

నీటితో ప్రజలకున్న ఉద్వేగభరిత అనుబంధం ఇప్పుడు తెలంగాణ పల్లెల్లో స్పష్టంగా కనబడుతున్నది. కాళేశ్వరం జలాలు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆగమించేకొద్దీ జనం హారతి పట్టడమే కాదు, ఆ కాలువల్లోకి దూకి ఈత కొడుతున్నారు. తాజాగా రంగనాయకసాగర్‌ ప్రధాన కాలువల ద్వారా సిద్దిపేట నియోజకవర్గంలోని చెరువులకు పరుగులు తీస్తుంటే ప్రజలు ఆ నీటిలోకి దూకి జలక్రీడలు ఆడటం ఒక అద్భుత దృశ్యం. కాళేశ్వరం జల వ్యవస్థ నుంచి ఊరూరికీ కాలువలు, పిల్ల కాలువల ద్వారా నీరు ప్రవహిస్తున్నది. ఒకప్పుడు మోటపై నుంచి బావుల్లోకి దూకి ఈత కొట్టేవారు. యువతకు అదొక సాహసక్రీడ. ఇక చెరువుల్లో చేసే విన్యాసాలు చెప్పనలవి కాదు. ఇప్పుడు ఆనాటి బావుల్లో మళ్ళీ నీళ్లూరుతున్నాయి. చెరువులు నీటితో కళకళలాడుతున్నాయి. కాలువలూ జలక్రీడలకు కేంద్రమవుతున్నాయి. 

చెరువంటే చిన్న పిల్లలకు ఒక పెద్ద స్విమ్మింగ్‌ పూల్‌! నగరాలకు వచ్చిన చాలామందికి చిన్ననాడు చెరువులో ఈత కొట్టిన జ్ఞాపకం మరిచిపోలేనిది. చెరువులో ఈతకొట్టినవారికి నేటి స్విమ్మింగ్‌ పూల్‌ను చూస్తే టబ్‌బాత్‌ చేసినట్టు ఇరుకిరుకుగా ఉంటుంది. చెరువులో ఈదులాడే ఆ మధురాను భూతికి ఆ తరువాతి తరం నోచుకోలేకపోయింది. ఇప్పుడు వానలు కురిసినా కురువకపోయినా, కాలువల ద్వారా గోదావరి నీటితో చెరువులు నిండి పోతున్నాయి. చాలామందికి మళ్లీ పాత జ్ఞాపకాలు పొంగిపొరలుతున్నాయి. చెరువంటే నీళ్ళు మాత్రమే కాదు. నీటితో అల్లుకున్న గ్రామీణ జీవనం. చెరువులు ఎండిన నాడు జనం పొట్టచేత పట్టుకొని వలసపోయారు. చెరువులు నిండిననాడు మళ్ళీ తిరిగివస్తున్నారు. అయితే ఈత కొట్టడం మరచిన ఈ తరం పిల్లలు తెలిసీ తెలువక నీళ్లలోకి దూకకుండా పెద్దలు జాగ్రత్త తీసుకోవాలి. 


logo