సోమవారం 28 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 23:07:03

కేంద్రీకృత పోకడ తగదు

కేంద్రీకృత పోకడ తగదు

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతున్నందున వ్యాపార కార్యకలాపాలు స్తం భించిపోయి, రాష్ర్టాల ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ర్టాలను ఆదుకోవడం లేదా ఆదాయమార్గం చూపించడం కేంద్రం బాధ్యత. కానీ ‘అమ్మ పెట్టదు, అడుక్క తిననివ్వదు’ అన్నట్టుగా, కేంద్రం అధికారాలన్నీ గుప్పిట్లో పెట్టుకున్నదే తప్ప రాష్ర్టాలను బంధవిముక్తం చేయడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరినట్టు రాష్ర్టాలకు అధికారాలనైనా బదలాయించాలి లేదా కేంద్రమైనా నిర్ణయాత్మకంగా వ్యవహరించాలి. తెలంగాణ రాష్ర్టానికి సాధారణ పరిస్థితుల్లో ప్రతినెల దాదాపు 11 వేల కోట్లు ఆదాయం వస్తుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయం 1600 కోట్లకు తగ్గిపోయింది. ఉద్యోగుల జీతాలకే నెలకు మూడు వేల కోట్లు అవసరం. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచాలంటే పట్టించుకోవడం లేదు. రుణ చెల్లింపులు వాయిదా వేయించాలనే విజ్ఞప్తి కూడా గాలికిపోయింది. దేశ ఆర్థికవ్యవస్థను గాడిన పెట్టడానికి క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌, హెలికాప్టర్‌ మనీ వంటి విధానాలున్నాయని కేసీఆర్‌ సూచించినా ఫలి తం లేకపోయింది. కేసీఆర్‌ చెప్పినట్టు ఇది ఒక తెలంగాణ సమస్య కాదు, దేశం సమస్య. 

మోదీ అధికారానికి వచ్చిన కొత్తలో సహకార సమాఖ్య దిశగా సాగుదామని అన్నప్పుడు, ఒక కొత్త శకానికి తలుపులు తెరుస్తున్నారనిపించింది. మోదీ గతం లో సీఎంగా ఉన్నారు. మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలోని కేంద్రం రాష్ర్టాలకు అధికారాలు ఇవ్వడం లేదని ఆరోపించేవారు. కానీ ఇప్పుడు రాష్ర్టాల బాధలను పట్టించుకోవడం లేదు సరికదా కనీసం మనోభావాలను గౌరవించడం లేదు. వ్యాపారసంస్థలు ‘కార్పొరేట్‌ సామాజిక బాధ్యత’ (సీఎస్‌ఆర్‌)గా కొన్ని నిధుల ను ఖర్చుచేయాల్సి ఉంటుంది. ప్రధాని (పీఎం కేర్స్‌) సహా యనిధికి కనుక ఆ నిధులను విరాళంగా ఇస్తే, సీఎస్‌ఆర్‌ కింద పరిగణిస్తారు. కానీ సీఎం సహాయ నిధికి ఇస్తే మాత్రం ఇదే నిబంధనను వర్తింపచేయడం లేదు. మోదీ ప్రభుత్వం ఇంత చిన్న మార్పు కూడా చేయకపోవడం ఆశ్చర్యకరం. 

ఎన్డీయే ప్రభుత్వం స్వభావరీత్యా కేంద్రీకృత వ్యవస్థకు అనుకూలమైందనే అభిప్రాయం బలపడుతున్నది. ప్రణాళికసంఘాన్ని పాతరపెట్టి నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసినప్పుడు రాష్ర్టాలను జాతీయాభివృద్ధికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యమని కేంద్రం పేర్కొన్నది. కానీ నిధుల పంపిణీ అధికారం ప్రణాళిక సంఘం నుంచి కేంద్ర ఆర్థికశాఖకు బదిలీ అయింది. జీఎస్టీ ద్వారా రాష్ర్టాల అధికారానికి కత్తెర పడ్డది. జీఎస్టీ మండలి నిర్మాణం కూడా సమాఖ్య స్ఫూర్తికి భంగకరంగా ఉన్నది. జలవనరులు మొదలుకొని అనేక అంశాలపై కేంద్ర ఆధిపత్యాన్ని స్థిరీకరించే పలు నిర్ణయాలను మోదీ ప్రభుత్వం తీసుకున్నది. ఇప్పుడిక ఈఆర్‌సీల నియామకాన్ని కూడా కేంద్రం తన చేతిలోకి తీసుకోవడానికి విద్యుత్‌ బిల్లును ప్రవేశపెట్టబోతున్నది. ఇదికూడా రాష్ర్టాల హక్కులకు భంగకరమే. తమ ప్రజల ప్రాధాన్యాలకు అనుగుణమైన విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ర్టాలకు ఉండవలసిందే. ప్రధాని మోదీ కనుక నిజంగా సహకార సమాఖ్యను నిర్మించాలనుకుంటే ఇంతకు మించిన తరుణం మరొకటి ఉండదు. ముఖ్యమంత్రుల అభిప్రాయాలను గౌరవిస్తూ, రాష్ర్టాలకు అధికారాలను బదలాయించాలి.


logo