ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 14, 2020 , 22:56:10

చైనా గోప్యతతో చిక్కులు

చైనా గోప్యతతో చిక్కులు

ప్రపంచం 102 ఏండ్ల తర్వాత మరోసారి వైరస్‌ బారినపడి విలవిల్లాడుతున్నది. 1918లో వచ్చిన స్పానిష్‌ వైరస్‌తో ప్రపంచంలో దాదాపు ఐదుకోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 6 లక్షల 75 వేల మంది చనిపోయారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచాన్ని ఆర్థికమాంద్యం కమ్మేసింది. ఆ కాలంలో సరైన ఆరోగ్యవసతులు లేకపోవడం వల్ల చాలా జన నష్టం సంభవించింది. ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇప్పుడు కొవిడ్‌ 19 ప్రపంచాన్ని కలవరపెడుతుండటం అనూహ్య పరిణామమే.

వైరస్‌ వ్యాప్తి నిరోధంలో ప్రముఖ పాత్ర నిర్వహించాల్సిన బాధ్యత నుంచి చైనా తప్పించుకోవడం సరికాదు. తన అనుభవాలను ముందే ప్రపంచానికి తెలియజేసినట్లయితే వైరస్‌ వ్యాప్తి నిరోధంలో మరిన్ని సత్వర చర్యలకు అవకాశముండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అమెరికా నిఘా సంస్థల సమాచారం ప్రకారం.. చైనాలోని వుహాన్‌లో నవంబర్‌లోనే కరోనా వైరస్‌ కనిపించింది. వైరస్‌ తీవ్రత గురించి అమెరికా అధ్యక్షుడికి జనవరి నెలలోనే నివేదిక సమర్పించారు. ఇదే సమాచారం ఆధారంగా సింగపూర్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాలు నివారణ చర్యలు చేపట్టి వైరస్‌ను అదుపులోకి తెచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం జనవరి నెలలో వైరస్‌ అదుపులో ఉందన్నాడు. ఫిబ్రవరి నెల లోగానే కనిపించకుండాపోతుందన్నాడు. కాలిఫోర్నియా రాష్ట్రం మార్చి నాలుగో తేదీన అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే దేశాధ్యక్షుడు ట్రంప్‌ హేళన చేశాడు. అప్పటికే 11 మంది చనిపోయారు. మార్చి 15నాటికి ఈ వైరస్‌ మరింత శక్తిమంతమైనప్పటికీ పూర్తిగా అదుపులో ఉందన్నాడు. ఫిబ్రవరి నెల నుంచి కాలిఫోర్నియా, న్యూయార్క్‌, వాషింగ్టన్‌ గవర్నర్లు వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నా ఆయన పట్టించుకోలేదు. శాస్త్రవేత్తల సూచనలను, నిఘా సంస్థ నివేదికలను, గవర్నర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చాడు. ఉన్నతాధికారులు పరిస్థితిని ఊహించి స్టాక్‌మార్కెట్‌ పడిపోకముందే స్టాక్‌ అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు.

అమెరికాలో పరిస్థితి అంతకంతకూ తీవ్రమవుతున్న నేపథ్యంలో చివరకు మార్చి 16వ తేదీన ట్రంప్‌ మాటమార్చాడు. వైరస్‌ అదుపు తప్పిందంటూ ఎమర్జెన్సీ ప్రకటించాడు. చైనాలో పరిశ్రమలను నెలకొల్పిన బహుళజాతి కంపెనీల ఒత్తిడి కారణంగా మార్చి 16 వరకు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల వైరస్‌ దేశవ్యాప్తంగా వ్యాపించింది. ఫలితంగా అమెరికా తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే నిరుద్యోగం నాలుగు కోట్లకు చేరింది. రాష్ర్టాల గవర్నర్లు బాధ్యతాయుతంగా లాక్‌డౌన్‌ చేసి వైరస్‌వ్యాప్తిని అరికట్టేందుకు ప్రయత్నిస్తుంటే, డెమొక్రటిక్‌ పార్టీ   అధికారంలో ఉన్న రాష్ర్టాల్లోని ప్రజలను వీధుల్లోకి రండంటూ ట్రంప్‌రెచ్చగొట్టాడు. ఆయన మాటలు విని వీధుల్లో ప్రదర్శనలు చేసిన రాష్ర్టాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచలోని కరోనా బాధితుల్లో 33 శాతానికిపైగా, మృతుల్లో 28 శాతానికిపైగా అమెరికావారేనని తెలుస్తున్నది. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఇదంతా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యమైతే మరోపక్క చైనాపై ఆయన ఆరోపణలు మాత్రం నిరాధారమైనవేమీకావని  తెలుస్తున్నది.

కరోనా వైరస్‌ వ్యాపించడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, చైనా ప్రభుత్వ వ్యవహార సరళిపై అనేక సందేహాలు తలెత్తాయి. గబ్బిలాలలో ఉండే వైరస్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌ ద్వారా ప్రజలకు వ్యాపించిందంటూ ప్రపంచాన్ని నమ్మించడానికి చైనా ప్రయత్నిస్తున్నది. కరోనా వైరస్‌ కలిగి ఉన్న హార్స్‌ షో గబ్బిలాలు వుహాన్‌ మార్కెట్‌కు 600 మైళ్ల దూరంలో ఉంటాయి. వుహాన్‌ సీ ఫుడ్‌ మార్కెట్‌లో సముద్రంలో నివసించే జీవులను అమ్ముతారుగానీ గబ్బిలాలను అమ్మరు. మరి గబ్బిలాలు లేని వుహాన్‌లో కరోనా వైరస్‌ పుట్టడానికి కారణమేమిటి అనేది ప్రధాన ప్రశ్న. చైనా ప్రభుత్వం వుహాన్‌లో ‘వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ’ అనే సంస్థను స్థాపించి దానికి అనుబంధంగా నేషనల్‌ బయో సేఫ్టీ ల్యాబొరేటరీని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నది. జీవ ఆయుధాలలో నిపుణుడైన మేజర్‌ జనరల్‌ చెన్‌ వే పరిశోధనకు నాయకత్వం వహిస్తున్నాడు. చైనావ్యాప్తంగా ఇలాంటి రహస్య పరిశోధన కేంద్రాలు చాలా ఉన్నప్పటికీ వుహాన్‌ సంస్థ మాత్రమే అత్యున్నతమైన లెవల్‌ 4 స్థాయి కలిగిన ఏకైక సంస్థ.

అమెరికాలోని రట్గర్స్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ రిచర్డ్‌ ఈబ్రైట్‌ మరికొందరు శాస్త్రవేత్తల ప్రకారం కరోనా వైరస్‌.. వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో పుట్టింది. 

2013లో సార్స్‌ వైరస్‌.. బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ద్వారా లీకయింది. సార్స్‌ వైరస్‌ సృష్టించిన బీభత్సం మేజర్‌ జనరల్‌ చెన్‌ వే దృష్టిని ఆకర్షించింది. పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ నిధులతో కరోనా   వైరస్‌పై వుహాన్‌లో 2013లో పరిశోధన ప్రారంభమైంది. ల్యాబ్‌ నుంచి వైరస్‌ ఎలా లీకయ్యిందన్నది తేలాల్సి ఉన్నది. ల్యాబులో పనిచేసే వ్యక్తి కావాలనే లీక్‌ చేశాడా? లేదా ప్రమాదవశాత్తు వైరస్‌కు గురయ్యాడా? లేదా జంతువులపై పరిశోధన అనంతరం ఆ జంతువులను మాంసానికి విక్రయించే క్రమంలో వైరస్‌ ప్రజల్లోకి వ్యాపించిందా అనే అనుమానాలు తలెత్తాయి. ప్రజల ఆహారపుటలవాట్లపైన, గబ్బిలం, ప్యాంగోలిన్‌పైన నెపం పెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవడానికి చైనా ప్రయత్నిస్తున్నది. చైనా కావాలనే వైరస్‌ను లీక్‌ చేసిందనే వాదన నమ్మశక్యంగా లేదుగానీ, వైరస్‌ లీకైన తర్వాత సభ్య దేశంగా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించకుండా అనేక విషయాలను దాచిపెట్టింది. 

గత ఏడేండ్లుగా ఈ వైరస్‌పై పరిశోధన కొనసాగుతున్నందున సంబంధిత సమాచారం చైనా దగ్గర చాలా ఉన్నది. వైరస్‌ వ్యాప్తి నిరోధంలో తన బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదు. చైనా తన అనుభవాలను ముందే ప్రపంచానికి తెలియజేసినట్లయితే మృతుల సంఖ్య ఇంతగా ఉండేదికాదని, వైరస్‌ వ్యాప్తి నిరోధంలో మరిన్ని సత్వరచర్యలకు అవకాశముండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైరస్‌ మూలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడే తొలి రోగులు ఇప్పుడు కనిపించడం లేదు. వారికి చికిత్స చేసిన ఇద్దరు డాక్టర్లు చనిపోయారు. వైరస్‌ గురించి చర్చించడమంటేనే దేశద్రోహమన్నంత స్థాయిలో చైనా ఆ దేశ పౌరులను నియంత్రిస్తున్నది. వైరస్‌ ప్రభావం నుంచి బయటపడిన తర్వాత ప్రపంచంలో తీవ్ర రాజకీయ, ఆర్థిక, పారిశ్రామిక మార్పులు సంభవించనున్నాయనటంలో సందేహం లేదు. 


logo