మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 09, 2020 , 00:42:20

తెలుగు లిపిలో తమిళ చొరబాటు

తెలుగు లిపిలో తమిళ చొరబాటు

ఇది అక్షరాలా తెలుగు భాషకు సంబంధించిన అక్షరాల విషయమే అయినా పూర్తిగా సాంకేతికం. అందరికీ అర్థం కావచ్చు. కాకపోవచ్చు. అందరికీ అర్థం కాదన్న ధైర్యంతోనే తెలుగు అక్షరాలకు తమిళ పొగపెడుతున్నారు. తెలుగు భాషా ప్రేమికులు, మీడియా, ముద్రణారంగంలో పనిచేసేవారు, ఆమాటకొస్తే తెలుగు అక్షరాలనుఉపయోగించే అందరూ అర్థం చేసుకోవాల్సిన సమస్య ఇది. నిజానికి ఇది సమస్య కాదు. కుట్ర. తెలుగువారు పట్టించుకోరులే అన్న చిన్నచూపు. నిర్లక్ష్యం.

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. భాషలో మాట ముందు పుడుతుంది. ఆ మాటలను సంకేతిస్తూ లిపి తరువాత పుడుతుంది. స్థూలంగా ఆయా భాషల్లో మాట్లాడే ధ్వనులకు లిపి సరిపోతుంది. సూక్ష్మంగా అయితే చాలదు. కానీ రాసే భాషలో పరిమితులున్నా విని విని మాతృభాష అయినవారు దాన్ని పలికేప్పుడు సరిగ్గానే పలుకుతారు. 

ఒకే భాషలో ఎన్నో మాండలికాలుంటాయి. ఉచ్చారణలో భేదాలుంటాయి. కానీ వాటన్నిటినీ ఆ భాష లిపి ఒకే వేదిక మీదికి తెస్తుంది. భాషకు లిపి శాశ్వతత్వం ఇస్తుంది. లిపిలేని భాషలు కాలగతిలో అంతరించిపోతాయి. లిపి వల్ల వారసత్వంగా జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తూ ఉంటుంది. తెలుగు వర్ణమాలలో కొన్ని అక్షరాలను మనమే మింగేశాం. కొన్ని పలకలేక వదిలించుకున్నాం. లిపిని ఎంత తక్కువ ఉపయోగిస్తే ఆ భాష అంత త్వరగా మట్టికొట్టుకుపోతుందన్నది ఒక వాస్తవం. 

సాంకేతిక విజ్ఞానం పెరిగే కొద్దీ వేగం పెరుగుతుంది. ఒకప్పుడు అక్షరాల సీసం దిమ్మలు కంపోజింగ్‌ స్టిక్‌ మీద పేర్చి, దాన్ని ముద్రణా యంత్రంలో బిగించి ముద్రించేవారు. కంప్యూటర్లు వచ్చాక టైపింగ్‌ ఫాంట్లు వచ్చాయి. వేగం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల లిపులను ఫాంట్లుగా తయారుచేయడానికి ఒక యూనికోడ్‌ కన్సార్షియం ఉంది. ఎలా చేస్తారన్నది మరీ సాంకేతికమయిన అంశం.  కంప్యూటర్‌ ఏ డేటానయినా నంబర్ల  కోడ్‌గానే తీసుకుంటుంది. ఇదంతా ఒక కోడ్‌,     డీకోడ్‌ సాంకేతిక భాష. కొన్ని నంబర్లను ఒక్కో భాష లిపికి కేటాయిస్తారు. ఇప్పుడు యూనికోడ్‌ మన తెలుగు లిపిలోకి రెండు తమిళ అక్షరాలను ప్రవేశపెట్టింది. 

ఎవరో తమిళులు పురాతన తెలుగులో రెండు అక్షరాలు తమిళ అక్షరాల్లాగే ఉన్నాయని కనుక్కున్నారట. దాంతో ఆ అక్షరాలు తెలుగు సాంకేతిక పట్టికలో చేర్చాలని ప్రతిపాదించారట. యూనికోడ్‌ వారు ఒప్పుకొని ప్రవేశపెట్టారు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు. పైపెచ్చు తెలుగులో ఆ అక్షరాలు ఉండటం గొప్పే కదా  అని కూడా అనిపించవచ్చు. కానీ తెలుగు అక్షరాల ఉనికికి జరగబోయే ప్రమాదాన్ని తెలుగు సాంకేతిక నిపుణులు గుర్తించారు. మన లిపి పవిత్రత కూడా దెబ్బతింటుంది. రేప్పొద్దున తెలుగుకు లిపి ఎక్కడ ఏడ్చింది? తెలుగులో ఉన్నవన్నీ తమిళ అక్షరాలే.. దానికి ఈ రెండక్షరాలే గొప్ప సాక్ష్యం అని తమిళులు అంటే చేయగలిగింది ఏమీఉండదు. మన తెలుగు అక్షరాల్లాగే కనిపించే అక్షరాలు   మిగతా ప్రపంచ భాషల్లో చాలా ఉండి ఉండవచ్చు. రూపసామ్యం ఉన్నంతమాత్రాన వాటిని తెచ్చి తెలుగుకోడ్‌లోనే కలిపివేయవచ్చా? మనం  A B C D లను ఏ బీ సీడీ అని రాస్తున్నాం.   తెలుగులో ఏ బీ సీ డీ ఉన్నాయి కాబట్టి వీటిని ఇంగ్లీషు లిపి కోడ్‌లో కూడా ప్రవేశపెట్టాలని కానీ, తెలుగువారు  A B C D లు వాడుతున్నారు కాబట్టి ఇవి తెలుగు అక్షరాలుగా ఇంగ్లీషు కోడ్‌లో పెట్టాలని కానీ వాదిస్తే ఎంత అడ్డదిడ్డంగా, అర్థంలేనిదిగా ఉంటుందో ఇప్పుడు యూనికోడ్‌ వారు తమిళ అక్షరాలను తెలుగు కోడ్‌లో పెట్టడం అలాగే ఉంది. తెలుగువారు దీనిమీద సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం, అభ్యంతరం వ్యక్తం చేసేసరికి తమిళులు సమర్థింపు కోసం విచిత్రమయిన వాదన ముందుకు తెచ్చారు. ప్రాచీన తమిళ సాహిత్యాన్ని తెలుగులిపిలో చదవాలనుకునేవారికి ఇది ఉపయోగమని అనుకున్నారట. మంచిదే. ఇప్పటికిప్పుడు ప్రాచీన తెలుగు సాహిత్యాన్ని చదవాలనే ఎవరూ పొరపాటునకూడా అనుకోవడం లేదు. అలాంటిది ప్రాచీన తమిళ సాహిత్యాన్ని చదవాలనుకున్న తెలుగువారెవరో తమిళులే చెప్తే ఆనందబాష్పాలయినా రాల్చవచ్చు. నిజానికి ఇలాంటివన్నీ లాబీయింగ్‌ మీద ఆధారపడి ఉంటాయి. అలాంటి విషయాల్లో తమిళులది అందె వేసిన చేయి. తెలుగువారిది ఆరంభశూరత్వం. 

తెలుగువారిని సంప్రదించకుండా తమిళ అక్షరాలను తెలుగుపద్దులో కలపడం యూనికోడ్‌ చేయకూడని పని. దీనివల్ల భవిష్యత్తులో లిపికి సంబంధించి ఇతరేతర సమస్యలు చాలా వస్తాయి. యూనికోడ్‌ అనవసరంగా మన అక్షరాల తేనె తుట్టెను కదిపింది. తెలుగు భాషాభిమానులు, ఈ విషయం మీద లోతయిన అవగాహన ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు వివిధ రూపాల్లో అభ్యంతరాలను వ్యక్తంచేస్తున్నారు. మన అక్షరాలను కాపాడుకోవడానికి సంబంధించిన ఈ విషయంలో ఇంకా విస్తృతంగా చర్చ జరగాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు యూనికోడ్‌కు అధికారికంగా తమ నిరసనను, అభ్యంతరాలను వ్యక్తం చేయాలి. మన ప్రమేయం లేకుండా మన లిపిలో ప్రవేశపెట్టిన రెండు తమిళ అక్షరాలను వెంటనే తొలగించాలి.

మన అక్షరాలను కాపాడుకోవడానికి సంబంధించిన ఈ విషయంలో ఇంకా విస్తృతంగా చర్చ జరగాలి. రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు యూనికోడ్‌కు అధికారికంగా తమ నిరసనను, అభ్యంతరాలను వ్యక్తం చేయాలి. మన ప్రమేయం లేకుండా మన లిపిలో ప్రవేశపెట్టిన రెండు తమిళ అక్షరాలను వెంటనే తొలగించాలి.

-పమిడికాల్వ మధుసూదన్‌


logo