బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 12, 2020 , 23:56:25

ఎవరిని కొట్టి ఎవరికి?

ఎవరిని కొట్టి ఎవరికి?

‘విద్యుత్‌' మన జీవన విధానంలో ప్రాథమిక అవసరం. ప్రతిరోజు వినోదానికి, విద్యకు, వైద్యానికి, రవాణాకు, వంటకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు-ఇలా ప్రతి అవసరానికి విద్యుత్‌ ముఖ్య ఆధారం. ఒక రాష్ట్రం లేదా దేశం పారిశ్రామికంగా ఆర్థికంగా రాణించాలంటే నిరంతర విద్యుత్తు ప్రధానాంశంగా రూపొందింది. అటువంటి ముఖ్యమైన విద్యుత్‌రంగానికి సంబంధించి కేంద్రం ‘విద్యుత్‌ సవరణ బిల్లు-2020’ప్రవేశపెట్టడమనేది ఈ సమయంలో సమంజసం కాదు.

భూమి, గృహ యజమానుల పేరు మీద చాలా విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు ఉండటం వల్ల, డీబీటీ ద్వారా అందించాల్సిన సబ్సిడీని ఒకటి లేదా రెండు సర్వీసులకు మాత్రమే పరిమితం చేయాలా? అనే ఆలోచన కూడా కేంద్రానికి ఉన్నట్లనిపిస్తున్నది. ఆంక్షలు పెట్టి సబ్సిడీని క్రమంగా తగ్గించేయవచ్చు. ఈ సబ్సిడీ, క్రాస్‌ సబ్సిడీ తగ్గించినట్లయితే విద్యుత్‌ బిల్లులు అధికంగా రావడం వల్ల వినియోగదారులు విద్యుత్‌ వాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని కేంద్రం గమనించాల్సిన అవసరం ఉన్నది.

భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నింటిని కూడా కరోనా వైరస్‌ దిక్కుతోచని స్థితికి చేర్చిన దశ ఇది. కలిసి కూర్చొని చర్చించుకునే పరిస్థితి లేని తరుణంలో ఈ బిల్లుపై సూచనలు ఇవ్వాలని కోరడం చాలా విచారకరం, అనాలోచితం. విద్యుత్‌రంగానికి ఉన్న ప్రాముఖ్యం మూలంగా  బీఆర్‌ అంబేద్కర్‌ లాంటి మేధావులు ఈ అంశాన్ని ఉమ్మడి జాబితాలో చేర్చారు. ప్రస్తుత సవరణ బిల్లులో ప్రతిపాదించిన అంశాలు పరిశీలిస్తే విద్యుత్‌రంగంలో రాష్ర్టాల అధికారాలను కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నదనేది స్పష్టమవుతుంది.

ప్రస్తుతం రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ చైర్మన్‌ను, సభ్యులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. కానీ సవరణ బిల్లు ప్రకారం వీరి ఎంపిక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం నియమించిన సెలెక్షన్‌ కమిటీ చేపడుతుంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలను సమీక్షించే అధికారం రెగ్యులేటరీ కమిషన్‌ నుంచి కొత్తగా ఏర్పరచబోయే ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీకి బదలాయిస్తారు. దానికి సివిల్‌ కోర్టుకు ఉండే అధికారాలు ప్రతిపాదించారు. ఈ అథారిటీని విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ కోసమే ప్రతిపాదించినట్లు అవగతమవుతుంది. ఇటువంటి వ్యవస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లు, ఇతర అధికారులకు పునరావాసంగా మారుతాయి తప్ప ఫలితాలిచ్చేవి కావు.

రాష్ట్రంలోని వినియోగదారులకు విద్యుత్‌ ధరలను నిర్ణయించడంలో కూడా కేంద్రం జోక్యం చేసుకుంటుంది. టారిఫ్‌ నిర్ణయించే క్రమంలో క్రాస్‌ సబ్సిడీ ఎత్తివేయాలని, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని పరిగణనలోకి తీసుకోవద్దని సూచించారు. ఈ విధానం అమలైతే సామాన్య ప్రజలు తమ గృహ వినియోగానికి చెల్లిస్తున్న మాదిరే రైతులు కూడా వ్యవసాయానికి కరెంటు చార్జీలు చాలా అధికంగా చెల్లించాల్సి వస్తుంది. దీనికి కారణం విద్యుత్తు పంపిణీ చేయడానికి అయ్యే ఖర్చును ప్రతి వినియోగదారుడు క్రాస్‌ సబ్సిడీ, సబ్సిడీ లేకుండా చెల్లించాల్సి రావడం. ఇది దశాబ్దాలుగా పేదలకు ఇస్తున్న రాయితీలను లాక్కోవడమే, తద్వారా పేదలను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడమే.

ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) ద్వారా నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలలో వేయవచ్చని సూచించారు. ఈ నగదు బదిలీ అనే ది చాలా అంశాల మీద ఆధారపడి ఉం టుంది. ముఖ్యంగా ప్రభుత్వాల సబ్సిడీ వచ్చినా, రాకున్నా వినియోగదారులు కరెం టు బిల్లు సొంతంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానానికి చాలా ఆంక్షలు పెట్టి మున్ముందు సబ్సిడీ తగ్గించే విధం గా కేంద్రం అడుగులు వేస్తున్నది. ఇదే జరిగితే ప్రతి గృహ వినియోగదారుడు ప్రతి యూనిట్‌కు సుమారుగా రూ.6-7 చెల్లించాల్సి ఉంటుంది. దీని పర్యవసానంగా రైతులు మళ్లీ వ్యవసాయం చేసుకోలేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పునరావృతమయ్యే ప్రమాదం ఉంటుంది. రైతులు వ్యవసాయానికి అవసరమైన నీళ్ల కోసం విద్యుత్తు వాడుకుంటున్నారు. కాలువలు, చెరువుల ద్వారా నీళ్లు పొందే రైతులకు అయ్యే ఖర్చుతో పోలిస్తే.. అదే నీటిని బోర్లు, కరెంటు మోటర్ల ద్వారా పొందే రైతుల కు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కార ణం కరెంటు మోటరుకు వాడే విద్యుత్తు చార్జీలు. ఇద్దరు పండించేది ఒకే పంట, ఒకే దిగుబడి. ఈ తేడాను గమనించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తున్నది. కానీ కేంద్రం ఈ కోణంలో ఆలోచించడం లేదు. రైతుల బాధల కన్నా విద్యుత్‌రంగాన్ని ఎలా ప్రైవేటుపరం చేయాలన్న ఆరాటమే ఎక్కువగా ఉన్నట్టు ఈ సవరణ బిల్లు ద్వారా అర్థమవుతుంది.

ప్రభుత్వం నేరుగా నగదు బదిలీ ద్వారా సబ్సిడీ చెల్లించాలన్నా కరెంటు కనెక్షన్‌ ఎవరి పేరు మీద ఉంటే వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేయాలి. కానీ వ్యవసాయం చేసేవారు చాలామంది రైతులు కౌలుదారులు కావడంతో కనెక్షన్‌ భూమి యజమాని పేరు మీద ఉంటుంది. అలాగే గృహ, వాణిజ్య, పరిశ్రమల వినియోగదారులు కూడా చాలామంది కిరాయిదారులు కావడం వల్ల, వారు వాడుకునే విద్యుత్‌ కనెక్షన్‌ వారి పేరు మీద ఉండకపోవడం వల్ల సబ్సిడీ పొందలేరు.

భూమి, గృహ యజమానుల పేరు మీద చాలా విద్యుత్‌ సర్వీస్‌ కనెక్షన్లు ఉండటం వల్ల, డీబీటీ ద్వారా అందించాల్సిన సబ్సిడీని ఒకటి లేదా రెండు సర్వీసులకు మాత్రమే పరిమితం చేయాలా? అనే ఆలోచన కూడా కేంద్రానికి ఉన్నట్లనిపిస్తున్నది. ఆంక్షలు పెట్టి సబ్సిడీని క్రమంగా తగ్గించేయవచ్చు. ఈ సబ్సిడీ, క్రాస్‌ సబ్సిడీ తగ్గించినట్లయితే విద్యుత్‌ బిల్లులు అధికంగా రావడం వల్ల వినియోగదారులు విద్యుత్‌ వాడుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని కేంద్రం గమనించాల్సిన అవసరం ఉన్నది.

మన దేశం విద్యుత్‌ ఉత్పత్తి స్థాపిత సామర్థ్యం సుమారు 3,71,000 మెగావాట్లు ఉంటే మన అత్యధిక డిమాండ్‌ 1,76,000 మెగావాట్లు మాత్రమే. అంటే మనకు లభ్యమవుతున్న విద్యుత్‌లో సగం కూడా ఉపయోగించులేకపోతున్నాం. విద్యుత్‌ను ఉపయోగించుకోకపోవడం వల్ల కూడా వినియోగదారులపై భారం పడుతున్నది. దానికి కూడా కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ విధానాలే కారణం.

ఎలక్ట్రిసిటీ సప్లయి యాక్ట్‌ 1948 ప్రకారం ఎక్కడైనా కొత్త విద్యుత్‌ ప్లాంటు నెలకొల్పాలంటే దానికి సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ అనుమతి అవసరం ఉండేది. సీఈఏ టెక్నికల్‌గా పరిశీలించిన తర్వాత అనుమతులు లభించేవి. కానీ కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టం 2003 అమల్లోకి తెచ్చిన కారణంగా, విద్యుత్‌ జనరేషన్‌ ప్లాంట్‌ కొత్తగా పెట్టాలంటే సీఈఏ అనుమతులు అవసరం లేదు. తద్వారా ప్రైవేట్‌రంగంలో ఇష్టానుసారంగా జనరేషన్‌ ప్లాంట్లకు అనుమ తి లభించింది. వాటితో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అలాగే సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే క్రమంలో 2022కల్లా దేశంలో 175 గిగావాట్ల సోలార్‌ పవర్‌ప్లాంట్లు ఏర్పాటుచేయాలని టార్గెట్‌ నిర్దేశించి చాలా రాష్ర్టాల్లో అధిక ధరలకు (యూనిట్‌కు రూ.5- 15) విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారు. ఈ విధానాల వల్ల ఈ రోజు విద్యుత్‌ను వినియోగించుకోకున్నా మనం స్థిరచార్జీల రూపంలో చాలా ఉత్పత్తి కేంద్రాలకు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వస్తున్నది. ఈ భారమంతా చివరికి వినియోగదారుల మీదే పడుతున్నది. ప్రస్తుతం సోలార్‌ ప్లాంట్ల ను మస్ట్‌ రన్‌స్టేషన్లుగా నిర్దేశించడమే కాకుండా ప్రతి డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ విధిగా రెన్యువబుల్‌ ఎనర్జీ కొనాలని నిబంధన పెట్టారు. ఈ సవరణ బిల్లులో జల విద్యుత్‌ను కూడా రెన్యువబుల్‌ ఎనర్జీ కింద చేర్చి తప్పనిసరిగా కొనాలని నిర్దేశించారు.

ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జెన్‌కో పవర్‌స్టేషన్‌లో జనరేషన్‌ లోడ్‌ డిమాండ్‌ను బట్టి తప్పనిసరిగా తగ్గించుకోవాల్సి వస్తుంది. దీనిద్వారా జెన్‌కోకు ఆర్థికభారం పడుతుంది. మరో ముఖ్య విషయమేమంటే జనరేషన్‌ డీలైసెన్స్‌ వల్ల దేశవ్యాప్తంగా వివిధ కారణాలతో 34 ప్రైవేట్‌ థర్మల్‌ పవర్‌ప్లాంట్లు (సుమారు 40,130 మెగావాట్లు) స్ట్రెస్డ్‌ అసెట్స్‌గా డిక్లేర్‌ చేశారు. వీటివల్ల దేశంలో రూ.3 లక్షల కోట్ల నిరర్థక ఆస్తులుగా మిగిలిపోయాయి. తద్వారా వీటికి రుణ సదుపాయం కల్పించిన బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం.. అదానీ, ఎస్సార్‌, జేపీ, ల్యాంకో, జీఎమ్మార్‌, జీవీకే లాంటి బడా వ్యాపారసంస్థలకు సం బంధించిన ఈ ప్లాంట్లను ప్రత్యేక ప్యాకేజీ ద్వారా, లిక్విడేషన్‌ ద్వారా ఆదుకోవడానికి ప్రయత్నిస్తుంది. అలాంటప్పుడు ఈ భారం ప్రజల మీద ఏదో ఒక రూపంలో పడుతుంది.

విద్యుత్‌ ఉత్పత్తిలో ప్రైవేట్‌రంగం వల్ల ఏ విధమైన ఆర్థికభారం వినియోగదారుల మీద పడుతుందో ఈ విషయా ల వల్ల అందరికీ అర్థమవుతుంది. అయినా కూడా కేంద్రానికి ప్రైవేట్‌ సంస్థలపై మక్కువ తగ్గలేదు. విద్యుత్‌ రంగంలో నష్టాలు తగ్గించాలంటే విద్యుత్‌ పంపిణీని ప్రైవేటుపరం చేయాలనే అబద్ధపు ప్రచారంతో డిస్ట్రిబ్యూషన్‌ సబ్‌లైసెన్స్‌, ఫ్రాంచైజ్‌లను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. నిజానికి విద్యుత్‌ పంపిణీరంగంలో ప్రైవేట్‌సంస్థల ద్వారా ఏమి జరుగుతుందనేది మన దేశంలో వివిధ రాష్ర్టాల అనుభవాల ద్వారా మనకు తెలుసు.

1999లోనే ఒడిశాలో నాలుగు విద్యుత్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను ప్రైవేటుపరం చేశారు. అందులో ఒక కంపెనీ అమెరికాకు చెందిన అమెరికన్‌ ఎలక్ట్రిసిటి సైప్లె, 3 కంపెనీల ను రిలయన్స్‌కు చెందిన బీఎస్‌ఈఎస్‌కు అప్పగించారు. ఏఈఎస్‌ కంపెనీ 2001లోనే పలాయనం చిత్తగించింది. ఈ కంపెనీ ఆ రాష్ట్ర ట్రాన్స్‌కో అయిన గ్రిడ్కోకు రూ.600 కోట్ల బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగులకు సంబంధించిన పింఛన్‌, ప్రావిడెంట్‌ ఫండ్‌ కూడా జమ చేయలేదు. అలాగే 2005 నుంచి మిగతా మూడు డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలను తీసుకున్న బీఎస్‌ఈఎస్‌కు పెర్ఫార్మన్స్‌ బాగా లేని కారణంగా ఈఆర్సీ నోటీసులిస్తూనే ఉంది. చివరికి నెట్‌వర్క్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టడం లేదని, గ్రిడ్కోకు పవర్‌ పర్చేజ్‌ చార్జెస్‌ చెల్లించలేదని బీఎస్‌ఈఎస్‌కు సంబంధించిన షేర్స్‌ అక్రమంగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రాకు బదిలీ చేశారని, నష్టాలను తగ్గించలేకపోయారని 2013లో షోకాజ్‌ నోటీసు ఇచ్చి 2015లో లైసెన్స్‌ రద్దుచేశారు. అప్పటికి ఈ ప్రైవేట్‌ కంపెనీలు గ్రిడ్కోకు రూ.4462 కోట్లు చెల్లించాల్సి ఉన్నది.

విద్యుత్‌రంగంలో ప్రైవేట్‌ కంపెనీలను ప్రోత్సహించాలని ఫ్రాంచైజ్‌ పద్ధతిని ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగా మహారాష్ట్రలోని నాగపూర్‌, ఔరంగాబాద్‌, జల్గావ్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, కాన్పూర్‌, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌, సాగర్‌, ఉజ్జయిని, బీహార్‌లోని భాగల్పూర్‌, ముజఫర్‌నగర్‌, గయా, జార్ఖండ్‌లోని రాంచి, జంషెడ్‌పూర్‌ నగరాలను ఫ్రాంచైజ్‌ ద్వారా ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. తర్వాత పనితీరు సరిగా లేనందువల్ల లైసెన్స్‌ రద్దు చేశారు.

కేంద్రం ప్రతిపాదించిన ప్రజా వ్యతిరేక విద్యుత్‌ సవరణ బిల్లు 2020ని కచ్చితంగా పార్లమెంట్‌లో పాస్‌కాకుండా అడ్డుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడాన్ని తెలంగాణలోని విద్యుత్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులతో పాటు దేశంలోని ఇతర రాష్ర్టాల విద్యుత్‌ సంస్థల ఉద్యోగులు కూడా అభినందించారు. ఆయన మార్గంలోనే ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు కొందరు ఈ బిల్లును వ్యతిరేకించనున్నారు. ఈ పోరాటానికి కేసీఆర్‌ నాయకత్వం వహించి, పార్లమెంట్‌లో ఈ బిల్లు పాస్‌కాకుండా అడ్డుకోవాలని ఆకాంక్ష.

కేంద్ర ‘విద్యుత్తు సవరణ బిల్లు-2020’తో తలెత్తే పరిణామాలు:

  • వినియోగదారులపై చార్జీల భారం పడుతుంది.
  • ఫెడరల్‌ స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది.
  • రాష్ట్ర ప్రభుత్వాలది ప్రేక్షక పాత్రే అవుతుంది.
  • విద్యుత్‌ పంపిణీ రంగం ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుంది.
  • ప్రైవేట్‌ సంస్థల నుంచి అధిక ధరలకు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సి వస్తుంది.
  • ప్రభుత్వ జెన్‌కో ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోతుంది.
  • సాంకేతికంగా పరిశీలన లేకుండానే ఓపెన్‌ యాక్సెస్‌ ఇస్తారు.
  • క్రాస్‌ సబ్సిడీ ఎత్తివేస్తారు. 
  • సబ్సిడీని తగ్గించి నగదు బదిలీ ద్వారా చెల్లిస్తారు.
  • ఉద్యోగాల కోత.

(వ్యాసకర్త: సెక్రటరీ జనరల్‌, ఆల్‌ ఇండియా పవర్‌ ఇంజినీర్స్‌ ఫెడరేషన్‌)


logo