మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Apr 27, 2020 , 23:23:08

మనం మారడమే మార్గం

మనం మారడమే మార్గం

కాలచక్రం వందేళ్ల తర్వాత తిరిగొచ్చింది. స్పానిష్‌ ప్లూ తిరిగి కోవిడ్‌ 19 రూపంలో ముందుకు వచ్చింది. ఇది మానవాళికి మోగించిన మృత్యు ఘంటిక. ఈ కరోనా వైరస్‌ను జయించలేకపోతే మానవాళికి ముప్పు తప్పదు. ఇప్పటిదాకా నిర్మించుకుంటూవచ్చిన వ్యవస్థలన్నింటిని కాపాడుకోవటానికి మనిషే ఈ కఠోర సమయాన్ని ఎదుర్కోవాల్సి ఉంది. మనిషి, వైరస్‌ రెండూ కలిసిమెలిసే ఉంటాయని కొంతకాలం వైరస్‌ నిశ్శబ్దగా దాక్కొన్నప్పటికీ మళ్లీ అవకాశం చూసుకొని తిరగబడుతుందనటానికి వందేళ్ల తర్వాత వచ్చిన కర్కశ కరోనా సాక్షీభూతంగా నిలుస్తుంది.

మనం యుద్ధాలను తట్టుకోవడానికి కావలసిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడానికి ఎంతో పెట్టుబడి పెడుతున్నాం. కానీ, రాబోయే మహమ్మారులను ఎదుర్కోవడానికి కావాల్సినంత పెట్టుబడి పెడుతున్నామా? అని బిల్‌గేట్స్‌ సూటిగా ఐదేండ్ల కిందటే ప్రశ్నించారు. ఈ ప్రశ్నను ఆయన ఎబోలా వైరస్‌ నేపథ్యంలో ప్రపంచ నాయకులకు సం ధించారు. ఐదేండ్ల క్రితం ఒక కాలజ్ఞానిలా ఆయన  చెప్పిన మాట ఇవాళ నిజమైంది. 1918-2020 మధ్య గడిచిపోయిన ఈ 102 ఏండ్లలో ప్రపంచం ఎంతో  మారింది. చివరి రెండు దశాబ్దాలలో ప్రపంచం అరచేతిలోకి వచ్చింది.

ఈ వ్యాసం రాసే సమయానికి ప్రపంచ దేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కి విలవిల్లాడు తున్నయి.  కోట్లాది మంది వైరస్‌ బారిన పడగా రెండు లక్షల మందికి పైగా వివిధ దేశాల్లో చనిపోయారు. సరిగా ఇట్లాగే చరిత్రలో గ్రేట్‌ ఇన్‌ఫ్లుయెం జా (విష పడిశెము)కూడా మనుషులను బలితీసుకున్నది. స్పానిష్‌ ఫ్లూగా పేరు పొందిన ఈ మహమ్మారి కాన్సాస్‌లోని హస్కెల్‌ కౌంటీలో మొదలై సైనికుల ద్వారా  యూరప్‌ను దాటి ప్రపంచ మంతా వ్యాపించింది. ఈ మహమ్మారి మీద చాలా పుస్తకాలు, రిపోర్టులు వచ్చాయి. ఆల్బర్ట్‌ మారిన్‌  రాసిన ‘VERY VERY VERY  DREADFUL’ అన్న పుస్తకంలో వివరించిన ప్రకారం-  ‘ఈ మహమ్మారి వలన భారతదేశం బాధపడినంతగా మరేదేశం బాధపడలేదు. మొత్తం జనాభాలో 6.1శాతం జనాభా వ్యాధికి గురైంది. అప్పు డు భారత జనాభా 30.06కోట్లు కాగా  కోటి 86 లక్షలమంది వైరస్‌ బారిన పడ్డారు. చైనా అప్పుడు 9.5 మిలియన్ల  ప్రజలను మృత్యువు నుంచి కాపాడుకోలేకపోగా, అమెరికా దాదాపు లక్ష మందిని కోల్పోయింది. 

ఇప్పటి కరోనా ఉత్పాతానికి, అప్పటి స్పానిష్‌ ఫ్లూకి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఉదాహరణకు..1) స్పానిష్‌ ఫ్లూకి లాగే కరోనా కు కూడా వాక్సిన్‌ లేదు. 2) అప్పటి లాగే ఇప్పు డు కూడా దేశాల మధ్య సమన్వయం లేదు 3) అప్పటిలాగే  ఏవో అరకొర చర్యలు తీసుకుని  మళ్ళీ సహజ స్థితికి రావడానికి ఆరాటపడటం అన్నీ ఒక  లాగే వున్నాయి.  ముఖ్యం  గా.. అప్పుడు కూడా లాక్‌ డౌన్‌ చేసిన ఆర్థిక వ్యవస్థను తిరిగి ఓపెన్‌ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆ తర్వాత పెద్ద విధ్వంసాన్ని  సృష్టించాయి. 

భారత్‌లో బాంబేలో స్పానిష్‌ ఫ్లూ విస్తరిం చింది.  ఈ సారి దాని ప్రభావం దారుణంగా వున్నది. ఎంత దారుణంగా వున్నది అంటే జాన్‌ బారీ  తన ‘ది గ్రేట్‌ ఇన్‌ఫ్లుయెంజా’లో ఇలా రాశాడు ‘ఒక స్టేషన్‌ లో ఎక్కిన ప్రయాణికులు తమ స్టేషన్‌ వచ్చేవరకు బ్రతికి వుంటారనే గ్యారంటీ లేదు. స్టేషన్‌లో ఎక్కిన ఒక మనిషిని మరొక స్టేషన్‌లో శవంలా బయటకు లాగేశారు. ఢిల్లీలోని ఒక హాస్పిటల్‌లో 13,190 కేసులను చేర్చుకుంటే అందులో 7,044  మంది చనిపోయారు. 

ఇప్పుడు కరోనా విలయం కూడా అలాగే ఉన్నది. స్పెయిన్‌, ఇటలీలలో పెద్ద సంఖ్యలో చని పోతే, చైనా ‘నో  డెత్‌ డే’ లు పాటిస్తు న్నది. అమెరికాలో కరోనా విధ్వంసంతో పోలి స్తే చైనా నష్టం తక్కువ.  చైనాతో సరిహద్దు కలిగిన రష్యాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నది. అలాగే దక్షిణ కొరియా కూడా ప్రమాదం అంచునే వున్నది. 

ఇప్పుడు భారత్‌లో పరిస్థితి విచిత్రంగా ఉన్నది.కరోనా వ్యాప్తి దశలో ఉన్నదా, లేక రెండో, మూడో దశ చేరుకున్నదా అన్న దానిపై స్పష్టత లేదు. భారత్‌కు కానీ, ప్రపంచానికి కానీ ఈ దశ ఎండ్‌ పాయింటా లేక ప్రారంభమేనా? కరోనా మళ్ళా తిరగబడుతుందా? 1918 స్పానిష్‌ ఫ్లూ లాగా తిరగబెడితే ప్రపంచ దేశాలు తట్టుకోగలవా?

ఈ కరోనా చాలా మార్పు తెస్తుందని ఆశిద్దాం.  ఈ మార్పు రావాలి అంటే మనం చేయవలసిన పనులు కూడా కొన్ని వున్నాయి. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలతో ప్రపంచం ఒక విశ్వ గ్రామమైంది.కాబట్టి కలిసి కట్టుగా కరోనాను కట్టడి చేయాలి. 

రానున్న 15 -20 రోజులు కీలకమైనవి. భారత్‌ లాక్‌డౌన్‌ మరింత పొడిగించాలా? అదే సరిఅయిన నిర్ణయమా? మార్కెట్‌ ఎకానమీ దెబ్బతింటుంది, కానీ తప్పదు. విస్తరణ ను అడ్డుకోవటానికి మరో దారి లేదు. 

గతంతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ వుం ది. శాస్త్రీయ విజ్ఞానం వుంది. బలమైన ఆర్థికవ్యవస్థలున్నాయి. కానీ మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో మనం 1918 కంటే భిన్నంగా లేం. అదే విషాదం. ఇది అభివృద్ధి చెందిన  దేశాల్లో కూడా అలాగే ఉంది. దేశాల దృష్టి అంతా.. ఆర్థిక వ్యవస్థలు,రక్షణ వ్యవస్థల మీద ఉన్నంతగా శాస్త్ర సాంకేతిక రంగా ల మీద లేదు. కరోనా వైరస్‌ మనుషుల మీదే కాదు ఆర్థికవ్యవస్థలను కూడా కుదేలు చేస్తుం ది. రక్షిస్తాయి అనుకునే వ్యవస్థలు ఎందు  కూ పనికి రానివి అవుతాయి.

మన చిన్నప్పుడు అమ్మలు, నాయనమ్మ లు ఒక మాట చెప్పేవారు. పథ్యం సరిగ్గా చేయక పోతే జ్వరం తిరగబెడుతుందని. ఇప్పుడు కూడా ఈ ‘లాక్‌డౌన్‌' మనం చేసే పథ్యం లాంటిది. సరిగ్గా చేయండి. లేకపోతే కరోనా తిరగబడితే తట్టుకునే శక్తి వ్యక్తులుగా మనకు, దేశానికి లేదు.

మనం ఇప్పటికైనా మారకపోతే మనలను ముందు తరాలు క్షమించవు. దానికి ‘డి -గ్లోబలైజేషన్‌' ఒక్కటే మార్గమని ఇప్పటికే ప్రపం చం నలుమూలల నుంచి సన్నగా ఏవో ధ్వను లు వినిపిస్తున్నాయి. మనం రెండు ఎక్స్‌ట్రీమ్‌ ఎండ్స్‌ మధ్య కొట్టు మిట్టాడుతున్నాము.  గ్లోబలైజేషన్‌  ఒక పక్క. డి -గ్లోబలైజేషన్‌ మరొక పక్క. ఒక ఎక్స్‌ట్రీమ్‌ ఎండ్‌ తీసుకున్నప్పుడు ఎప్పుడూ మంచి ఫలితాలు రాలేదు. ఇది చరిత్ర చెపుతున్న సత్యం. ఇప్పుడొక మధ్యే మార్గం కావాలి. హృదయాలు ముడి వేయాలి. కెన్యాలో పాప జారిపడిన చప్పుడుకు ఇండియాలో హృదయం కలుక్కుమనాలి. ఇండియాలో అన్నార్తుడి ఆకలి కేకకు ఆస్ట్రేలియాలో అన్నం ముద్ద  నోటి దగ్గరకు రావడానికి తహతహలాడాలి.

ఈ కరోనా చాలా మార్పు తెస్తుందని ఆశిద్దాం.  ఈ మార్పు రావాలి అంటే మనం చేయవలసిన పనులు కూడా కొన్ని వున్నాయి. ఇవాళ శాస్త్ర సాంకేతిక రంగాలతో ప్రపంచం ఒక విశ్వ గ్రామమైంది.కాబట్టి కలిసి కట్టుగా కరోనాను కట్టడి చేయాలి. మళ్ళీ మనం మనంగా నిలబడాలి అంటే భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. శుచి, శుభ్రత తప్పని సరి. సామూహిక రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అది అభివృద్ధి చెందాలంటే మన ఆహార అలవాట్లతో సహా మనం మళ్ళీ వెనక్కు వెళ్ళాలి. బ్యాక్‌ టు విలేజెస్‌ వెళ్లాలి. మహాత్మా గాంధీ అన్నట్టు గానే మళ్ళీ మనం బ్యాక్‌ టు  అవర్‌  ఓల్డ్‌ ట్రెడిషన్స్‌ అండ్‌ కస్ట మ్స్‌. మనిషి కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతితో సహా జీవనం చేయడం తప్ప మరొక మార్గం లేదు. మనిషి ఈ చీకటిని తప్పక జయిస్తాడు.

 (రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు)


logo