ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 06, 2020 , 00:04:30

ఔషధం కోసం అన్వేషణ

ఔషధం కోసం అన్వేషణ

వ్యాధిగ్రస్థుడి శరీరంలోని కరోనా వైరస్‌పై దాడి జరిపి నిర్వీర్యం చేసే యాంటీబాడీ (క్రిమినాశక ప్రొటీన్‌)ని కనుగొన్నట్టు ఇజ్రాయెల్‌ తాజాగా ప్రకటించింది. ఒక్క ఇజ్రాయెల్‌లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కరోనాను నిర్మూలించే దిశగా వందకు పైగా పరిశోధనలు సాగుతున్నాయి. నిత్యం ఆయా పరిశోధనల పురోగతి వార్తలు వివిధ దేశాల ప్రజల్లో ఆశను రేకెత్తిస్తున్నాయి. ప్రపం చ చరిత్రలోనే ఒక అసాధారణ స్థితిని కరోనా సృష్టించింది. ఇప్పటికే ఈ వైరస్‌కు సుమారు రెండున్నర లక్షల మంది బలయ్యారు. లక్షలాదిమంది వ్యాధిగ్రస్థులయ్యారు. ఈ అసాధారణ స్థితికి తగినట్టుగా, పరిశోధనలు కూడా అసాధారణవేగంతో సాగుతుండటం గమనార్హం. మిగతా వైరస్‌లు తరచుగా మార్పుచెందుతూ ఉంటాయి. కానీ ఈ లక్షణం కరోనా వైరస్‌లో తక్కువ. కాబట్టి కరోనా కట్టడికి వ్యాక్సిన్‌ను త్వరగా రూపొందించవచ్చుననే ఆశాభావం వ్యక్తమవుతున్నది.

సాధారణంగా ఒక వ్యాక్సిన్‌ను లేదా ఔషధాన్ని కనుగొనడానికి కొన్నేండ్లు పడుతుంది. కొన్ని దశాబ్దాలు పట్టిన ఉదంతాలున్నాయి. ఒక మందును తయా రుచేయడానికి ముందు అనేక పరీక్షలు జరుపవలసి ఉంటుంది. మందు తయారైన తర్వాత కూడా మొదట జంతువుల మీద ప్రయోగించి చూడాలి. ఆ తర్వా త కొందరు వ్యక్తుల మీద జరుపుతారు. ఆ తర్వాత వందలు, వేల మందిపై దశలవారీగా ప్రయోగించి చూస్తారు. ఇది కొన్నేండ్ల పాటు సాగుతుంది. కానీ ఇప్పుడు యుద్ధ పరిస్థితిని తలపిస్తున్నది. నియమ నిబంధనలన్నిటినీ పక్కనబె ట్టి జంతువుల ప్రయోగాలను దాటేసి మనుషులపైనే ప్రయోగించి చూస్తున్నా రు. ఒక్కోసారి భిన్నదశల ప్రయోగాలను ఒకేసారి సమాంతరంగా సాగిస్తున్నా రు. ఇంత వేగాన్ని ఏనాడూ కనీసం ఊహించలేదని వ్యాక్సిన్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ పరిశోధనలు కొలిక్కివచ్చినప్పటికీ, ఉపయోగంలోకి రావడానికి దాదాపు ఏడాదిన్నర పడుతుంది. కరోనా సృష్టిస్తున్న విలయాన్ని చూస్తుంటే ఈ ఏడాదిన్నర కాలమే ఎంతోదూరంగా ఉన్నట్టు కనబడుతున్నది. 

కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్‌ను లేదా మందును కనుగొనడం సాధ్యమా? హడావుడిగా సాగిన పరిశోధనలు సత్ఫలితాలను ఇస్తాయా? మందును కనుగొనలేకపోతే ఎలా అనే ఆలోచనలు కూడా వివిధ దేశాల పాలకుల, శాస్త్రవేత్తల మెదళ్ళను తొలుస్తున్నాయి. డెంగ్యూ మూలంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా నాలుగు లక్షల మంది మరణిస్తున్నారు. 2017లో వ్యాక్సిన్‌ వికటిస్తుండటంతో ఈ ప్రయోగాలను నిలిపివేశారు. ఎయిడ్స్‌కు రెండేండ్లలో వ్యాక్సిన్‌ సిద్ధమవుతుందని 1980 దశకంలో అమెరికా ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ నాలుగు దశాబ్దాలు గడిచింది. ఎయిడ్స్‌ మూలంగా మూడు కోట్ల మందికి పైగా మరణించారు. అయినా ఇప్పటికీ వ్యాక్సిన్‌ తయారుకాలేదు. కానీ మనుషులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనాకు మందును కనుక కనుగొనలేకపోతే, అది మొండిరోగంగా శరీరంలో ఉన్నప్పటికీ, మనిషి ప్రాణాలను నిలుపగలుగాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ దిశగా కూడా ప్రత్యామ్నాయ పరిశోధనలు సాగుతున్నాయి. వైరస్‌ను మందుతో నిర్మూలించలేకపోతే వైరస్‌తో సహజీవనానికి సిద్ధపడటం ఒక్కటే మిగిలిన మార్గం.


logo