గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - May 12, 2020 , 23:56:26

ద్విముఖ వ్యూహం!

ద్విముఖ వ్యూహం!

కొన్నివారాల లాక్‌డౌన్‌ తర్వాత ప్రపంచదేశాలు మళ్ళా ఆర్థికరంగంపై దృష్టిసారించాయి. ఐరోపాలో కానీ, అమెరికాలో కానీ కరోనా పూర్తిగా కట్టడి కాలేదు. ఇప్పటికీ ఈ వైరస్‌ను ఎదుర్కొనడం సవాలుగానే ఉంది. ఇంతకాలం ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టడమే ప్రధానాంశమైంది. ఆర్థిక కార్యకలాపాలను పణంగా పెట్టడానికి కూడా వివిధ దేశాలు వెనుకాడలేదు. కానీ ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాగని కరోనా వైరస్‌ను విస్మరించలేము. ఆర్థిక కార్యకలాపాలను కొనసాగిస్తూనే, కరోనా ను నిరోధించడానికి కృషిచేయాలని ఆ దేశాలు భావిస్తున్నాయి. ఈ ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయడమెలా అనే విషయంలో చాలా దేశాలకు స్పష్టత లేదు. కానీ తోచిన రీతిలో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరిస్తూ, ఫలితాలను బట్టి ముందుకుపోవాలనే ధోరణి కనిపిస్తున్నది.

ఐరోపాలోని అత్యంత శోకతప్త దేశాలైన ఇటలీ, స్పెయిన్‌, ఫ్రాన్స్‌, యూకే లాక్‌డౌన్‌ సడలింపునకు నిర్ణయించడం సాహసమే. ఫ్రాన్స్‌లో దుకాణాలు తెరిచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలలను కూడా ప్రారంభించబోతున్నది. బార్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు మొదలైనవాటిని మాత్రం అనుమతించడం లేదు. స్పెయిన్‌లో బార్లు, రెస్టారెం ట్లు కూడా తెరువాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్రిటన్‌లో వచ్చే నెల నుం చి పాఠశాలలు విద్యార్థులతో మళ్లీ కళకళలాడనున్నాయి. కొవిడ్‌తో అతలాకుతలమైన ఇరాన్‌ కూడా సడలింపులు మొదలుపెట్టింది. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేత ప్రమాదకరమనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. మొదట్లో కొవిడ్‌ను అరికట్టి ప్రశంసలు పొందిన దక్షిణకొరియా మళ్లీ కరోనా వ్యాప్తి వల్ల లాక్‌డౌన్‌ విధించడం గమనార్హం. చైనాలోని వూహాన్‌లోనూ వైరస్‌ మళ్ళీ పాకుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. జర్మనీలో కొత్తగా కరోనా వైరస్‌ జాడలు కనిపించడంతో లాక్‌డౌన్‌ సడలింపు విషయంలో కొంత అనిశ్చితి నెలకొన్నది. అయితే ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాలనే దృఢ నిశ్చయం దాదాపుగా అన్ని దేశాల్లోనూ కనిపిస్తున్నది.

లాక్‌డౌన్‌ సడలింపు, కరోనాను నిరోధించడంపై ఇతర దేశాల్లో నెలకొన్న సందిగ్ధత మన దేశంలోనూ ఉన్నది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశం పలు జాగ్రత్తలు తీసుకొని కరోనా వ్యాప్తిని చాలావరకు నియంత్రించగలిగింది. అయితే వైరస్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటమే అందోళనకరం. కానీ లాక్‌డౌన్‌ను సడలించి ఆర్థిక కార్యకలాపాలను పునః ప్రారంభించడం అనివార్యమనే అభిప్రాయం బలంగా ఉన్నది. ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో జరిపిన సమావేశం తర్వాత కూడా దీనిపై స్పష్టత రాలేదు. కానీ ఆర్థికరంగానికి జవసత్తాలు కలిగించడమనేది ఇప్పుడు కేంద్రం ముందున్న ప్రాధాన్యాం శం. కరోనా వైరస్‌ వెంటాడుతున్నప్పుడు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించడంతోనే సరిపోదు. వాటిని సమర్థంగా అమలుచేసి ఫలితాలను సాధించగలుగాలి. ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించడమనేది ఇతర దేశాల మాదిరిగానే మన దేశం ఎదుర్కొంటున్న పెద్ద సవాలు. 


logo