శనివారం 26 సెప్టెంబర్ 2020
Editorial - May 01, 2020 , 00:33:24

వలస జనం వాపస్‌

వలస జనం వాపస్‌

నగరాల్లోని వలస ప్రజలు, ఇతర రాష్ర్టాల్లో చిక్కిపోయిన విద్యార్థులు, పర్యాటకులు తమ సొంత ఊర్లకు పోవడానికి కేంద్ర హోంశాఖ అనుమతించడంతో లక్షలాది మందికి ఊరట లభించనుంది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ దాదాపు నాలుగు కోట్ల మంది వలస కార్మికులపై ప్రభావం చూపిందని ప్రపంచ బ్యాంక్‌ వెల్లడించింది. లాక్‌డౌన్‌ ప్రకటించిన మొదటి కొద్ది రోజుల్లోనే వేలాది జనం పల్లెబాట పట్టారు. ఢిల్లీలో రైల్వే స్టేషన్‌ ప్రాంతమంతా కిక్కిరిసి పోయి, పరస్పర దూరం పాటించాలనే నియమం నీరుకారిపోయింది. ముంబయి తదితర నగరాల్లో కూడా వలస ప్రజలను కట్టడి చేయడం కష్టమైపోయింది. తమ రాష్ర్టానికి వచ్చేవారి కోసం ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం బస్సులు ఏర్పాటు చేసింది. కేంద్ర ఆదేశాలతో నిమిత్తం లేకుండానే, కొన్ని రాష్ర్టాలు సమన్వయంతో వలస ప్రజలను సొంతూర్లకు చేర్చాయి. దీంతో రాష్ర్టాల పొలిమేరల్లో నిలిచి పోయిన వారికి అక్కడే సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ వలసలను అనుమతించకూడదని కేంద్రం స్పష్టం చేయవలసి వచ్చింది.కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అనుసరించిన వైఖరి అది. 

కేంద్రంపై రాష్ర్టాల ఒత్తిడి ఎక్కువ కావడం కూడా వలసలపై ఆంక్షలను సడలించడానికి కారణం. ఢిల్లీ, ముంబయి తదితర నగరాలలో వలస ప్రజలకు భోజనాది సదుపాయాలు తగిన మేర కల్పించలేదనే ఆరోపణ ఉన్నది. తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లెల నుంచి వచ్చిన వారికే కాకుండా, ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి కూడా బతకడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. అయినా సొంతూరికి పోవాలనే  పల్లె జనం ఆరాటాన్ని సామాజిక కోణంలో అర్థం చేసుకోవాలి. ‘పల్లె తల్లి వంటిది, పట్నం ప్రియురాలి వంటిది/ పల్లె రమ్మంటుంది, పట్నం తెమ్మంటుంది ’ అన్నాడొక కవి. ఎక్కడా ఉపాధి లేనప్పుడు సొంతూరికి  పోయి కలోగంజో తాగి బతకవచ్చునని అనుకుంటారు. సొంతూరికి పోతే చేప నీళ్లలో పడ్డట్టు ఉంటుంది. కష్టమో సుఖమో తమ సమాజంలో భాగంగా బతుకుతారు.

వలస కార్మికులు ఎక్కువగా తాము పనిచేసే చోటనే గుడారాల్లో, చిన్న గదుల్లో ఉంటారు. ఎక్కువ కాలం కట్టడి చేస్తే ప్రజల్లో నైరాశ్యం పేరుకుపోయి సామాజిక అనిశ్చితికి దారితీయవచ్చు. ఇటువంటి కొన్ని చిన్న చిన్న ఘటనలు మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లోనూ చోటు చేసుకున్నాయి. లాక్‌డౌన్‌ను దశలవారీగా సడలించాలని యోచిస్తున్న తరుణమిది. అందువల్ల వలస కార్మికులను కూడా స్వేచ్ఛగా వెళ్ళనివ్వాలని కేంద్రం భావించి ఉంటుంది. అయితే ఈ చేదు జ్ఞాపకాల నేపథ్యంలో వలస జనం లాక్‌డౌన్‌ సడలించిన వెంటనే మళ్ళా నగరాలకు రావడం అంత సులభం కాదు. వివిధ వ్యాపార రంగాలకు కార్మికుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటి వరకు విదేశాల నుంచి, మత సమావేశాల నుంచి వచ్చిన వారిని వెతికిపట్టుకొని పరీక్షలు జరిపించింది. ఇప్పుడు పల్లెలకు వెళ్ళేవారి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం మార్గదర్శకాలను జారీ చేసింది. వీటిని అనుసరిస్తూనే రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరించవలసిన తరుణమిది.


logo