బుధవారం 30 సెప్టెంబర్ 2020
Editorial - May 07, 2020 , 22:57:25

విద్యుత్‌ బిల్లు.. సంక్షేమానికి చిల్లు

విద్యుత్‌ బిల్లు.. సంక్షేమానికి చిల్లు

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సంస్కరణలు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే ముసాయిదా రూపకల్పన చేసి సూచనల కోసం రాష్ర్టాలకు పంపింది. కేంద్రం తీసుకురానున్న విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు- 2020 అన్ని వర్గాలపై ఆర్థికభారాన్ని మోపనున్నది. ఈ సంస్కరణల ప్రధాన ఉద్దేశం రాష్ర్టాల అధికారాలను కత్తిరించడంతోపాటు విద్యుత్‌ వ్యవస్థను ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టడమే లక్ష్యంగా కనపడుతున్నది. ఇది ఒకరకంగా విద్యుత్‌పై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ అభిప్రాయాలకు పూర్తి విరుద్ధమే. విద్యుత్‌ రంగంపై పూర్తి అధికారాలు రాష్ర్టాలకే ఉండాలని అంబేద్కర్‌ సూచించాడు.

కొత్త చట్టం వస్తే.. ఉచిత విద్యుత్‌ పథకం సమస్యగా మారుతుంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాల్సి వస్తుంది. రాబోయే కొత్తచట్టంలో మరో ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. ఆ చట్టం క్రాస్‌ సబ్సిడీలను మొత్తంగా ఎత్తేయాలని చెప్తున్నది. పారిశ్రామికరంగమైనా, వ్యవసాయరంగమైనా ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాల్సిందే అంటున్నది. 

మనదేశం వ్యవసాయ ఆధారితం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ర్టాలకే విద్యుత్‌ రంగంపై అధికారం ఉండాలని అంబేద్కర్‌ చెప్పాడు. అందుకే రాష్ర్టాలు విద్యుత్‌ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచించాడు. అలా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డును సంస్కరణల పేరుతో 1998లో నాటి చంద్రబాబు కొత్త చట్టంతో నాలుగు ముక్కలు చేశాడు. మరోవైపు 2003లో కేంద్రం కొత్త విద్యుత్‌ చట్టాన్ని తెచ్చింది. అంబేద్కర్‌ అభిప్రాయానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. రాష్ర్టాల హక్కులను కుదించింది. తాజాగా మోదీ తెచ్చే చట్టంతో రాష్ర్టాలకున్న కొద్దిపాటి హక్కులు కూడా హరించుకుపోతాయి. 

ఈ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రైతులకు వ్యవసాయం భారమయ్యే ప్రమాదం ఉన్నది. సమస్యల దృష్ట్యా, రైతాంగాన్ని ఆదుకొనేందుకు రాష్ర్టాలు విద్యుత్‌తోపాటు విత్తనాలు, ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఉచితంగా ఇవ్వడంతో పాటు, పెట్టుబడి కింద ఏడాదికి ఎకరానికి పదివేల రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నది. 

మోదీ సర్కార్‌ కొత్తగా తేవాలనుకుంటున్న విద్యుత్‌ చట్టం ప్రకారం రైతుల నుంచి ముక్కుపిండి కరెంట్‌ బిల్లు వసూలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనుకున్నా అలా ఇవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు గ్యాస్‌ సబ్సిడీ ఎలాగైతే అమలుచేస్తున్నారో అలాగే విద్యుత్‌ సబ్సిడీ కూడా అమలు చేయాల్సి వస్తుంది. రైతాంగం నుంచి ముందు విద్యుత్‌ బిల్లులు వసూలు చేయాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వదలుచుకున్న సబ్సిడీని రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయాలని చట్టం చెప్తున్నది. కొత్త చట్టం అమలులోకివస్తే తక్షణమే మోటర్లకు మీటర్లు బిగించాలి. నెల నెలా రైతుల పొలాలకు వెళ్లి మీటర్‌ రీడింగ్‌ చూసి బిల్లులను ఇవ్వాలంటే ఇప్పుడున్న యంత్రాంగం సరిపోదు. అదనంగా సిబ్బందిని నియమించుకోవాలంటే, ప్రభుత్వం మీద అదనపు భారం. ఒక యూనిట్‌ విద్యుత్‌ఉత్పత్తికి సగటున ఐదు రూపాయలదాకా ఖర్చు వస్తుంది. కానీ, ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా రైతుల నుంచి సగటున రెండు, రెండున్నర రూపాయలు మాత్రమే వసూలు చేస్తున్నారు. మిగిలిన భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తున్నాయి. కొన్ని రాష్ర్టాల్లో మీటర్లు బిగించినా అవి నిరుపయోగంగానే ఉన్నాయి. ఎందుకంటే రైతు దగ్గర నామమాత్రంగా బిల్లులు వసూ లు చేస్తున్నారు. ఆ మొత్తాలు సిబ్బంది జీతాలకు కూడా సరిపోవడం లేదు. అందుకే మీటర్లున్నా రీడింగ్‌ చూడటం లేదు, బిల్లులు ఇవ్వడం లేదు.

తెలంగాణలో అయితే 24గంటలు విద్యుత్‌ ఉచితంగానే ఇస్తున్నారు. కొత్త చట్టం వస్తే.. ఉచిత విద్యుత్‌ పథకం సమస్యగా మారుతుంది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాల్సి వస్తుంది. రాబోయే కొత్తచట్టంలో మరో ప్రమాదకరమైన అంశం కూడా ఉంది. ఆ చట్టం క్రాస్‌ సబ్సిడీలను ఎత్తేయాలని చెప్తున్నది. పారిశ్రామికరంగమైనా, వ్యవసాయ రంగమైనా ఇచ్చే సబ్సిడీ ఎత్తేయాల్సిందే    అం టున్నది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వదల్చుకుంటే వారి వారి బ్యాంకు ఖాతాలకు ఆ సబ్సిడీ మొత్తాన్ని జమచేయాలే తప్ప, నేరుగా  కరెంట్‌ బిల్లును మాఫీ చెయ్యడానికి వీలులేదని కొత్త చట్టం చెప్తున్నది. మరోవైపు ఇప్పటిదాకా రాష్ట్ర విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్లను ఆయా ప్రభుత్వాలు నియమిస్తూ వచ్చాయి. కొత్తగా కేంద్రం తెచ్చే చట్టం అమల్లోకి వస్తే, ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కమిషన్‌ సభ్యుల పేర్లను మాత్రమే ఇవ్వా ల్సి ఉంటుంది. కమిషన్‌ను నియమించే బాధ్యత కేంద్రం తీసుకుంటుంది. ఇంకా అనేక సంస్కరణలు తెచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటిదాకా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో ఏర్పడే సమస్యలను పరిష్కరించుకొనే అంశం ప్రధానంగా రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌ పరిధిలో ఉండేది. కేంద్ర స్థాయిలో అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ ఉండేది. కానీ కొత్త చట్టం ప్రకారం కొనుగోలు ఒప్పంద వివాదాలు కేంద్రం చేతుల్లోకి వెళతాయి. 

ఈ చట్టంలో మరో ప్రమాదకర అంశం కూడా ఉన్నది. విద్యుత్‌ పంపిణీని సబ్‌      లైసెన్స్‌కు ఇచ్చుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే భవిష్యత్తులో      ‘ఉదయ్‌'లాంటి స్కీంల ద్వారా కేంద్రం రాష్ర్టాలపై బలవంతంగా తమ విధానాలను రుద్దే అవకాశం ఉన్నది. లాభదాయక ప్రాంతాల్లో విద్యుత్‌ పంపిణీనీ ప్రైవేట్‌ సంస్థలకు కట్టబెట్టాలనే షరతులు కూడా విధించే అవకాశం ఉన్నది. వాటిని ఒప్పుకొంటేనే స్కీంలో చేరాల్సి ఉంటుంది. స్కీంలో చేరకపోతే కేంద్రం సబ్సిడీలు రావు. దీంతో రాష్ర్టాల పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా తయారవుతుంది. అందుకే తెలంగాణ సీఎం తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లును రాకుండా అడ్డుకుంటామని కూడా ప్రకటించారు. 

ఇప్పటికే రైతులకు పండించిన పంటకు సరైన మద్దతు ధర దొరకడం లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ సబ్సిడీ, విత్తనాల సబ్సిడీ ఇస్తున్నా రైతులకు అవి సరిపోవడంలేదు. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దేశంలో ఎక్కడాలేని విధంగా ఉచితంగా కరెంట్‌ ఇస్త్తున్నది. అలాగే రైతుల సంక్షేమం కోసం వినూత్న పథకాలతో రైతులకు అండగా నిలుస్తున్నది. 

వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నా, దాన్ని గట్టెక్కించేందుకు మోదీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోలేదు. స్వామినాథన్‌ సూచనలను బుట్టదాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానాతోపాటు దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా కేంద్ర సర్కార్‌ ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా ఇప్పుడు రైతుల  నడ్డివిరిచే విద్యుత్‌ సంస్కరణలు తేవడం దుర్మార్గం. విద్యుత్‌పై రాష్ర్టాలకు ఉండే కొద్దిపాటి హక్కులను కూడా కొత్తగా తెచ్చే చట్టం ద్వారా కేంద్రం లాక్కోబోతున్నది! కేంద్రం కనుక ఈ బిల్లును తెచ్చే ప్రయత్నం చేస్తే అన్ని పార్టీలను ఏకం చేసి ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. రైతు కష్టాలు తెలిసిన నాయకుడిగా, వ్యవసాయరంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ నాయకత్వంలో దేశవ్యాప్త రైతు ఉద్యమం జరగాలని రైతులు కోరుకుంటున్నారు.

(వ్యాసకర్త: ఇన్‌పుట్‌ ఎడిటర్‌, టీ న్యూస్‌)


logo