శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 13, 2020 , 23:02:17

రాష్ట్రాల హక్కుల హరణం

రాష్ట్రాల హక్కుల హరణం

స్వాతంత్య్రం సిద్ధించి 74 ఏండ్లు గడుస్తున్నాయి. నాడు పంచవర్ష ప్రణాళిక ద్వారా స్వావలంబన వైపు అడుగులు వేసేందుకు కసరత్తు చేశారు. విద్యుత్‌ ఉత్పత్తి, రైల్వేలు, విద్య, వైద్యం, పరిశ్రమల లాంటి ప్రధానమైన విభాగాలను ప్రభుత్వం ద్వారానే నిర్వహించాలని నిర్ణయించారు. నాడు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాల కదలికలు ఉండేవి. గత యాభై ఏండ్లుగా అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అందులో ఇప్పటికే విద్య, వైద్యరంగాలను ప్రైవేటీకరణకు ధారాదత్తం చేశారు. ప్రభుత్వరంగ పరిశ్రమలను అంచెలంచెలుగా అమ్మేస్తున్నారు.

తాజాగా ‘విద్యుత్‌ సవరణ బిల్లు-2020’ తో కొత్త విధానం ద్వారా రాష్ర్టాలది ప్రేక్షకపాత్రే అవుతుంది. దీన్నిబట్టి చూస్తే పూర్తిగా కేంద్రీకృత నియంత్రిత విధానాలకు కేంద్రం తెగబడుతున్నదని స్పష్టమవుతుంది. 

1991లో నూతన ఆర్థిక విధానాల ప్రవే శం తర్వాత ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణల అమలు వేగవంతం కావడంతో అనేకరంగాల్లో ఆధునీకరణతో ప్రైవే ట్‌, కార్పొరేట్‌కు పెద్దపీట వేశారు. ఈ మధ్య రైల్వేరంగం లో ప్రైవేటీకరణ ఆరంభమైంది. ఇప్పటికే అన్నిరంగాలపైనా ప్రభుత్వం పట్టు తగ్గుతున్నది. సహజ వనరులు కార్పొరేట్‌ దిగ్గజాల పరమవుతున్నాయి. కార్మికవర్గం, ప్రజలు ప్రైవేటీకర ణ పట్ల తీవ్ర నిరసనలు, సార్వత్రిక సమ్మెలు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎన్డీయే కూటమి రెండోసారి అధికారపగ్గాలు చేపట్టిన తర్వాత మరింత ప్రైవేటీకరణ మోజులో నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్నది.

రాజ్యాంగంలో పొందుపరిచిన అధికరణలను అనుసరించి ఫెడరల్‌ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాల హక్కులను హరించకూడ దు. ప్రస్తుతం ప్రవేశపెట్టనున్న విద్యుత్‌ సవర ణ చట్టం ముసాయిదా పూర్వాపరాలను పరిశీలిస్తే.. విద్యుత్‌ ఉత్పత్తి వినియోగాన్ని కేంద్రం తన గుప్పెట్లో పెట్టుకోవడానికి, ప్రైవేట్‌పరం చేయడానికి తహతహలాడుతున్నదని అర్థమవుతుంది. దేశంలో 29 రాష్ర్టాలు, ఏడు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ విద్యుత్‌ రంగాన్ని కేంద్రం గుప్పిట్లో పెట్టుకొని రాష్ర్టాల హక్కులను హరిస్తున్నది. ఒక్కో రాష్ట్రం ఒక్కో రకంగా విద్యుత్‌ ఉత్ప త్తి, వినియోగం, టారిఫ్‌లు నిర్ణయించుకొని ప్రజల జీవనస్థితిగతులు, ప్రమాణాల ఆధారంగా కార్యాచరణను రూపొందించుకొని అమలుచేస్తుంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తరతమ భేదాలతో కొన్ని మార్పులు చేస్తూ రైతులను, వినిమయదారులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులకు పూర్తిగా 24 గంటల ఉచిత విద్యుత్‌ ను అందిస్తున్నది. వినియోగదారులకు అనేక స్లాబుల ద్వారా వెసులుబాటు కల్పించి ఆదుకుంటున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం తెచ్చే బిల్లుతో ప్రజల కరెంట్‌ కష్టాలు పెరిగే అవకాశాలుంటాయి. 

ఉమ్మడి పాలనలో తెలంగాణలో పంపుసె ట్లు 19 లక్షల వరకు ఉండేవి. ఇప్పుడవి 25 లక్షలకు చేరుకున్నాయి. కొత్త చట్టం ప్రకారం 25 లక్షల మీటర్లను బిగించాలి. టెక్నికల్‌గా ఎలాంటి లోపం వచ్చినా రైతులు ఇబ్బందు లు పడుతారు. రైతన్న ఆత్మహత్యలవైపు అనివార్యంగా నెట్టబడుతున్న తరుణంలో కొన్ని వెసులుబాట్లు కలిపిస్తూ రాయితీలు ఇస్తున్నా రు. అందులో భాగమే ఉచిత విద్యుత్‌. తిరిగి మీటర్లు పెడుతామంటే రైతులు తిరస్కరించడ మే కాదు, ఈ పరిణామం పెద్ద ఉద్యమానికి దారితీసే అవకాశం ఉన్నది. వినియోగదారుల పరిస్థితి పరిశీలిస్తే ఇందులో రకరకాల టారిఫ్‌ లు ఉన్నాయి. పరిశ్రమలకు విధిస్తున్న యూని ట్‌ రేటు, గృహావసరాలకు వినియోగించేదాని కి తేడా ఉంటుంది. గృహ వినియోగదారులు మొత్తం 1,13,19,524 ఉండగా ఇందులో క్రాస్‌ సబ్సిడీలు పొందుతున్నవారు 97,80, 728 అంటే 86 శాతం మంది లాభపడుతున్నారు. వీరంతా 200 యూనిట్లలోపు విద్యుత్తును ఉపయోగించుకునేవారు. వీరందరికీ యూనిట్‌ కాస్ట్‌ రూ.4.30 లోపే ఉంటుంది. ఇందులో కూడా 50 యూనిట్లలోపు వినియోగించుకునేవారు 57 లక్షల మంది ఉన్నారు. వీరు యూనిట్‌కు రూ.1.45 మాత్రమే చెల్లించాలి. ఆ ప్రకారం కేవలం రూ.72 చెల్లిస్తున్నా రు. కొత్త చట్టం ప్రకారం నెలకు రూ.350 బిల్లులు చెల్లించాలి. అంటే ఆ రకంగా చూస్తే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.277 సబ్సి డీ చెల్లిస్తున్నదన్నమాట. ప్రస్తుత విధానం ప్రకారం రెండు వందల యూనిట్ల వరకు స్లాబులున్నాయి. వంద యూనిట్ల వరకు రూ.3.38,101 నుంచి 200 వరకు రూ 4.3 0 మాత్రం చెల్లించాలి. సర్వీస్‌ చార్జీలు కలుపుకొంటే రూ.778.4 అవుతుంది. కానీ కొత్త చట్టం ప్రకారం రూ.1366.70 వసూలు చేస్తా రు. కొత్త విధానం ప్రకారం 190 యూనిట్ల వరకు రూ.6.87 వసూలు చేస్తారు. సర్వీస్‌ చార్జీలు కలుపుకొని రూ.1366.70గా లెక్కగడుతారు. క్రాస్‌ సబ్సిడీకి తావులేని పద్ధతుల్లో కొత్త విధానం ఉంటుంది. ఈ తాజా యోచన ఇప్పటివరకు సజావుగా సాగుతున్న వ్యవస్థలో చిచ్చుపెట్టడమే. 

ఇప్పటివరకున్న విధానం ప్రకారం రాష్ట్రస్థాయిలో జెన్‌కో, ట్రాన్స్‌కో ఉంటాయి. టారిఫ్‌ నిర్ణయించడానికి రెగ్యులేషన్‌ కమిషన్‌ ఉం టుంది. ప్రభుత్వానికి క్రాస్‌ సబ్సిడీ అమలుచేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా రైతు లు, వినియోగదారుల శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాలు చేసే అవకాశం ఉన్నది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక క్రమంగా రాష్ర్టాల అధికారాన్ని కబళిస్తున్నది. తొలుత రాష్ర్టాలను కీలకమైన ఆర్థికాంశంలో చెప్పుచేతల్లో ఉంచుకునేందుకు ఒకే దేశం, ఒకే పన్ను నినాదంతో జీఎస్టీ విధానాన్ని తీసుకువచ్చింది. కేంద్రమే ఎక్సైజ్‌, పెట్రోల్‌ మినహా మిగతా పన్నులన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్న ది. తాజాగా ‘విద్యుత్‌ సవరణ బిల్లు-2020’ తో కొత్త విధానం ద్వారా రాష్ర్టాలది ప్రేక్షకపాత్రే అవుతుంది. దీన్నిబట్టి చూస్తే పూర్తిగా కేంద్రీకృత నియంత్రిత విధానాలకు కేంద్రం తెగబడుతున్నదని స్పష్టమవుతుంది. ఒక్కో రంగంపై తన పట్టును పెంచుకోవడానికి కేం ద్రం ఉవ్విళ్లూరుతున్నది. ఇది ముమ్మాటికీ తిరోగమన విధానమే. తెలంగాణ ముఖ్యమం త్రి కేసీఆర్‌ అందరికంటేముందే అప్రమత్తమై బిల్లును వ్యతిరేకించడం హర్షణీయమైన పరిణామం. బీజేపీ ప్రభుత్వం క్రమంగా దేశ ఫెడరల్‌ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నది. రాష్ర్టాల అధికారాలను కబళిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లోతైన అధ్యయనంతో ప్రజలను చైతన్యపరుచాలి. విద్యుత్‌ నిపుణులతో చర్చించాలి. కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య. కాబట్టి ఈ కొత్త విద్యుత్‌ చట్టాన్ని తిరస్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలి.

(వ్యాసకర్త: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి)


logo