మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 23:06:57

క్షమ చిగురిస్తున్న కాలం

క్షమ చిగురిస్తున్న కాలం

అనాది మానవ ఇతిహాసంలో

ఇదో పెద్ద కుదుపు

దేశాలనే వళ్ళకాడుగా మార్చి

సరిహద్దులు.. 

పొలిమేరలు దాటి

చొచ్చుకువచ్చిన 

కరోనా క్రూర పరిహాసం..!

వైరస్‌కు ముందు

వైరస్‌ తర్వాతగా

విభజితమయ్యే మానవ 

ఏకాంతవాస చరిత్ర..!

మనుషుల్లోని

విపరీత వికృతులకు

విసిగివేసారిపోయి

ఛెళ్ళుమని ప్రకృతి 

చరిచినచెంపదెబ్బ ఇది!

మనుషుల మధ్య

అసమానతలకు

సహజ జీవనాన్ని విస్మరించిన

మనిషి పశుత్వాలకు

ప్రకృతి కట్టిన ఆనకట్ట ఇది!

తుఫానులనెదుర్కోవచ్చు

తుపాకులనెదుర్కోవచ్చు

మనిషికి మనిషే

అంటువ్యాధి ఇప్పుడు

సమూహాలే వైరస్‌ క్యాంపులు

సామాజిక దూరమే

నివారణ నేడు

రెండు పరిశుభ్రమైన చేతులే 

మొదటి మందు

భౌతికదూరం బాధ్యత..!

దూరాలదేముంది

మానసిక దూరాలు

తగ్గుతున్నట్టున్నాయి

మనుషుల్లో క్షమాగుణం

చిగురిస్తున్నట్టుంది

భూగోళంలో ఏ మూలన

కరోనా విషాదానికైనా

కరిగిపోతున్నాయి

గుండెలిప్పుడు..!

కనిష్ఠ అవసరాలతో

ప్రకృతి సహజంగా

బతుకాలనే ఎరుక

కొందరిలోనైనా

కలుగుతుందిప్పుడు!

మానవాళికి ఈ క్రిమి పీడ 

విరగడవ్వాలని దేశదేశాలన్నీ

విన్నవించుకుంటున్నవి

నగర రహదారులు జనజీవన 

చైతన్య స్రవంతులై.. 

ప్రవహించేరోజు కోసం

సర్వ ప్రాణికోటి వేచిచూస్తుంది! 


logo