బుధవారం 23 సెప్టెంబర్ 2020
Editorial - May 09, 2020 , 23:56:32

కరోనా.. కిం కర్తవ్యం?

కరోనా.. కిం కర్తవ్యం?

అందరినోట ఒకేమాట.. కరోనా తెచ్చే మార్పు ఏమిటి? ఇన్ని రోజుల లాక్‌డౌన్‌ తర్వాత ప్రకృతి తెప్పరిల్లగా, సమాజం మటుకు తన లోటుపాట్లను తెలుసుకుంటున్నది. సామాన్యుని నుంచి అధికారి వరకూ, సూపర్‌ రిచ్‌ నుంచి ఆపన్నుల వరకూ అందరికీ ఒక దీర్ఘమైన విరామం ఇచ్చింది కరోనా. ప్రాణాపాయం భౌతికదూరం పాటించాలంటే, జీవనచిత్రం ఖాళీ కడుపును చూపిస్తున్నది.

అగ్ని రాజేయడం, చక్రం కనిపెట్టడం, అనంతవిశ్వంలో భూమి ఒక గ్రహం అని తెలుసుకోవడం మానవ జీవనగతిని మార్చిన విషయాలు.   కాగా యుద్ధం, ప్రకృతి వైపరీత్యాలు, మత విద్వేషాలు మానవ సమూహాన్ని అతలాకుతలం చేశాయి.

వ్యాధి తద్వారా వచ్చే మరణం ఒక్కటే మనిషి ఎంత అల్పుడో తెలియజేసింది. అయినా.. మనిషి మారలేదు, తన కాంక్ష వీడలేదు.. అన్న కవి వాక్యం గుర్తుకొచ్చేలా, మానవుడు ముందడుగు వేసి తన సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశాడుగానీ తన ప్రయాణం ఆపలేదు. ఆధునిక చికిత్స, వైద్య విధానాలు సగటు మానవ జీవన ప్రమాణాలను మార్చేశాయి. ఉదాహరణకు భారతదేశంలో జీవనకాలాన్ని 1925 నాటి 25 ఏండ్ల నుంచి ప్రస్తుత  65 ఏండ్లకు పెంచాయి. జ్వరం నుంచి క్యాన్సర్‌ దాకా జబ్బులకు నియంత్రణ పద్ధతులు కనిపెట్టారు. లూయిస్‌ పాశ్చర్‌ మానవాళికి సంజీవిని వంటి మందు అందించారు. ఇప్పటికి పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి. 

సరే! ఆయు ప్రమాణం పెరిగితే ఏమైంది? 

చరిత్రను పరిశీలిస్తే, జనాభా పెరుగుదల, నాగరికత ఆవిర్భావం జరిగింది. మానవుడు ’నగర నిర్మాణం’ పేరుతో పర్వతాలు దొలిచి, సముద్రగర్భం మలిచి, ఎన్నో కట్టడాలు, రహదారులు నిర్మించాడు. విశ్వవిజేతకు అవరోధాలేముంటాయి? రోదసిలో కాలుమోపి వాతావరణంలో మార్పులను ముందుగా అంచనావేసి మరింత ఘనంగా తననుతాను కాపాడుకున్నాడు. తెలుగులో ఒక సామెత ఉంది. తొండ ముదిరి ఊసరవెల్లి అయింది అని. మానవుని శాస్త్రవిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అలా తయారయ్యాయి. కంప్యూటర్‌ వచ్చాక దూరాలు తుడిచిపెట్టే సమాచార విప్లవం వచ్చింది. కానీ స్వార్థం మారణాయుధాలు కాగా, దురాశ దండయాత్రలుగా, విలాసవంత జీవితం దురలవాట్ల ప్రహసనంగా, పర్యావరణ కాలుష్యంగా పలువిధాల వికృతంగా మారింది. అయినా, ప్రమాద ఘంటికలను ఆలకించాడా? ఉహూ! అప్పుడు పడింది అడ్డుకట్ట. ప్రపంచం చుట్టి వచ్చేందుకు రోజులు చాలనుకున్నది, ఇంట్లో ఖైదు పాలయ్యాడు. ఎటునుంచి ఎలా వచ్చి రక్తం గడ్డ కట్టించి, ఊపిరి ఆడనీయక చంపేస్తుందోనని ఒక సూక్ష్మజీవికి జడిసి, అన్ని కార్యకలాపాలు  నిలిపివేయాల్సి వచ్చింది. 

ఇదే, మనం జీవన విధానాన్ని ఎలా తీర్చి దిద్దుకోవాలో, మనకున్న వనరులను ఎలా పునర్వ్యవస్థీకరించుకోవాలో ఆలోచించవలసిన సమయం. 

ఇన్నాళ్లు మానవుడు తానే సమాజాన్ని నిర్మించి తిరిగి తానే ముక్కలుగా చేశాడు. కలిసి ఉన్నా, విడిపోయినా కారణాలు రెండే అని చెప్పుకోవచ్చు: వేర్పాటువాదం, ఆర్థిక స్థితిగతులు.

మనల్ని కలిపి ఉంచాల్సిన ప్రాణరక్షణ మార్గాలు

వస్తువుల ఉత్పత్తికోసం అవలంబించిన పారిశ్రామీకరణ, శారీరక శ్రమ తగ్గించేందుకు అలవాటు చేసిన యాంత్రీకరణ ఇవి ఒకరకంగా మానవునిలో వస్తువులపై  ఆధారపడటం, సోమరితనం ప్రవేశపెట్టాయి. ప్రాథమిక అవసరాలు తీరిన తరువాత విలాసాలు, వైషమ్యాలు పెరిగి ఆధిపత్య పోరుకోసం వనరుల కేంద్రీకరణ జరిగింది.

కరువుకాలంలో పస్తులున్న ప్రజలపైన అదనపు పన్ను వేసిన అలనాటి రాజులకు, వలస కార్మికులు, ప్రభుత్వ యంత్రాంగం రేయింబవళ్లు కష్టపడుతున్న సమయంలో ఇంట్లో రకరకాల వంటలు చేసుకుని ఆ వీడియోలను వైరల్‌ చేయడం దాదాపు ఒక్కటే అనిపించక మానదు. అది, ఒక అలసత్వం. ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మాటలు నిత్యసత్యాలు. ఆయన ఇలా చెప్పారు.. ప్రపంచంలోని గందరగోళం తగ్గాలంటే, నీలో-నాలో- ప్రతి ఒక్కరిలోనూ, చివరకు అందరిలో ఆ గందరగోళం తగ్గాలి. శాంతి సమకూరాలి. 

స్వచ్ఛంద సంస్థలు, వివేకవంతులైన ప్రభుత్వోద్యోగులు ఈ అసమానతలను తొలగించేందుకు కృషిచేయటం కొంత ఊరట. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి తనను తాను పునర్నిర్మించుకుని, మానవ సమాజం తనను తాను పునర్వ్యవస్థీకరించుకోవలసిన అవసరం వచ్చింది. ఇది బహుశా చాలా గొప్ప అవకాశం కూడా. ఒక జీవితకాలంలో మన తప్పులను దిద్దుకుని మళ్లీ జీవించే అవకాశం రావడం చాలా గొప్ప విషయం కదా! 

శ్రమైక సౌందర్యం: ప్రతి వ్యక్తి, శారీరక శ్రమను తమ జీవితంలోకి ఆహ్వానించాలి. వస్తు వినిమయ ప్రపంచంలో ప్రతిక్షణం డబ్బు సంపాదించడం, ఆ మరుక్షణం దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో అని ఆలోచించే స్థితిలో, దీనినుంచి బయటపడవచ్చు. లగ్జరీ కార్లు, ద్విచక్ర వాహనాలు అవసరానికి మించి తీసుకున్నారు. తన జీవితకాలంలో అవసరం లేని దూరాలను  ప్రయాణించి, దానికి డబ్బు, శక్తి ఖర్చుచేసి మానవుడు అలసట, ప్రాణాపాయాలను మూల్యంగా చెల్లించుకుంటున్నాడు. ఇంతకాలంగా పేరుమోసిన పెద్ద పెద్ద పరిశ్రమలు, సంస్థలు కూడా వారివద్ద పనిచేసేవారికి కొంతకాలంపాటు సరయిన వేతనభత్యాలు ఇవ్వలేకపోవడం ఏమిటో అర్థంకాని విషయం. చాలా బాధాకరం. ఇదంతా మానవ సమాజం పునరాలోచించుకోవాలి. ఎలాంటి పరుగు ఎలా కొనసాగాలో గుర్తెరగాలి. ఆ రకంగా ప్రస్తుత సమస్యను పరిశీలించి ప్రత్యామ్నాయమార్గాలను అన్వేషించవచ్చు.

సేవల గుర్తింపు: మన దైనందిన జీవితంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అల్లుకుపోయిన చిన్న వ్యాపారులు, పట్నం పల్లె.. ఎక్కడైనా నిత్యావసర వస్తువుల అమ్మకాలు చేసేవారు, ట్యాక్సీడ్రైవర్లు, రోజుకూలీలు వీరంతా ఒక్కసారిగా పనులు లేక పుట్టలోంచి బయటకు వచ్చిన చీమల దండులా మన కండ్ల ముందుకు వచ్చి నిలుచున్నప్పుడు కదా, నిజానికి మనకు అవసరమైన సేవలన్నీ అసంఘటిత కార్మికులవల్లనే జరుగుతున్నాయని తెలిసింది! వీరంతా ఎక్కడనుంచి ఎక్కడికి వెళ్లారు? ఏ పని చేస్తున్నారు? వారి నివాసస్థలం ఏమిటి? వారి ఆర్థిక వనరులు,  జీవనవిధానం, కష్టసుఖాలు, అనారోగ్యాలు, ఆహార విధానాల మాటేమిటి?.. ఒక్కసారిగా వందల, వేల ప్రశ్నలుగా మనముందు నిలబడి ఆశ్చర్యపరిచాయి. 

అంటే ఇప్పటిదాకా సంఘంలో ఉంటూనే, దాని ఉనికికి అవసరమైన శ్రామిక శక్తి (work force)ని ఒక స్వరూపంలేని, అస్తిత్వంలేని నీడలా పరిగణించామన్నమాట. కాబట్టి, దీనికి ఇక అత్యంత ప్రాముఖ్యమివ్వాల్సి ఉంది. ఇప్పటికే రేషన్‌కార్డు, ఓటర్‌కార్డ్‌, ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్ట్‌ లాంటి ఎన్నో గుర్తింపు కార్డులు ఉన్నాయి. మరి అసంఘటిత కార్మికులు ఎవరి బాధ్యత? కనీసం పన్ను చెల్లింపుదారులు కూడా కారు గదా. అందుకే, ఆయా వ్యక్తుల వివరాలను రాజ్యాంగబద్ధంగా పొందుపరచాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. 

శుభ్రత: ప్రతి మనిషి తన సమయాన్ని ఇల్లు, పనిచేసేచోట గడుపుతూ ఉంటాడు. ఈ ప్రతి ప్రదేశంలో మౌలికంగా ఉండవలసిన వసతులు, ఆహారభద్రత, మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత ఉంటాయా?.. ఇకనుంచైనా దీనిపై ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుంది. ఒక సర్వే ప్రకారం తినుబండారాలు కలుషితమై, అవి తినడం (ఫుడ్‌ పాయిజనింగ్‌) వల్ల జరిగే మరణాలు భారతదేశంలో ఏటా రెండు మిలియన్లు. ఈ విధంగా ఆలోచిస్తే సామూహిక, సామాజిక, వ్యక్తిగత, పరిశుభ్రత అనేక రకాల అనారోగ్యాలను నివారిస్తుంది. 

విందులు వినోదాలు, టీమ్‌ ఈవెంట్లు, విద్యావైజ్ఞానిక సమావేశాలు, ఒక్కోసారి సెలెబ్రిటీలు ప్రదర్శించుకునే సందర్భాలలో కావచ్చు.. అలాంటిచోట్ల ఆహార పదార్థాల వ్యర్థాల వల్ల ఇతరత్రా వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. క్రీడల పోటీలసందర్భంగా స్టేడియాల లోపలా, బయటా జరిగేది సగం వినోదం, సగం వ్యాపారం. ఇవన్నీ పూర్తిగా తప్పుకాదుకానీ, మానవ సమాజం తానుగా నిర్మించుకున్న కాల్పనిక ప్రపంచం అన్నది నిర్వివాదాంశం. 

కరోనా వైరస్‌కు మందు, తరువాత వ్యాక్సిన్‌ కనిపెట్టవచ్చు. మానవుని ఆధునిక జీవనవిధానం ప్రవేశపెట్టిన ఆత్మవిధ్వంసక (self distructive) కార్యక్రమాల పరిమాణం ఎంత పెద్దదో కరోనా మనకు కండ్లకు కట్టినట్లు చూపించింది.

మన ముందుతరాలకు, భవిష్యత్‌ పౌరులకు ఇకపై మనం అందించబోయే ప్రామాణికాలు స్పష్టంగా ఉండాలి. ఆ దిశగా ఇంటి పెద్ద నుంచి ప్రభుత్వ యంత్రాంగంవరకూ, అధికారుల నుంచి వ్యాపారసంస్థల అధినేతల వరకు అందరూ  ఆత్మావలోకనం చేసుకుని కొత్త పథకాలను రూపొందించుకుంటారని ఆశిద్దాం.


logo