ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Editorial - May 02, 2020 , 00:05:15

గెలుపు ఖాయం

గెలుపు ఖాయం

ఇది ఇప్పుడే పోదు

కలిసుంటూనే దాని

చేతికి చిక్కని చేపలమవ్వాలి!

కనపడని రాక్షసితో

ఇకమీదట వేయి కళ్ళ స్పృహతో

నిత్యం మసలాలి!

బతుకుపోరు ఓ వైపు

దాని అంతిమయాత్ర మరో వైపు

చకచకా ఏర్పాట్లను చేపట్టాలి!

యుద్ధం చేయని రోజే లేదు

మన జ్ఞానం మన చేతన

చరిత్రలో నిలిచిపోవాల్సిందే!

ఎవరికివారే ఇప్పుడు

యుద్ధవీరులు

సుబ్బునీళ్ళతో దాన్ని కడిగేయాల్సిందే!

స్తంభించిన భూ భ్రమణానికి

మన భుజమే ఊతమవ్వాలి

ఇకపై మనచుట్టే పరిభ్రమించాలి!

ప్రమాదాలు పొంచి ఉన్నాయని

ప్రయాణాలు ఆపలేం

పోరాడే క్రమంలో తెల్ల జెండాలెత్తలేం!

ఇన్నాళ్ళు దాగున్నది తమాషాకు కాదు

కురుక్షేత్ర యుద్ధానికి

ఆయుధ సామగ్రి సిద్ధం!

రానున్నది నిశ్శబ్ద యుద్ధం

సామాజిక దూరంతో

మనిషి గెలుపు ఖాయం!!

-కోట్ల వెంకటేశ్వర రెడ్డి, 94402 33261


logo