శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Editorial - May 10, 2020 , 23:04:40

ఇల్లొక యుద్ధ శిబిరం

ఇల్లొక యుద్ధ శిబిరం

ఏది దానంతట అదే కమ్ముకోదు

మన చేతల్లోంచే పొరలు విప్పి

చుట్టూ చీకటి వలయంగా విస్తరిస్తుంది

కోరలు సాచి నమిలేస్తుంది!

ఇప్పుడు భూమండలాన్ని

పోగాలం వెంటాడుతుంది

అందరూ పిట్టల్లా రాలిపోతున్నప్పుడు

మిషలేదు మినహాయింపు లేదు!

ఇంక వెలగబెట్టింది చాలు

డబ్బు సర్వస్వంగా గతికి

జబ్బులకు దేహాన్ని రాసిచ్చినవాళ్లం

వ్యాపారాలు వ్యాపకాలుగా విస్తరించి

మనిషికిచోటు లేనంతగా

సెన్సెక్స్‌ ఎగుడు దిగుడు లోయల్లో

ఆగమైన వాళ్లం

తప్పు మీద తప్పు చేస్తూ

దేవుళ్లని పూచీపడమంటున్నం

దేబిరింపుల ప్రార్థనలౌతున్నం!

నోటి తుంపర్ల పల్లకిమీద వచ్చివాలే

వల్లకాటినూగుబంధం

మన వేలి కొసలనుంచి

ఊపిరి తంత్రుల్లోకి పాకి

చావు పాటను శ్రుతిచేసే కరోనా మహమ్మారి!

ఇప్పుడు రాలుపూల వనాలై

శవ జాగరణ చేస్తున్న

దీవులూ దేశాలు రాజ్యాలు

దాని గాన లయలో లయిస్తున్నవే!

ఇప్పుడు ఆరుబయలంతా

దాని మృత్యుశీతల స్పర్శ

ఇంక వీధులెక్కిన వీరంగాలు

బలాదూరు బలప్రదర్శనలు చాలు

ఇప్పుడు ఇల్లొక్కటే తల్లిలా

ఒళ్లో పెట్టుకుని కాచే నీడ

వెంటాడే చావు డప్పునుంచి తప్పించే జాడ!

కాలు గడప దాటితే

బతుకు బార్డర్‌ దాటుతుంది

ఇప్పుడు గుడికన్నా ఇల్లే పదిలం!

దగ్గరితనమే మనసుల దగ్గరితనం కానప్పుడు

దగ్గరితనం రోగానికి వాహకమౌతున్నప్పుడు

దూరం ఒక పాఠం

సామీప్యాలు సాంత్వన లేని అనుభవాలై

అగాధాల అంచులమీద పరిహసిస్తున్నప్పుడు

దూరమే ఒక పరిష్కారం!

ఈ వంకమీదైనా ఇల్లు వదలకు

ఒకే కప్పు కింద

మనసులు ముడేసుకునే

మాటలు అల్లుకోవచ్చు

అన్నీ కలబోసుకోవచ్చు

పనీ పాటలు పంచుకోవచ్చు

మనుషులుగా ఎంత మిగిలామో

అంచనా కట్టుకోవచ్చు!

ఇకనుంచీ ఇల్లొక యుద్ధ శిబిరం

కనిపించని శత్రువు దాడి మీద

చేతులనే ఆయుధాలుగా

పదును పెట్టుకుంటున్న

సాయుధ శిక్షణా కేంద్రం

మనను మనం చదువుకునే

ఏకాంత ధ్యాన సందర్బం

మనలోకి మనం ప్రయాణించే

అంతరిక ప్రపంచ యానం!!

-వఝల శివకుమార్‌, 9441883210


logo