శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - May 02, 2020 , 00:17:02

నిర్ణయం వరమే, కానీ..!

నిర్ణయం వరమే, కానీ..!

ఎప్పుడైనా, ఏ నిర్ణయమైనా సరైన సమయంలోనే తీసుకోవాలి. సమయం చేజారిన తర్వాత తీసుకున్న నిర్ణ యం ఎంత మంచిదైనా నష్టమే ఎక్కువ. వలస కార్మికుల విషయంలో ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం అలాంటిదే. కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న దశలో ఇప్పుడు వలస కార్మికుల ప్రయాణాలను అనుమతించడం రాష్ర్టాలకు కొత్త చిక్కులు తెచ్చేవిధంగా ఉన్నది. ముఖ్యంగా కట్టుదిట్టమైన చర్యలతో కరోనాను కట్టడి చేస్తున్న తెలంగాణ లాంటి రాష్ర్టాలకు ఈ నిర్ణయం ముమ్మాటికీ నష్టం కలుగజేస్తుంది.

కరోనా కట్టడి నేపథ్యంలో పలు రాష్ర్టాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులు, కూలీలను తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. దాంతో పాటు రాష్ర్టాలు చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది. ప్రభు త్వం వారి వివరాలను నమోదు చేసుకోవాల ని, వారికి వైద్య పరీక్షలు చేయాలని, అవసరమైతే క్వారంటైన్‌లో ఉంచాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంతర్రాష్ట్ర కార్మికుల విషయం లో ఇరు రాష్ర్టాలు అంగీకరిస్తేనే వారిని అనుమతించాలని కూడా అందులో స్పష్టంచేసిం ది. ఇల్లు చేరాలని తపన పడుతున్న వలస కార్మికులకు ఇదొక మంచివార్తే కావొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజలకు మాత్రం ముమ్మాటికీ కాదు.

సందర్భ మర్యాదలు పాటిస్తూ ఎవరూ బయటికి వేలెత్తి చూపడం లేదు కానీ, కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలను ఇరుకునపెట్టే నిర్ణయాలే ఎక్కువ తీసుకుంటున్న ది. వ్యాధి మొదలైనప్పటి నుంచి ప్రధానిగా మోదీ ముందుచూపు ప్రదర్శించలేకపోయార నే విమర్శలున్నాయి. నిజానికి కొవిడ్‌-19 ఒక మహమ్మారిగా మారిందని డబ్ల్యూహెచ్‌ వో మార్చి 11నే ప్రకటించింది. అప్పటికే ప్రపంచంలోని 110 దేశాలు కరోనా వైరస్‌ బారిన పడ్డాయి. ఆ తర్వాత 11 రోజులకు ప్రధాని మోదీ దేశంలో జనతా కర్ఫ్యూ ప్రకటించారు. దీన్ని ముందుగానే అంచనావేసిన తెలంగాణ ప్రభుత్వం అప్పటికే పాక్షిక కట్టడి ప్రకటించింది. ఆ తర్వాత రెండు రోజులకే ప్రధాని మన చుట్టూ లక్ష్మణరేఖ గీసేదాకా వ్యాధి తీవ్రతను, తీసుకోబోయే నిర్ణయాలను కేంద్రం గోప్యంగా ఉంచింది. నిజానికి ఈ విషయంలో డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిన వెంటనే సరైన నిర్ణయం తీసుకొని, దేశంలో వివిధ ప్రాంతా ల్లో చిక్కుబడిపోయినవాళ్లు, వేరేచోట పని చేస్తున్నవాళ్లు, పని మనుషులు, దినసరి కూలీ లు, వలస కార్మికులు వారివారి సొంత స్థలాలకు వెళ్లేందుకు వీలుగా కట్టడి నిర్ణయాన్ని ప్రకటించి వారం రోజులు వెసులుబాటు కల్పి స్తే ఇంత గందరగోళం ఉండేది కాదు.

నిజానికి లాక్‌డౌన్‌ మంచి నిర్ణయం. కానీ తాళం వేసే ముందు ఎవరు లోపల ఉన్నారు, ఎవరెవరు బయట ఉన్నారనేది చూడాల్సింది. దాదాపు ఆరు లక్షల మంది విదేశాల్లో ఉన్నవారిని దేశంలోకి విమానాల్లో తెచ్చినప్పుడు, స్వదేశంలో రోడ్ల మీద ఉన్నవారిని స్వగ్రామాలకు అనుమతించకపోవడం ఏమిటనే ప్రశ్నలు వచ్చా యి. మార్గమధ్యంలో నిలిపివేసిన వారంతా శిబిరాల్లో శరణార్థులుగా మిగిలిపోయారు. కొందరు ప్రాణాలకు తెగించి ‘బస్సులొద్దు, బండ్లు వద్దు ఇడిసిపెడితే నడిసిపోతాం’ అని ఇంటిబాట పట్టా రు. వందలు, వేల కిలోమీటర్లు కాలిబాటన నడిచిన కొందరు గూటికి చేరితే, మరికొందరు మార్గమధ్యలోనే కాటికి చేరారు. మన దేశానికి సంబంధించినం త వరకు కరోనా కట్టడి కాలం లో విషాదం ఏదైనా ఉందంటే అది వలస కార్మికుల కష్టమే. 

ఇంతకాలం ఈ విషాద వలయంలో ఉన్నవాళ్లను ఇప్పుడు హఠాత్తుగా వదిలేయాలని, ఇళ్లకు చేర్చాలని, చేర్చేముందు వైద్య పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పు డు ఇది మరికొన్ని కొత్త చిక్కులు తెచ్చేదిగా ఉన్నది. ఇప్పుడు లక్షలాది మంది రాష్ర్టాలు దాటి, స్వగ్రామాలకు తరలితే వారికి పరీక్షలు చేయడం, వసతులు కల్పించడం, వైద్యం అం దించడం రాష్ర్టాలకు సాధ్యపడుతుందా? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, ఒడిశా లాంటి వలస కార్మికులు ఎక్కువగా ఉన్న రాష్ర్టాల పరిస్థితి ఏమిటి? కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ర్టాలు ఆమోదిస్తాయా? ఆమోదించాలని ఎక్కడైనా ఉందా? ఇవన్నీ కీలకమైన ప్రశ్నలు.

లాక్‌డౌన్‌ మంచి ఫలితాన్నిచ్చిందని, ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటున్నదని పత్రికల్లో వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, కేరళ, ఒడిశా రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు చేప ట్టి కరోనాను కట్టడి చేశాయి. ఒక దశలో కరీంనగర్‌ పట్టణంలో వేలాదిమందిని కబళిస్తుందే మో అనుకున్న మహమ్మారిని అక్కడ కనుమరుగు చేసి ఒక కొత్త నమూనాగా చర్యలు చేపట్టారు. రేపో మాపో కంటైన్మెంట్లు, రెడ్‌జోన్లు  వదిలేసి మిగతా జిల్లాలను లాక్‌డౌన్‌ నుంచి మినహాయించాలని కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. తెలంగాణలో ఇప్పటికిప్పుడు 22 జిల్లాలు కరోనా రహితంగా ఉన్నాయి. మరోవారం పోతే మొత్తానికి మొత్తం మారిపోవచ్చు. సరిగ్గా ఆ సమయానికి వలస కార్మికు లు జిల్లాలకు చేరుకుంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల నుంచి వలస కూలీలు తెలంగాణకు వస్తారు. ఈ రెండు రాష్ర్టాలు దేశంలోని కరోనా కేసుల్లో మొదటి రెండుస్థానాల్లో ఉన్నాయి. అలాగే దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న అందరూ తిరిగివచ్చే అవకాశం ఉన్నది. అది పరవాలేదా? వాళ్లం తా సొంత ఇండ్లల్లో క్వారంటైన్‌లో కనీసం మూడు, నాలుగు వారాలుండాలి. వారికి అలాంటి ‘నియమాల’ ప్రకారం ఉండే ఇండ్లు ఉన్నాయా. అవే ఉంటే వాళ్లు వలస ఎందుకు వెళ్తారు? ఇప్పటిదాకా కాపలా కాసో, కంచెలు వేసో కాపాడుకున్న గ్రామాల్లోకి కరోనా వైరస్‌ తో ఒక్కరు వచ్చినా తట్టుకోగలుగుతామా అనేది కూడా ఆలోచించాలి.

నలభై రోజులు ఒకరకమైన నిర్బంధంలో ఉంచిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవ డం సముచితం కాదు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వలసకూలీల కోసం ఒక తక్షణ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించి ఉండాల్సింది. వారు కూడా ఈ దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కారకులని, అభివృద్ధి భాగస్వాములని గుర్తించి ఉండాల్సింది. వారి నివాస స్థలాల్లోనే అన్ని వసతులు కల్పించేవిధంగా, వారిని మానసికంగా సిద్ధం చేసే దిశగా కార్యాచరణ ప్రకటిం చి ఉండాల్సింది. అలా చేయకపోగా ఒంటరి వారిని చేసి, ఒక భయోత్పాత వాతావరణంలోకి నెట్టివేసి, సొంత ఊళ్లకు వాళ్ల ఆలోచనలు మళ్లేలా చేశారు. కరోనా ప్రభావం నుంచి కోలుకున్నా మళ్లీ ఊరు విడిచి వెళ్లాలంటేనే భయపడే మానసికస్థితిలో వాళ్లుంటారు. ఈ కట్టడి సమయంలో చవిచూసిన అనుభవాలు అలాంటివి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థికవ్యవస్థ ను చక్కదిద్దాలనుకున్న ఆశలు ఏమవుతాయి? ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయబోతున్నదనే విషయాలను కూడా ఆలోచించాలి. కేంద్రం ఎలాగూ ఇప్పు డు ఆలోచించే పరిస్థితుల్లో లేదు కాబట్టి, రాష్ర్టాలే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే మొదటికే మోసం రావొచ్చు.

(వ్యాసకర్త:  సామాజిక, రాజకీయ పరిశోధకులు)

తెలంగాణ, కేరళ, ఒడిశా రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు చేపట్టి కరోనాను కట్టడి చేశాయి. ఒక దశలో కరీంనగర్‌ పట్టణంలో వేలాదిమందిని కబళిస్తుందేమో అనుకున్న మహమ్మారిని అక్కడ కనుమరు గు చేసి ఒక కొత్త నమూనాగా చర్యలు చేపట్టారు. 

-డాక్టర్‌ రాహుల్‌ రాజారామ్‌


logo