సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - May 07, 2020 , 22:57:21

అన్నీ తానై అండగ నిలిచె

అన్నీ తానై అండగ నిలిచె

చారిత్రక సందర్భాలు ఉద్యమాల నుంచి నాయకులు పుట్టుకువస్తారు. సంక్షోభ సమయాల్లోనే నాయకులు రాటుదేలుతారు. వారి నిర్ణయాలు, ధైర్యసాహసాలు.. నాయకత్వ లక్షణాలకు దర్పణంగా నిలుస్తాయి. ఈ వాక్యాలు తెలంగాణకు సరిగ్గా సరిపోయే అక్షర సత్యాలు.

కరోనానంతర పరిస్థితుల మీద కూడా సీఎం కేసీఆర్‌ విస్పష్టంగా ఉన్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అనేక తరుణోపాయాలను కూడా కేసీఆర్‌ కేంద్రానికి సూచించడం విశేషం. కేంద్రానికి, మొత్తం ఆర్థికవ్యవస్థకు కేంద్ర బిందువైన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు ఆయన చేసిన  సూచనలు మొత్తం ప్రపంచ ఆర్థికవేత్తలను సైతం ఆలోచింపజేశాయి.

ప్రజావసరాలు కేసీఆర్‌ను తమ నేతగా ఎన్నుకుంటే, అనితర సాధ్యమైన తెలంగాణ ఉద్యమం అదే కేసీఆర్‌ను తన నాయకునిగా ఎంచుకుంది. అదే కేసీఆర్‌ తెలంగాణను సాధించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు. తిరిగి అదే కేసీఆర్‌ను తెలంగాణ తమ సీఎంగా ఎన్నుకుంటే, ఇప్పుడు ఆ కేసీఆరే ధైర్యసాహసాలతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరిపాలనలో, ప్రజారంజక పాలనలో, ప్రజావసరాలు తీర్చడం, ప్రభుత్వ పథకాల రూపకల్పనలో, వాటి అమలులో తనదైన ముద్రవేస్తున్నారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ కరోనా కట్టడిలో లాక్‌డౌన్‌ లాంటి కఠోర నిర్ణయాలతో ప్రపంచానికే మార్గదర్శకులయ్యారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని చెప్పి, కేసీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఉద్యమాలు చేసిన నేతలు చాలా అరుదుగా ఉంటారు. ఉద్యమాన్ని ప్రారంభించి, ఆ ఉద్యమ లక్ష్యాన్ని ముద్దాడిన నేతలు వేళ్ళమీద లెక్కపెట్టేంత మందే ఉంటారు. అలాంటి అరుదైన నేత మన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. అవమానాలే ఆలంబనగా, ఆటుపోట్లనే సోపానాలుగా చేసుకుని తెచ్చిన తెలంగాణకు ఆయనే సీఎం కావడం తెలంగాణ అదృష్టం. కేసీఆర్‌ తన మేధోమథనంలోంచి అరుదైన, అద్భుతమైన, పథకాలతో, అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లల్లో రంగరించి అందిస్తున్న పరిపాలనతో తెలంగాణ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా మారింది.

కరోనా మహమ్మారి చైనాలో పుట్టి, యూరప్‌లో ఊపందుకుంటున్నప్పుడే, సీఎం కేసీఆర్‌ దాని తీవ్రతను పసిగట్టారు. దేశంలో అందరికంటే ముందుగానే లాక్‌డౌన్‌ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా స్పెషల్‌ హాస్పిటల్స్‌, బెడ్స్‌, డాక్టర్లు, సిబ్బంది, మందులను సిద్ధం చేశారు. అప్పటికింకా అనేక దేశాలు, మన దేశంలోని అనేక రాష్ర్టాలకు అసలా ఆలోచనే రాలేదు. తర్వాత క్రమేణా కరోనా ఎఫెక్ట్‌ ఎక్కువవుతున్న సమయంలో దేశంలో లాక్‌డౌన్‌ మొదలైంది. అంతటితోనే కేసీఆర్‌ ఆగిపోలేదు. కరోనా ఎఫెక్టులో ప్రపంచాన్ని పరిశీలిస్తూనే, ఎప్పటికప్పుడు ప్రధానితో, మిగతా రాష్ర్టాల సీఎంలతో మాట్లాడుతూ అనేక సూచనలు చేశారు. ఒకదశలో సడలింపులిస్తామని కేంద్రమంటే, నో అని తెగేసి చెప్పారు. దాదాపు ప్రతిరోజూ మంత్రులు, ఐఎఎస్‌లు, వైద్యశాఖ అధికారులతో సమీక్షలు జరిపారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేశారు. స్పష్టత, నిక్కచ్చితనం, నిజాయితీతో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు, ప్రధానికి చేసిన సూచనలు అమూల్యమైనవి.

కరోనానంతర పరిస్థితుల మీద కూడా సీఎం కేసీఆర్‌ విస్పష్టంగా ఉన్నారు. ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన తరుణంలో అనేక తరుణోపాయాలను కూడా కేసీఆర్‌ కేంద్రానికి సూచించడం విశేషం. కేంద్రానికి, మొత్తం ఆర్థికవ్యవస్థకు కేంద్ర బిందువైన రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు ఆయన చేసిన  సూచనలు మొత్తం ప్రపంచ ఆర్థికవేత్తలను సైతం ఆలోచింపజేశాయి. ఆర్థికరంగాన్ని ఆదుకోవడానికి హెలికాప్టర్‌ మనీ ఇవ్వాలని, ఇందుకు ప్రధాని చొరవ తీసుకోవాలని ఆర్బీఐ దగ్గర ఉన్న డబ్బులు సహా, ఏమేం చేయాలో కూడా లెక్కలు తేల్చేశారు. ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే మార్గాంతరాల పట్ల కేసీఆర్‌కు ఉన్న పట్టుకు, సాధికారతకు ఇవి నిదర్శనాలు. ఓవైపు ప్రధాని మోదీకి సూచనలు చేస్తూనే సఖ్యతను, మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపులను విభేదిస్తూనే కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ర్టాలతో రాజకీయాలకతీతమైన సమన్వయం నెరపడం కేసీఆర్‌ పరిణతి.

కరోనా కష్టకాలంలో 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 అందించడం కేసిఆర్‌ ఉదారత. వలస కార్మికులు తెలంగాణ నిర్మాణ భాగస్వాములంటూ అండగా నిలిచి, వాళ్లను కన్నబిడ్డల్లా చూసుకుంటామని ప్రకటించారు. వాళ్లకు షెల్టర్లు కల్పిస్తూనే, బియ్యం, ఒక్కరుంటే రూ.500, కుటుంబాలున్నవాళ్లకు రూ.1500 అందజేశారు. ఎవరూ అడగకముందే సమస్యలు గుర్తించి, వైద్యసహాయాలు అందించి, చివరకు వాళ్ల స్వస్థలాలకు ఉచితంగా పంపించడం మిగతా రాష్ర్టాల సీఎంలు, కేంద్రమంత్రుల ప్రశంసలు పొందాయి.

లాక్‌డౌన్‌ సమయంలో సీఎం కేసీఆర్‌ ఓ డాక్టర్‌లా, మానసిక శాస్త్రవేత్తలా కూడా వ్యవహరించారు. కూరగాయలు, పండ్లు, నిత్యావసరాల కొరత లేకుండా, ధరలు పెరుగకుండా చూస్తూనే ఇంటింటికీ అందేలా చేశారు. కరోనా పాజిటివ్‌ పేషెంట్లకు పౌష్టికాహారం అందించి త్వరగా కోలుకునేలా చేశారు. క్వారంటైన్‌, రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌ ఏదైనా సరే, ఎవ్వరికీ ఏ ఇబ్బందులు రాకుండా కేసిఆర్‌ చూశారు.

నిజానికి సీఎం కేసీఆర్‌ మాట మంత్రం. ఆయన భాష, యాస ఓ అయస్కాంతం. అసలు కేసీఆరే ఓ ట్రెండ్‌ సెట్టర్‌. ఓ బ్రాండ్‌. తెలంగాణ బ్రాండ్‌. తెలంగాణ ప్రజల బ్రాండ్‌. ఈ విలక్షణాలే కేసీఆర్‌ను విశేషమైన వ్యక్తిగా, మహాశక్తిగా నిలుపుతున్నాయి. 

 (వ్యాసకర్త: శాసనమండలి సభ్యుడు)


logo