ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 09, 2020 , 00:42:18

సహకారం నేర్పుతున్న కరోనా

సహకారం నేర్పుతున్న కరోనా

కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఉదాత్తంగా వ్యవహరించాలి. సంకుచిత విభేదాలను విడనాడి ఉమ్మడి శ్రేయస్సుకోసం కలిసి పనిచేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాలు అనుసరిస్తున్న విధానం ఆశాజనకంగానే ఉన్నది. ఇదే సమయంలో దేశాలన్నీ బహుళ ప్రయోజనాల పరిరక్షణ, పరస్పర సహకారం పునాదిగా ముందుకు పోవాలి.

కరోనా వైరస్‌ ప్రపంచవ్యాప్తంగా వినాశకర పరిస్థితులను సృష్టిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తున్నది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో ఇప్పుడిప్పుడే చెప్పే పరిస్థితి కూడా లేదు. కొవిడ్‌-19 కారణంగా దేశదేశాల్లో జరిగిన ఆర్థిక, సామాజిక నష్టాల స్థాయి ప్రస్తుతం అంచనాలకు అందకుండా ఉన్నది. అయినా జరుగుతున్న ఆర్థిక, ప్రాణ నష్టాలను పరిగణనలోకి తీసుకుని కరోనా అనంతర పరిణామాలు, అనుభవాలు, గుణపాఠాల్లోంచి ప్రపంచం ఎలా ఉండబోతున్నదో ఊహించవచ్చు. 

కరోనా సంక్షోభం నుంచి బయటపడే క్రమంలో తక్షణ ఉపశమనంకోసం ప్రభుత్వాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా కేంద్రీకృత అధికారంతో వ్యవహరిస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వమా, గుత్తాధికార ప్రభుత్వమా అన్నది కాకుండా కరోనా వైరస్‌ కట్టడి ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వాలు ముందుకుపోతున్నాయి. దక్షిణ కొరియా, తైవాన్‌ లాంటి దేశాలు కరోనా నియంత్రణలో మంచి విజయాన్ని సాధించాయి. కరోనా కట్టడిలో కఠినంగా వ్యవహరించాయని అంటున్నా, వాటి ప్రయత్నాలకు ఆయా దేశాల్లో ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది. చైనా విషయానికి వస్తే అది ఎలా వ్యవహరించిందన్నది ఎలా ఉన్నా, కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవటంలో విజయం సాధించింది. మొదట్లో కొన్ని తప్పటడుగులు వేసినా, కరోనా నియంత్రణ అదుపుచేయటంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కరోనా అనంతర కాలంలో మరింత శక్తిమంతంగా కఠినంగా వ్యవహరిస్తూనే ఆయా ప్రభుత్వాలు ప్రజల మద్దతును పొందాల్సిన అవసరమున్నది. 

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు కొన్ని అనుచిత విధానాలు అవలంబిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగా ఆహార నిల్వలను పోగుచేయటం, పెట్రోలియం నిల్వలను పెంచుకోవటంపైన పెట్టినంత దృష్టి ప్రజారోగ్యంపై పెట్టకపోవటం కనిపిస్తున్నది. కొన్ని ధనిక దేశాల వద్ద సాధారణ జ్వరానికి వినియోగించే పారాసిటమాల్‌తో పాటు మాస్కులు, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ లాంటి ఔషధ నిల్వలు లేకపోవటం విస్మయం కలిగిస్తున్నది. మరో మాటలో చెప్పాలంటే.. ఆ దేశాల్లో ఆర్థికాంశాలకేతప్ప ప్రజారోగ్యానికి ఏ ప్రాధాన్యం ఉన్నట్లు లేదు. ఇలాంటి పరిస్థితి అనివార్యంగా మారాల్సి ఉన్నది.     ప్రజారోగ్య భద్రత అనేది ఆహారం, ఇంధన నిల్వలకన్నా ఎక్కువది కాకపోయినా కనీసం సమానమైనదిగా అయినా పరిగణించాలి. ఇలా వ్యవహరించకుంటే.. కరోనా అనంతర పరిస్థితుల్లో ప్రపంచం మరోలా ఉంటుందనడంలో సందేహం లేదు.

ఈ ప్రపంచీకరణ యుగంలో ఉత్పాదక రంగాల పరస్పర సహకారం మాత్రమే మొత్తం ప్రపంచాన్ని గమ్యంవైపు నడిపించలేదు. కొవిడ్‌-19 సంక్షోభం చెప్తున్నదేమంటే.. విలువల ఆధారిత ప్రపంచ సహకారం (గ్లోబల్‌ వ్యాల్యూ చైన్స్‌) భూమికగా ఉండాలి.  ఇప్పటి కరోనా కష్టకాలం ఇదే చెప్తున్నది. ఇప్పుడు ఆర్థిక సహకార ప్రపంచంగా ఉన్న స్థితి నుంచి భౌగోళిక వ్యూహాత్మక సహకార వ్యవస్థగా పాదుకొనాలి. ప్రాంతీయ విలువ ఆధారిత సమూహాలకు సమగ్ర      పరస్పర సహకారమే ప్రాతిపదిక కావాలి. ఇలాంటి సహకార ప్రపంచమే వస్తూత్పత్తి, వస్తుసేవల రంగం లాంటి దన్నుతో ప్రజల అవసరాలను తీరుస్తుంది.

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం ఊహించినదానికన్నా వినాశకరమైనది. కరోనా వైరస్‌ కన్న ముందే వివిధ దేశాల్లో ఆర్థికఅంతరాలు  గణనీయ స్థాయిలో పెరిగిపోయాయి. కాకుంటే కరోనా వైరస్‌ తాకిడి తర్వాత ఆయా సమాజాల్లో ఆర్థిక అంతరాల స్థితిగతులు మరింత నగ్నంగా బయటపడుతున్నాయి. అందరికీ కనిపిస్తున్నాయి. అత్యంత ధనవంతమైన దేశం అమెరికాలో నల్లజాతివారిపై కరోనా ప్రభావం మరింత తీవ్రంగా భయంకరంగా ఉన్నది. అది మనదేశంలో వలస కార్మికుల విషయంలోనూ కనిపిస్తున్నది. ఇక్కడే సామాజిక సమూహాల స్థితిగతులపై కరోనా ప్రభావం చర్చనీయాంశం అవుతున్నది. కరోనా అందరిపై ఒకే ప్రభావాన్ని కలిగిస్తుందన్నది కాకుండా, వివిధ ఆర్థిక సామాజిక సమూహాలపై విభిన్న ప్రభాలను వేస్తున్నది. 

కరోనా అనంతర ప్రపంచంలో ఆయా దేశాలు ఆహారం, ఆవాసానికి ఇచ్చినంతగా సామాజిక భద్రతకు ప్రాధాన్యం ఇవ్వటం లేదు. కొవిడ్‌-19తో ఏర్పడిన సంక్షోభం పేద ల సామాజిక భద్రతను ప్రశ్నార్థకం చేసింది. భారతదేశం కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌పై ఆధారపడి మిగతా విషయాలను అంతగా పట్టించుకున్న పరిస్థితులు కనిపించటం లేదు. మరోవైపు పొరుగు దేశాలతోపాటు అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌, బ్రెజిల్‌ లాంటి దేశాలకు పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లతోపాటు, హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ (హెచ్‌సీక్యూ)ను అడిగిన వెంటనే సరఫరా చేస్తున్నది. ప్రపంచమంతా వసుధైక కుటుంబమనే తాత్విక విధానంతో భారత్‌ ఔషధాలను అందిస్తున్నది. ఈ కోణంలో చూస్తే ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభంలో భారత్‌ కీలక భూమిక పోషిస్తున్నది. 

రానున్న కాలంలో ప్రపంచంలోనే ఔషధ ఉత్పత్తి, సరఫరాలో మన దేశం ప్రాధాన్యం సంతరించుకోనున్నది. వ్యాధుల నివారణకు వినియోగించే వ్యాక్సిన్ల తయారీలో 70 శాతం మనదేశమే ఉత్పత్తిచేస్తున్నది. హెచ్‌సీక్యూను ప్రజారోగ్య భద్రత కోసం ఉత్పత్తి చేస్తూ ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలో కీలక భూమిక పోషిస్తుందనటంలో సందేహం లేదు.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా దేశాలు సుస్థిరాభివృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. ఎస్‌డీజీ-3లో భాగంగా.. సర్వత్రా అన్ని దేశాల్లో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతకు హామీగా నిలువాలి. ఈ క్రమంలో కరోనా గురించి సమగ్ర సమాచారం, జ్ఞానం లేని పరిస్థితుల్లో  నివారణ ప్రయత్నం అంత సులువు కాదు. ఇది ప్రధానంగా ఆయా దేశాల ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా భారత్‌లాంటి దేశంలో ప్రజారోగ్య భద్రతలో ఆర్థిక స్థితి ముఖ్యమైనది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్‌డీజీ)లో ప్రధానంగా చెప్పుకున్నవి పేదరిక నిర్మూలన, ఆకలిని  రూపుమాపటంలాంటి లక్ష్యాలపై ఆర్థికస్థితి ప్రభావం అమితంగా ఉంటుంది. 

కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచ దేశాలన్నీ ఉదాత్తంగా వ్యవహరించాలి. సంకుచిత విభేదాలను విడనాడి ఉమ్మడి శ్రేయస్సుకోసం కలిసి పనిచేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశాలు అనుసరిస్తున్న విధానం ఆశాజనకంగానే ఉన్నది. ఇదే సమయంలో దేశాలన్నీ బహుళ ప్రయోజనాల పరిరక్షణ, పరస్పర సహకారం పునాదిగా ముందుకు పోవాలి. ఆర్థిక ఆధిపత్య శక్తులు వినాశకర శత్రువైరుధ్యాలకు చరమ గీతం పాడాలి. సంకుచిత భౌగోళిక రాజకీయ వ్యూహాత్మక విధానాలను విడిచిపెట్టాలి. 

 (వ్యాసకర్త: ఫ్రాన్స్‌లో భారత మాజీ రాయబారి)

-డాక్టర్‌ మోహన్‌కుమార్‌


logo