గురువారం 01 అక్టోబర్ 2020
Editorial - May 07, 2020 , 22:57:22

కరోనా మాంద్యం

కరోనా మాంద్యం

కరోనా ఆరోగ్యాన్నే కాదు, ఆర్థికాన్నీ దెబ్బకొడుతుందనే భయాలు నిజమయ్యాయి. యూరప్‌ను భారీ మాంద్యం ముంచెత్తబోతున్నదని యురోపియన్‌ యూనియన్‌ మంగళవారం హెచ్చరించింది. మాంద్యం ప్రభావం వల్ల  ఈ 2020లోనే ఈయూ ఆర్థిక వ్యవస్థ 7.4 శాతం మేర క్షీణిస్తుందని అంచనా. 2009లో ప్రపంచం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినప్పుడు యూరప్‌ ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం మేర పతనమైంది. దీనిని బట్టి రాబోయే మాంద్యం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థ 8.2 శాతం, జర్మనీలో 6.5 శాతం కుదించుకుపోతాయని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఈయూ దేశాలలో నిరుద్యోగం 6.7 నుంచి తొమ్మిది శాతానికి పెరుగుతుందని అంచనా. మరోవైపు అట్లాంటిక్‌ జలాలకు ఆవలి వైపున ఉన్న అమెరికాలో ఆర్థిక వ్యవస్థ 6.5 శాతం కుంచించుకుపోవచ్చు. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత యూరప్‌ చరిత్రలోనే ఇది అత్యంత ఘోరమైన మాంద్యమని ఈయూ స్పష్టంగా చెప్పింది. 

యూరప్‌ దేశాలలో కొవిడ్‌ వల్ల మరణాలు ఇటీవల తగ్గుముఖం పట్టినప్పటికీ, వైరస్‌ ఇంకా వ్యాప్తి చెందుతూనే ఉన్నది. కరోన కట్టడి పూర్తి కానప్పటికీ, యూరప్‌ దేశాలు హడావుడిగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయడానికి కారణం ఈ ఆర్థిక పరిస్థితులే. రెండో దశ కరోనా దాడి జరగవచ్చుననే హెచ్చరికలున్నప్పటికీ, ఆర్థిక రంగాన్ని నిర్లక్ష్యం చేయలేమని పారిశ్రామిక దేశాలు భావిస్తున్నాయి. స్థల కాల పరిస్థితులను బట్టి వ్యాధి వ్యాప్తిని గమనిస్తూ లాక్‌డౌన్‌లో సడలింపులు చేస్తూ, సందర్భానుసారం వ్యవహరించాలనేది ఈయూ దేశాల ఎత్తుగడ. ‘కరోనా- మాంద్యం’ యూరప్‌ సమస్య కాదు, ప్రపంచ సమస్య. కరోనా వైరస్‌, మాంద్యం యూరప్‌ దేశాల్లో దీర్ఘకాలం తిష్ఠవేసుకుని ఉంటే అది మొత్తం ప్రపంచానికి ప్రమాదకరమని ఆర్థిక వేత్తలు అంటున్నారు. యూరప్‌కు అతి పెద్ద భాగస్వామి అమెరికా అయితే, ఆ తరువాతి స్థానం చైనాది. ఈ దేశాలకు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య సంబంధాలున్నాయి. అందువల్ల యూరప్‌ ప్రభావం దశలవారీగా ప్రపంచమంతటా ఉంటుంది. 

మాంద్యం రాబోయే మాట నిజమే అయినప్పటికీ, కరోనా కథ ఇంకా ముగియలేదనే భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. యూరప్‌ దేశాలలో లాక్‌డౌన్‌ సడలించిన తరువాత మళ్ళీ కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని  హెచ్చరికలు వినబడుతున్నాయి. వైరస్‌ మళ్ళీ వ్యాపించడం కనుక జరిగితే అయితే అది ఏ స్థాయిలో ఉంటుందనేది అంచనా వేయలేము. అందుకని ఫ్రాన్స్‌ ‘రీకన్‌ఫైన్‌మెంట్‌ ప్లాన్‌'ను ముందే సిద్ధం చేసుకున్నది. ఇతర దేశాలు కూడా వ్యూహ రచనలో ఉన్నాయి. కరోనా వ్యాప్తి- నిరోధక దశలే కాకుండా, మాంద్యం విషయంలోనూ భారత్‌కు యూరప్‌ దేశాలను చూసి నేర్చుకునే వెసులుబాటు ఉన్నది. యూరప్‌లో ఉన్నంత వైవిధ్యం మన విశాల భారతంలోనూ ఉన్నది. అక్కడ ఉత్తరాది దేశాలకు, దక్షిణాదికి కరోనా వ్యాప్తి, మాంద్యం పరిస్థితుల్లో తేడా ఉంటుంది. చిన్న దేశాలు కనుక స్థానిక పరిస్థితులను బట్టి స్వీయ నిర్ణయాలు తీసుకుంటాయి. మన దేశంలో కూడా రాష్ర్టాలను బట్టి భిన్న పరిస్థితులున్నాయి. అందువల్ల కేంద్రం ఒంటెద్దు పోకడలు పోతే ఫలితం ఉండదు. కరోనా కట్టడిలోనే కాకుండా, ఆర్థిక వ్యూహాల రూపకల్పనలోనూ ప్రధాని మోదీ రాష్ర్టాలతో చర్చిస్తూ సమష్టి దృక్పథంతో వ్యవహరించాలి. 


logo