గురువారం 24 సెప్టెంబర్ 2020
Editorial - May 10, 2020 , 23:08:19

కరోనా ‘జండర్‌' ఏమిటి?

కరోనా ‘జండర్‌' ఏమిటి?

కరోనా జడవాచకమే కాని స్త్రీవాచకం కాదు. రెండింటికీ ఒకే వ్యక్తీకరణలు ఉన్నాయి కాబట్టి కరోన వచ్చింది అని రాసినా అది స్త్రీలను ఉద్దేశించినట్లు కాదు అని, అది భాషకు ఉన్న లక్షణం అని గ్రహించాలి. అలాకాకుండా స్త్రీ వాచకాలకు, తిర్యక్‌ వాచకాలకు జడవాచకాలకు భిన్నమైన పదజాలం సృష్టించుకోవడం ఒక ప్రత్యామ్నాయమవుతుంది. అలాంటి ప్రయత్నాలను ఇప్పుడు ప్రారంభించి కొత్త పదాలను వ్యక్తీకరణలను మొదలుపెడితే దీర్ఘకాలంలో అవి పూర్తిగా జనవ్యవహారంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది.

అన్ని దేశాలలో అన్ని భాషలలో అందరినోటా ఈ రోజు వినిపిస్తున్న ఏకైక పదం కరోనా. మనుషులు ఎక్క డ ఉన్నవారైనా ఈ పదాన్ని అనకుండా వినకుండా ఒక గంట కూడా గడపలేని స్థితి వచ్చింది.  అయితే ఈ పదం ఎక్కడినుండి ఏ భాషనుండి వచ్చింది.. దీని లింగం (gender) ఏమిటనేది నేడు చర్చించవలసిన అవసరం ఏర్పడింది. ఇది లాటిన్‌ పదం. తర్వాత ఇంగ్లీషులోకి చేరింది. ఇప్పుడు అన్ని భాషలలోనికి చేరి కొత్త నిఘంటువులలో చేర్చుకోవలసిన పదంగా రూపొందింది. 

లాటిన్‌లో కరోనా అంటే రాణిగార్లకు గుండ్రంగా పూలతో చేసి తలపైన పెట్టే కిరీటం అని అర్థం. సూక్ష్మదర్శినిలో చూసినప్పుడు ఇది ఆ కిరీటాన్ని పోలిన ఆకారంలో అందంగా కనిపించింది. ఈ పదం ఈ అర్ంథలో లాటిన్‌లో 1548 నుండి వినియోగంలో ఉంది. కాగా ఇంగ్లీషులో 1555 నుండి వాడుతున్నారు. 

కరోనాకు అసలు అర్థం వేరే ఉంది. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యునికి పూర్తిగా భూమి అడ్డం వచ్చినప్పుడు నల్లని వృత్తం చుట్టూ ఒక వెలుగు రేఖ ఉంగరంలా మెరుస్తూ కనిపిస్తుంది వలయంలాగ. దీనినే కరోనా అంటారు. సూర్యుడు ఒక పక్క ముందుగా బయటికి జరిగినప్పుడు అక్కడ ఎక్కువ వెలుగు కనిపించి అప్పుడు సరిగ్గా ఉంగరంలాగ, దాని రాయిలాగ కనిపిస్తుంది. ఈ దృశ్యాన్నే డైమండ్‌ రింగ్‌ అని అంటారు. ఇంగ్లీషు భాషలో నిఘంటువుకు ఎక్కేసరికే దీనికి ఈ అర్థమే ఉంది. కిరీటం అనే లాటిన్‌లో వాడుకలో ఉన్న అర్థంలేదు. కాని coronation అనే పదానికి మాత్రం ఇంగ్లీషులో కిరీటం పెట్టి రాజ్యాభిషేకం చేయడం అనే అర్థంలోనే ఉంది. 

చైనాలో కనుక్కొన్న ఒక వైరస్‌ (విషాణువు) కుటుం బం మొత్తానికి ఈ కరోనా పేరు పెట్టారు. ఈ పేరు ఈ కుటుంబానికి 2003లో సార్స్‌ వచ్చినప్పుడే పెట్టారు. అప్పుడు దీని పేరు Cov 2 అంటే కరోనా వైరస్‌ 2 అని అర్థం. అందుకే ఇది తిరిగి 2019లో వచ్చినప్పుడు COVID - 19 అని పేరు పెట్టారు. అంటే కరోనా వైరస్‌ డిసీజ్‌ 19 అని అర్థం. క్లుప్తంగా కొవిడ్‌-19 అని పిలుస్తున్నారు. అమెరికాలో ఒక చిన్న పట్టణానికి కరోన పేరుం ది. ఒక బీరు, సిగార్‌ బ్రాండులకు కూడా ఈ పేరుంది.  

కరోనా వైరస్‌ అనే మాట మన దేశంలో జాతీయస్థాయి ఇంగ్లీషు వార్తల్లో అంతకుముందు అక్కడక్కడా వినిపించినా Covid 19  అనే పదం చైనాలో 2019 డిసెంబర్‌లో తొలిసారి కనుగొన్నప్పటి నుండి బాగా వ్యాప్తిలోనికి వచ్చిం ది. Corona పదం ఇంగ్లీషులో నామవాచకమే. తెలుగులో కూడా నామవాచకమే. కరోనరీ అని అన్నప్పుడు ఇది విశేషణం అవుతుంది. కరోనరీ వ్యాధులంటే గుండె సంబంధమైన వ్యాధులు. కరోన ఒక ప్రాణి కాదని అది ప్రొటీన్‌కు సంబంధించిన ఒక సూక్ష్మ అంశమని శాస్త్రజ్ఞులు, డాక్టర్లు చెప్పారు. అంటే ఇది ప్రాణమున్న సూక్ష్మ క్రిమి కాదు. ఒక అణువు మాత్రమే. ఇదే అయితే తెలుగులో ఈ పదం జడవాచకం అవుతుంది. జడవాచకాన్ని ఎలా రాయాలి అని తెలుగు వ్యాకరణాలు బాగానే వర్ణించాయి. తెలుగు ప్రజల వ్యవహారంలో పురుష, స్త్రీ, తిర్యక్‌, జడ వాచకాల సంబోధన ఎలా అనేది శతాబ్దాలుగా తెలిసినదే. 

నేడు కరోనా అనే పదం జనవ్యవహారంలో జడవాచకంగానే వాడుతున్నారు. కరోనా వచ్చింది, జబ్బు వచ్చింది అనే మాటల్లో జడవాచకంగా నపుంసక వాచకంగానే దీనిని వాడటం కనిపిస్తుంది. కరోనా వచ్చింది అని అన్నప్పుడు దీనిని ప్రశ్నించే వాక్యం పుల్లింగంతో ఎవ్వడివే అని అనడం కుదరదు. జడవాచకం అని అన్నప్పుడు ‘దేనివే’ అని ప్రశ్నించవచ్చు. అంతేకాని వచ్చింది అని అనగానే ఇది స్త్రీవాచకమని భావించరాదు. ఇంగ్లీషులో కూడా కరోనా జడవాచకమే దాన్ని కూడా it అనే సర్వనామంతోనే పిలుస్తున్నారు. its spread అనే రాస్తున్నారు కాని her అనిగానీ his అనిగానీ రాయడం లేదు. ఇంగ్లీషు రచనల్లో జండర్‌ స్పృహతో రాయడం.. పురుషులకు అధిక ప్రాధాన్యం రాకుండా వాక్యాలు నిర్మించడం ఇప్పటికే బాగా అలవాటైంది. కాని ఇంకా తెలుగు ఇతర భారతీయ భాషలలో పురుషాధిక్యమైన జండ ర్‌ వ్యక్తీకరణలే ఎక్కువగా రచనల్లో కనిపిస్తాయి.

కరోనా జడవాచకమే కాని స్త్రీవాచకం కాదు. రెండింటికీ ఒకే వ్యక్తీకరణలు ఉన్నాయి కాబట్టి కరోనా వచ్చింది అని రాసినా అది స్త్రీలను ఉద్దేశించినట్లు కాదు అని, అది భాషకు ఉన్న లక్షణం అని గ్రహించాలి. అలాకాకుండా స్త్రీ వాచకాలకు, తిర్యక్‌ వాచకాలకు జడవాచకాలకు భిన్నమైన పదజాలం సృష్టించుకోవడం ఒక ప్రత్యామ్నాయమవుతుంది. అలాంటి ప్రయత్నాలను ఇప్పుడు ప్రారంభించి కొత్త పదాలను వ్యక్తీకరణలను మొదలుపెడితే దీర్ఘకాలంలో అవి పూర్తిగా జనవ్యవహారంలోనికి వచ్చే అవకాశం ఉంటుంది.

- ప్రొఫెసర్‌ పులికొండ సుబ్బాచారి, 9440493604


logo