శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Editorial - May 02, 2020 , 00:19:36

ఆచితూచి అడుగేయాలి!

ఆచితూచి అడుగేయాలి!

కరోనా నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ కొనసాగింపుపై భిన్నవర్గాల నుంచి విభిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితుల్లో కేంద్రం మరో రెండువారాలు పొడిగించింది. దీర్ఘకాలంగా ప్రజలు లాక్‌డౌన్‌లో ఉండి జీవనవృత్తులకు దూరంగా ఉన్న తరుణంలో ఇది కఠిన నిర్ణయమే అయినా అనివార్యమైనది. అన్నివర్గాల దైనందిన జీవితాలూ తీవ్రంగా ప్రభావితమైనస్థితిలో ఇది మరింత కష్టభూయిష్టమైనదే. మన మనుగడ కోసం కష్టనష్టాలకు సిద్ధపడక తప్పనిస్థితి. దీంతో ప్రజల్లో కొంత అసహనం వ్యక్తం కావటం కూడా కాదనలేనిది. ఇలాంటి సంక్లిష్ట సందర్భాల్లోనే ప్రభుత్వాలు, ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి. ఇన్నాళ్లూ వైరస్‌ అంటే భయంతోనో, ప్రభుత్వాలు కలిగించిన అవగాహనా చైతన్యంతోనో జనం లాక్‌డౌన్‌కు సహకరించారు. ఇకముందు కూడా సంపూర్ణ సహకారం అందిస్తేనే కరోనా ముప్పు నుంచి శాశ్వతంగా బయటపడుతామని గ్రహించాలి.

దేశంలో తొలి కరోనా కేసు జనవరి 30న నమోదైన నాటినుంచి నేటికి 94 రోజులు. వైరస్‌ వ్యాప్తిని, దాని ప్రమాద తీవ్రత ముందుగానే గ్రహించిన కేంద్రం మార్చి 24 నుంచి దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించింది. సానుకూల అంశమేమంటే, ప్రజలు ప్రభుత్వాలకు సంపూర్ణ సహకారం అందించడం. లేనట్లయితే మనం కూడా యూరప్‌, ఇంగ్లండ్‌, అమెరికా దేశాల సరసన చేరేవాళ్లం. లక్షల్లో పాజిటివ్‌ కేసులు, వేలల్లో మరణాలు సంభవించి ఉండేవి. కానీ అలాంటివేమీ లేకుండా ఉన్నామంటే ప్రభుత్వాల ముందుచూపు, ప్రజలు ప్రదర్శించిన నిబద్ధత, క్రమశిక్షణనే కారణం. మన దేశంలో 13 వారాలు గడిచిన తర్వాత వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 33 వేలు దాటితే, అదే అమెరికాలో ఎనిమిదిన్నర లక్షలకు చేరువైంది. ప్రభుత్వాలు, ప్రజలు ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కరోనా ప్రభావం ఇంత తక్కువగా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు.

లాక్‌డౌన్‌ కొనసాగింపు ఆత్మహత్యా సదృశ్యమని వాణిజ్య, బ్యాంకింగ్‌రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దిగ్బంధం ఇలాగే కొనసాగితే కొవిడ్‌ మరణాల కన్నా ఆకలిచావులే అధికమవుతాయని ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి హెచ్చరిస్తున్నారు. ఈ కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు 65 వేల కోట్లు ఖర్చు చేయాలని ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సూచించారు. మరోవైపు వైద్య నిపుణులు మాత్రం కరోనా కట్టడిలో మే నెల అత్యంత కీలకమైనదని అంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వైరస్‌ నాశనం కాదని, వ్యాప్తిని నివారించగలమన్నది గుర్తించాలంటున్నారు. ఈ పరిస్థితుల్లో రెడ్‌ జోన్లలో లాక్‌డౌన్‌ మరింతకాలం పొడిగించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉత్పత్తి, రవాణారంగాన్ని పట్టాలెక్కించాల్సిన ఆవశ్యకత ఉన్నది. రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం గతంలోనే మే 7వ తేదీ దాకా లాక్‌డౌన్‌ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తగ్గుముఖం పట్టినా, పాజిటివ్‌ కేసులు ఇంకా జీరోస్థాయికి చేరుకోలేదు. ఈ పరిస్థితుల్లో ఎలాంటి భావావేశాలకు లోనుకాకుండా అటు ఆర్థికస్థితిని, ఇటు ఆరోగ్య పరిస్థితిని సంతులనం చేసుకుంటూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 


logo