ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - May 04, 2020 , 07:20:40

వెలిగందల నారయ కవిత్వం సందర్భోచితం

వెలిగందల నారయ కవిత్వం సందర్భోచితం

నారయ తెలుగు చేసిన మొత్తం పద్యాలను గమనిస్తే దేశీయ ఛందములైన కంద, సీస, తేటగీతి, ఆటవెలది పద్యాలు అధికంగా వాడుకొని మార్గవృత్తాలు అత్యంత తక్కువసంఖ్యలో వాడినట్లు స్పష్టం అవుతున్నది.

తెలుగువారికి తీయని ఫలం భాగవతం. అందించినవారు బమ్మెర పోతన. ఆయనతో పాటు మరిముగ్గురు.. ఏర్చూరి సింగన, బొప్పరాజు గంగన, వెలిగందల నారయ. వెలిగందల నారయ పోతనకు ప్రియశిష్యుడు. వెలిగందల ఊరి పేరు. కరీంనగర్‌ జిల్లా కేంద్రానికి ఐదు మైళ్ల దూరంలో ఉన్నది. ఒకప్పటి జిల్లా కేంద్రం. ఇక్కడ మానేరు జలాశయాన్ని ఆనుకొని గిరిదుర్గం ఉన్నది. పోతన ఇంటిపేరు బమ్మెర కూడా ఊరి పేరే. సోమన ఇంటిపేరు పాల్కురికి కూడా ఊరి పేరే. నారయ ఇంటిపేరు కూడా ఊరిపేరే.. వెలిగందల.

నారయ అనే పేరు నారాయణ శబ్దానికి తద్భవం. ఆయన భాగవతం చివరి ఏకాదశ, ద్వాదశ స్కంధాలను తెలిగించాడు. ‘వృద్ధాప్యం కారణంగా తాను పూర్తిచేయలేనేమోననే బెంగతో పూర్తి భాగవతానువాదాన్ని చూడాలని తొందరగా ఈ స్కంధాలను తెనిగించుమని కోరి ఉంటాడు పోతన్న. అందుకే అంత సంక్షిప్తంగా వేగంగా పూర్తిచేసినట్టుగా నారయ అనువాదం కనపడుతుంది’ అని ఆరుద్ర అభిప్రాయం. రెండు స్కంధాలు సంక్షిప్తం గా ఉన్న కారణంగా ఆరుద్ర ఊహను చాలామంది నమ్మారు. కానీ 181 పద్య గద్యాలలోనే రెండు స్కం ధాలు పూర్తిచేయడానికి అసలు కారణాలు ఆలోచించవలసి ఉన్నది.

భాగవతం దశమస్కంధం పూర్వోత్తర భాగాలుగా సుదీర్ఘంగా ఉన్నది. శ్రీకృష్ణుని పుట్టుక, బాల్యక్రీడలు, లీలలు కళ్ళకు కట్టినట్లు చూపించారు పోతన్న. కావ్య లక్షణానుసారంగా రుక్మిణీ కల్యాణంతో ముగిసినా చాలు. ఇప్పటికీ భాగవత సప్తాహం ప్రవచనాలు ఇక్కడితోనే ఎక్కువగా ముగిస్తారు.

ఏకాదశ ద్వాదశ స్కంధాలు లేకపోతే పురాణం పూర్తికాదు. వీటిలో భాగవత ఫలశ్రుతి ఉంది. ఏ కారణం చేత పరీక్షిత్తు భాగవతం వినాలనుకున్నాడో అది పూర్తికావడమే లక్ష్యం. కృష్ణనిర్యాణం, యదువంశ నిర్మూలనం ఇక్కడే ఉన్నాయి. ఈ సమాపనాలకు ముందు నారదుడు, శ్రీకృష్ణుడు, భాగవతులను, భగవంతుని మోక్షాన్ని గురించి చేసిన బోధలున్నాయి. ఇవన్నీ తాత్త్విక చింతనతో కూడినవి. కథలు తక్కువ. ఇది పురాణాంతర్గతమే కానీ కావ్యనిర్మాణం కాదు.

తాత్త్విక విషయాలు అతిదీర్ఘంగా వినడానికి, చదువడానికి సాధారణ పాఠకులు అంతగా శ్రద్ధచూపరు. అం త ఆసక్తికరమైన కథా ఘట్టాల్లేవు. మహా భారతంలో పద్దెనిమిది పర్వాల భగవద్గీతను తిక్కన్న సంక్షిప్తం చేయడంలో కూడా ఆంతర్యం ఇదే. యుద్ధ మధ్యంలో సుదీర్ఘమైన గీతోపన్యాసం వివరంగా ఉన్నా, పాఠకులు దాటే సి చదివే లక్షణం ఉంటుంది. కథాగమనం అటువంటి ది. ఇక్కడ రుక్మిణీ కల్యాణం వరకు కొంత ఉత్కంఠ ఉన్నా కల్యాణంతో అయిపోయింది. ఈ కారణాల చేత ఈ రెండు స్కంధాలను సంక్షిప్తం చేసి ఉంటాడు నార య. పోతన వృద్ధాప్యం కారణం కాదు.

పద్యాలు తక్కువ, గద్యాలు ఎక్కువ రాయడం వల్ల నారయ కవితా ప్రాగల్భ్యం తక్కువ గలవాడనే అపోహ కూడా కొందరిలో ఉంది. కానీ, అందుకు కార ణం వేరు. ఈ భాగంలో చాలా విషయాలు తాత్త్వికాంశాలు, బోధలు మాత్రమే ఉన్నాయి. కృష్ణుడు ఉద్ధవునకు పరమార్థము బోధించుట, యాగధర్మ వివరాలు, కలియుగ లక్షణాలు మొదలైనవి రసవత్తర ఘట్టాలు కావు. అయితే పోతన్న ఆయాచోట్ల తాత్త్వికార్థాలు అద్భుతంగా పద్యరూపంలో చెప్పాడు కదా అనిపించవచ్చు. అక్కడ కథా సన్నివేశాలు, పాత్రలు, సంఘటనలున్నాయి. ఇక్క డ కూర్చోబెట్టి బోధ చేయడమే ఉంది. చరిత్రనో శాస్ర్తా న్నో చెపుతున్నట్లుగా ఉంటుంది. కనుకనే గద్యంలో సులభంగా అర్థం కావాలని చేసి ఉంటాడు.

నారయ తెలుగు చేసిన మొత్తం పద్యాలను గమనిస్తే దేశీయ ఛందములైన కంద, సీస, తేటగీతి, ఆటవెలది పద్యాలు అధికంగా వాడుకొని మార్గవృత్తాలు అత్యంత తక్కువసంఖ్యలో వాడినట్లు స్పష్టం. ఇది కవి సామర్థ్యా న్ని ప్రామాణీకరించే అంశం. వెలిగందల నారయ దేశీ య ఛందస్సుకు ప్రాధాన్యం ఇవ్వడం స్థానికమైన అభిమానాన్ని, అప్పటి ప్రజలకు అలవాటైన పద్య లయలను దృష్టిలో పెట్టుకున్నాడని భావించాలి.

ఎక్కడెక్కడ మంచి సన్నివేశం ఉంటుందో అక్కడ అం దమైన పద్యాలు రాశాడు. సంభాషణా శైలి, అనుప్రాస లు, అలంకార ప్రయోగాలతో పాటు పోతన్న పద్యాల వలె అనేక పద్యాలున్నాయి.

నారయ కంద పద్యాలలో పలు నడకలు చూపించాడు. ‘తారల నెన్నగ వచ్చును/భూరేణుల లెక్కబోలును ధాత్రిన్‌, నారాయణ గుణకథనము, లారయ వర్ణింపలేరు హరబ్రహ్మాదు ల్‌..’ లెక్కించడం అని కాక లెక్కపెట్టుట అనేది వాడుక. నారాయణ గుణములు వర్ణించుట అనే ప్రయో గం ఔచితీమంతంగా చేశాడు. దీర్ఘాక్షరంతో ప్రారంభించిన పద్యం ప్రతిపాదం అదేవిధంగా ఉండి నడకలో ఒక లయను సాధించాడు.

అనుప్రాస, అలంకారాలు, ప్రశ్న సమాధానం ఒకే పద్యంలో-రకరకాల ప్రయోగాలున్నాయి. ‘జనములు నిను సేవింపని దినములు’, ‘తరణంబులు భవజలధికి..’  ఈ పద్యంలో సగణం ఎత్తుగడ. రెండు లఘువుల తర్వాత గురువు. తర్వాత నగణం నాలుగు లఘువులు. ఇది రెండడుగులు వేసి ఎగిరి దూకి నడిచినట్లుగా ఉం టుంది. ఇదొక శబ్దశిల్పం.

సీసపద్యాలు పోతన్నను తలపిస్తాయి. ‘సంతతంబును కృష్ణ సంకీర్తనంబులు, వీనుల కింపుగా వినగవలయు, హరినామ కథనంబు హర్షంబుతోడుత, పాటల నాట ల నాడవలయు..’ అన్ని పాదాంతాల్లో వల యు అని విషయాన్ని నొక్కిచెపుతూ ఒక ఉల్లేఖనం చేశాడు. సర్వలఘు సీసాన్ని కూడా రాశాడు. నల, నలల (నల గణానికి మరోలఘువు చేర్చడం). ఈ పద్యంలో మహాప్రాణాలు తక్కువగా సరళాక్షరాలు ఎక్కువగా ప్రయోగించి తెలుగు వాడుకకు దగ్గరగా కూర్చడం విశేషం. ‘నవ వికచ సరసిరుహ నయనయు గ..’ ఇట్లా ఎక్కడా కఠినాక్షరాల్లేవు. ఎత్తుగీతి లఘువులలోనే రాయడమే కాక పది అవతారాలు అందులో బిగించాడు.

‘తిమికమఠ కిటినృహరి ముదితబలి నిహి

తపద పరశుధర దశవదన విదళన

మురదమన కలికలుష సుముదపహరణ

కరివదన మునివర సురగరుడ వినుత..’ ప్రతి సీసప ద్యం వైవిధ్యంగా తనదైన శైలిలో పోతన్నకు భిన్నం కాకుండాను రచించడం నారయ పద్యరచనా నైపుణ్యం.

తేటగీతి పద్యాలు పోతన్నను అనుకరించినట్లుగా.. ‘నిన్నుచూడని కన్నులు నిష్ఫలములు/నిన్నునుడువని జిహ్వదా నీరసంబు/నిన్ను గానని దినములు నింద్యములగు/కన్నులను జూచి మమ్ముల గారవింపు..’ పై మూడు పాదాలలో కానివి, వ్యర్థమైనవి అనే అర్థంలో రాసి చివరిపాదంలో కన్నులతో కానిపించుమని ఆగక గారవించుమని అర్థించాడు. నాలుగవ పాదంలో పాఠకులు ఆగి ఆలోచనలోపడిపోతారు.

వెలిగందల నారయ భాగవత ఏకాదశ ద్వాదశ స్కంధాలలో పద్యాలు కొన్నయినా పద్యాల రూపనిర్మా ణం, అలంకారాల గురించి, తెలుగు పద, ఛందఃప్రయోగాల గురించి విశ్లేషించవచ్చును. 

నారయ ‘నారాయణ శతకం’ రాశాడు. ఆయన పద్యశిల్పానికి అదొక సాక్ష్యం. నారయ తన వినయం చేతనే కాక రచన చేత కూడా పోతనకు ప్రియ శిష్యుడనిపించుకున్నాడు.

- డాక్టర్‌ గండ్ర లక్ష్మణరావు, 98493 28036


logo