మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Apr 28, 2020 , 23:28:50

జలనివాళి

జలనివాళి

పేరులోనే సాగరాన్ని నింపుకొని

జీవితం జలసాధనకేనన్నావు...

పసిడిసిరులు పండించిన రైతుల

కడగండ్లను చూసి కన్నీరు పెట్టావు..

దేశముఖుల భూస్వాములనెదిరించి

దుక్కిదున్నే చేతులే సాయుధమైనా

నీళ్ళుపారాల్సిన నేలపై నెత్తురు పారింది కానీ,

తిండిగింజలకు నోచుకోలేదు నల్లగొండ!

చండూరు, శివన్నగూడెం అంశులస్వామి, తిరుపతమ్మ

యవ్వనాన్ని చూడకుండానే కాటికి సిద్ధమైన బాల్యం

ఏ ఫ్లోరైడ్‌ బాధితుల కష్టాలు కదిలించాయో..

కలం పట్టినావు.. జల విజ్ఞానాన్నందించావు. 

మేడిగడ్డ నుంచి నడిగడ్డ దాకా..

ప్రవాహాలకు దారులు పరిచావు

సాధకునికి సలహాదారువై చరితార్థునివైనావు.

జీవితమంతా తపించిన జయశంకరుడు

తెలంగాణను చూడనట్లే..

కాళేశ్వర సవ్వడి వినకుండానే

అర్ధాంతరంగా కన్నుమూసావు.

సిద్ధిపేటను ముద్దాడిన గోదావరి జలధారలు

మా అందరి కళ్ళలో ఆనంద అశ్రుధారలు కాగా

ప్రతి నీటి బొట్టులో కన్పిస్తున్నది నీ రూపమే..

అందుకో.. ఇవే తెలంగాణ జలనివాళులు!

- సుజల (నేడు ఆర్‌.విద్యాసాగర్‌రావు 3వ వర్ధంతి) 


logo