శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 10, 2020 , 23:12:03

మాట సూది.. మనసు దూది

మాట సూది.. మనసు దూది

సదాశివ గారిలోఆదిలాబాదు జిల్లావాసుల అమాయకత్వం కనిపిస్తుంది. తెలంగాణీయుల కుల్లంకుల్లా తెల్లగోలుతనం వినిపిస్తుంది. ముక్కుసూటితనం, నిర్మొహమాటత్వం స్ఫురిస్తుంది.

సరిగ్గా ఇదే రోజు తొంభైరెండు ఏండ్ల కిందట అవిభక్త ఆదిలాబాద్‌ జిల్లాలోని తెనుగుపల్లెలో ఒక నిరాడంబరమైన తెలుగువాక్యం కండ్లు తెరిచింది. అట్లా వెల్లివిరిసిన ఆ వాక్యానికి తదనంతరం మార్దవమైన ఉర్దూ భాషతో దోస్తీ కుదిరింది. అంతేగాక, తదుపరి ఆ తెలుగు వచనం సంస్కృతాంగ్లాల సరసన చేరింది. పరాయి భాష ఫారసీతో పరిచయం పెంచుకొన్నది. హిందీ మరాఠీలతో కలిసిపోయి తెలుగులో సమ్మిళిత సాహిత్యానికి తొవ్వ చూపింది. తెలుగు సాహితీ వినీల గగనంలో అట్లా ఏడురంగుల సింగిడి పొడిచింది. ఆ వాక్యం పేరు సామల సదాశివ.

తెలుగు సాహిత్యంలో సదాశివ సదా సర్వదా సజీవ జ్ఞాపకం. అతడు తెలుగు చదువరుల హృదయాల్లో ఒక మృతిలేని సతత హరిత స్మృతి. అతని అపురూప వచన వృక్షఛాయలో పాఠకులు ఆదమరచి సేదదీరిన అనుభవం ఒక మరపురాని యాది. సంగీత సాహిత్యాలు రెండింటిలో సరిసమానంగా సాములు చేసిన స్వాముల వారు ఈ సామల వారు. సదాశివ కవి, రచయిత, బహుభాషావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, అనువాదకుడు, ఆదర్శోపాధ్యాయుడు, మీదుమిక్కిలి మంచి మనిషి. అందరిలాగే యవ్వనంలో కవనం ఆయనకూ ఇష్టం. ప్రభాతం, సాంబశివ శతకం, నిరీక్షణం, మంచిమాటలు.. మొదలైన పద్యకృతులు రచించాడు. సురవరం ప్రతాపరెడ్డి గారి సూచన మేరకు అనువాద రంగంలోకి దిగాడు. అన్నట్లు.. అంతకుముందు ‘అపశృతి’ నవల రాశాడు.

1963లో ఉర్దూ సాహిత్య చరిత్రను ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురించింది. బహుశ సదాశివగారి మొదటి అనువాద గ్రంథం ఇదేనేమో. ఆ సంవత్సరంలోనే  అమ్జద్‌ రుబాయిలు అకాడమీ తరపునే వచ్చింది. ఇవి రెండూ ఉర్దూనుండి వచ్చిన పుస్తకాలు. 1967లో ‘మౌలానా రూమీ మస్నది’ని ఫారసీ నుంచి అనువదించాడు. రెండేండ్లకు ‘మిర్జాగాలిబ్‌ జీవితము రచనలు’ వచ్చాయి. మరాఠీనుంచి ‘కేశవసుత్‌'ను అనువదించాడు. ఇది కేంద్ర సాహిత్య అకాడమీ  ఢిల్లీ వారికి రాసిన పొత్తం. ‘ఉర్దూ కవుల కవితా సామగ్రి’ని మరలా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీకి అందించాడు. ‘ఫారసీ కవుల ప్రసక్తి’ని కూడా ఈ అకాడమీకే ఇచ్చాడు. ఇదంతా సుమారు 1975కు పూర్వం సదాశివగారి సాహిత్య వ్యాసంగం. ఆ తర్వాత మరలా 2001లో ‘మలయమారుతాలు’, 2004లో ‘ఉర్దూ భాషా కవితా సౌందర్యము’, 2005లో ‘యాది’, 2006లో ‘సంగీత శిఖరాలు’, 2007లో ‘ఉర్దూసాహిత్యము’, 2009లో ‘స్వరలయలు’ మొదలైన అనేక గ్రంథాలు ఆయా సాహిత్య సంస్థల నుంచి వెలువడినవి. ఇవిగాక ఐదవ తరగతికి తెలుగువాచకమూ, ఏడవ తరగతికి తెలుగువాచకమూ రచించారు. లేఖలు రాశా రు. ముచ్చట్లు చెప్పారు. ప్రసంగాలు చేశారు. చిత్రా లు గీశారు. గోష్ఠులు నెరిపారు. సభలు జరిపారు. తెలుగు గద్యానికి కొత్త జవసత్వాలిచ్చి దాన్ని సరళత్వంతో సహజత్వంతో గుబాళింపజేసి ఆ అరుదైన వాక్యాన్ని ముందుకు జరిపారు. 2011లో కేంద్రసాహితీ పురస్కారాన్ని ‘స్వరలయలు’ పుస్తకానికి అందుకున్నారు సదాశివ. సదాశివ గారి సాహిత్య సంగీతాలు ఒక ఎత్తు అనుకుంటే, ఆయన గారి జీవితమూ, వ్యక్తిత్వమూ మరొక ఎత్తు. ఆయనలో ఆదిలాబాదు జిల్లావాసుల అమాయకత్వం కనిపిస్తుంది.  

తెలంగాణీయుల కుల్లంకుల్లా తెల్లగోలుతనం  వినిపిస్తుంది. తెలుగువారి తేటదనం గోచరిస్తుంది. ముక్కుసూటితనం, నిర్మొహమాటత్వం స్ఫురిస్తుంది. సదాశివగారి మాట సూది-మనసు దూది. అతని పలుకు మేకు- మనసు ఏకు. సదాశివ గారిది అసాధారణమైన ధారణ. అదో రకమైన అనిర్వచనీయ ధోరణి, స్వేహశీలి, పిన్నలూ పెద్దలనే భేదాలెరుగని కలుపుగోలుతనం, అతిథిని గౌరవించే అతిగొప్ప మనస్సు, ఒక సాదాసీదాతనం అతని ప్రత్యేక ఆకర్షణ. గొప్ప చదువరి. విశ్వనాథాదులతో సాంగత్యం, ఐ కొండలరావు వంటి గురువులకు శిష్యుడు కావటం, వేలూరి గారికి కూడా ఏకలవ్య శిష్యులవడం ఇట్లా ఆయనలో అనేక పార్శాలు పలు కోణాలు.నిజానికి సామల సదాశివ పేరు వినగానే వెంటనే స్ఫురించే అంశాలు రెండు. ఒకటి సాహిత్యం, ఇంకొకటిసంగీతం. సదాశివ కవిత్వం, నవల, లేఖలు మొదలైన ప్రక్రియలు ఎన్ని గుర్తుకు వచ్చినప్పటికీ, ప్రధానంగా అతని అనువాదాలే ముందుకొస్తాయి. ఏ భాషకైనా పుష్టిని చేకూర్చేవి ఆదానప్రదానాలు. ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు సదాశివకు గుర్తుచేసినవారు సురవరం వారు. సాహిత్యం లో ఉన్న ఖాళీలను సమర్థత ఉన్నవారు పూరించకపోతే ఆ సారస్వతం సమగ్రం కాకుండా పోతుంది. ఒక షడ్రసోపేత భోజనం జనాలకు ఎంత ఇష్టమో, సకల ప్రక్రియలతో సమన్వితం అయిన సమీకృత సాహిత్యం కూడా అంతే అవసరం కదా. ఈ సమీకృత సమతుల్య ఆహారాన్ని అందించటంలో అనువాదకులు ముందువరుసలో ఉంటారు. తెలుగు సాహిత్యానికి ఉర్దూ భాషా సాహిత్యాల మధురిమల్ని ఫారసీ, మరాఠీల ఘుమఘుమల్నీ అందించిన అరుదైన వంటకాడు సదాశివ. సదాశివగారి తెలుగు వచనం నిరాడంబరమైనది. అది వారి తరువాతి తరాలకు ఒక మేలుబంతి వంటి మేలిమి బంగారు వాక్యం. సుబోధకమైన సులభమైన గద్యం. అంతేగాకుండా ఆ వాక్యంలో ఎక్కడో ఓ చోట.. ‘ఔ మల్ల నేను ఆదోలాబాదోన్నే..’ వంటి తెలంగాణ తెలుగు వెలుగులీనుతుంది. ఆయన తెలంగాణ భాషాసాహిత్యాలను బాగా ప్రేమించిన వ్యక్తి. ‘ఔ మల్ల’ అని మాటిమాటికీ ఆదిలాబాదులో విన్పిస్తుంది. అది తప్పు కాదు. నిజానికిది ‘ఔను- మరలా- మరీ’ నుంచి వచ్చింది. ‘ఔను’ లోని చివరి ‘ను’ జారిపోయింది. అసలు అది ద్రుతము. ద్రుతము అంటేనే జారిపోవడం. మరల అనేది వర్గసమీకరణంతో ‘మల్ల’ అయ్యింది. ఇందులో ఏ దోషమూ లేదు. సదాశివ స్వస్థాన వేషభాషలకు అభిమాని. సదాశివగారు అనగానే స్ఫురించే మరో విషయం- సంగీతం. పైగా హిందుస్తానీ సంప్రదాయం. ‘స్వరలయలు’ రాసినా, ‘సంగీత శిఖరాలు’ ఎక్కినా, ‘మలయ మారుతాలు’ వీచేసినా హిందుస్తానీ సంగీతపు పోకడలు తెలుగువారికి పరిచయం చేస్తాడు. ఆయన అసలైన భారతీయుడు. గంగా జమునా తహజీబ్‌కు నిలువెత్తు నిదర్శనం. హిందూ ముస్లిమ్‌ భాయి భాయికి గొప్ప ఉదాహరణ సదాశివ. తెలుగు సాహిత్యాన్ని ఉర్దూ, ఫారసీ, మరాఠీ భాషా  సాహిత్యాలతో సుసంపన్నం చేసిన సాహితీమూర్తి. ఆయన రచనలు చదవడమే సదాశివకు మన ఘననివాళి. 

- డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, 9704374081 

(నేడు సామల సదాశివ జయంతి)


logo