మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Apr 27, 2020 , 23:20:59

ఈ చీకటి.. వెలుగునిచ్చేనా!

ఈ చీకటి.. వెలుగునిచ్చేనా!

‘నిజంగానే నిఖిల లోకం నిండుహర్షం వహిస్తుందా మానవాళికి నిజంగానే మంచి కాలం రహిస్తుందా..’ అనుమానంతో కూడిన ఆశను వ్యక్తం చేసిన ఓ మహాకవి ఏనాడో అన్నమాట సమకాలీన పరిస్థితులకు తగినట్టుగా ఉన్నది. అందుకే గత రెండు నెలలుగా సమాధానం కోసం పదే పదే నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను.

అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో రోజంతా ఇం ట్లోనే గడిపిన నేను, చిన్న పని మీద కారు తీసుకొని రోడ్డెక్కాను. అది రోజూ నేను వెళ్లేదారే. అవే మలుపులు, హద్దులు. కొత్తదనం లేని పాత తనం. ఆరోజు శనివారం. సాధారణంగా వారంరోజుల అలసటను తీర్చుకొని ఆనం దం గా,ఆహ్లాదంగా సైనికుడు యుద్ధానికి  వెళ్లినట్టు పరీక్షకు లేటైన విద్యార్థి పరుగుతీసినట్టు ఇండ్లుఖాళీచేసి  రోడ్లపై హడావిడిగా జనం రిలాక్స్‌ కోసం పరుగులు పెట్టేరోజు. కానీ..  అలాంటి శనివారం అంతా నిర్మానుష్యం!

భయంగొలిపే నిశ్శబ్దం. ఏదో కొత్తదనపు ఆహ్లాదాన్ని ఇస్తూనే  మరుక్షణమే ఏదో తెలియని భయాన్ని, ముంచుకొస్తున్న ఉపద్రవాన్ని సూచిస్తున్నది.ఈ కొత్తదనం నన్ను తిరిగి ఇంటికి పోయేలా చేసిం ది.   టీవీ లో మొదటి నుంచి చివరి వరకు కొవిడ్‌-19 మహమ్మారి గురించిన వార్తలే. ఏ ఆన్‌లైన్‌ పేపర్‌ చూసినా వైరస్‌ చేత చిక్కి చిత్తవుతున్న సమాజపు వికారాలే. 

నేనుండే న్యూయార్క్‌ ప్రపంచంలోనే  అత్యధిక ధనిక నగరమేగాక సాంస్కృతిక, ఆర్థిక రాజధానిగా పేరున్నది. దాదాపు అన్ని దేశాల ప్రజలు ఇక్కడ జీవిస్తారు. ఈ నగరంలో  800 భాషలు వాడుకలో వుంటాయి. ఈ నగరం జీడీపీ  180దేశాల కంటే పెద్దది. విశ్వవిద్యాలయాలు,ఐక్య రాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ కొలువైన ఈ మహా నగరం ఆధునిక నాగరికతకు కలికి తురాయి.

అటువంటిది ఇప్పుడు ఒక వైరస్‌తో అతలాకుతలం అవుతున్నది. ఆ మహమ్మారిని అరికట్టడానికి వాక్సిన్‌  తయారుచేయాలని ప్రయోగశాలలు ఏర్పాటు చేసి  నిష్ణా తులైన  శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.  వైద్యులు , శాస్త్రవేత్తలు ఇప్పటికిప్పుడు  వాక్సిన్‌ను కనిపెట్టలేమని చెప్పేయటంతో ఒక సూక్ష్మ జీవి ముందు  మానవ మేధ స్సు  ఓటమి పాలైయిందని తేలిపోయింది. ఏ దేశం వద్ద లేని అణు సాంకేతిక పరిజ్ఞానం, అత్యంత శక్తివంతమైన సైన్యం, అధిక సంపత్తి కలిగిన అమెరికా సైతం ఒకసూక్ష్మ జీవితో యుద్ధం చేయలేకపోయిందని అర్థమవుతున్నది.

ఇప్పటిదాకా వాణిజ్య యుద్ధంలో నువ్వా నేనా అన్న ట్లు  ఉన్న అమెరికా, చైనా ఇప్పుడు ఏకమై, కరోనా వైరస్‌పై యుద్ధం ఎలాచేయాలనే ఆలోచనలో పడ్డాయి.

వైద్యులు నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయనిదే ఆ వృత్తికి న్యాయం జరగదని భావించవచ్చు. ఒక మేధావి తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచనిదే ఆజ్ఞానం నిరర్దమనుకుంటాడేమో. ఎంతగొప్ప ధనవంతుడైనా ఎప్పుడో ఒకసారి పరోపకారం చేయనిదే ఆ డబ్బుకు విలువ లేదనే సత్యాన్ని గుర్తించగలరేమో. మంచి రోజులు రావడానికే ఈ చీకటి ఆవహించిందేమో. 

పబ్లిక్‌ పార్కులను సామూహిక ఖననాలకు  వినియోగిస్తున్నారంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. అన్నింటికంటే విచార కరమైనదేమంటే.., ఇంటి నుంచి బయట పడే స్వేచ్ఛ  ఇవ్వాలని అధ్యక్షుడు ,  జబ్బు నుంచి విముక్తి పొందడానికి ఇంకొన్ని రోజులు ఇళ్ళలోనే వుండాలని గవర్నర్ల అభిప్రాయభేదాలు.

భారత ప్రధాని మోదీ అన్నట్టు ఇది ఒక అప్రకటిత ఎమర్జెన్సీ. అంతేకాదు 9/11లో జరిగిన ఉగ్రవాద దాడి కన్నా ప్రమాదకరమైనది అనడం నిజం. ఇప్పుడు అన్నీ మూతబడిపోయి ఆధునిక జీవితాల్లో భాగమైపోయిన టీవీ,సెలిఫోన్లు ఇప్పుడు మనిషి జీవితాలయ్యాయి.

ప్రపంచ చరిత్రలో  ఎన్నో యుద్ధాల గురించి విన్నాం, కాని మానవ జాతికి ఒక సూక్ష్మజీవికి మధ్య   పరోక్ష యుద్ధం ఇది. వైద్యులు, నర్సులు పోలీసులు రోగులకు తోటిమానవులుగా ధైర్యాన్ని సహ కారాన్ని అందిస్తున్నందుకు, వారికి లోకమంతా  తలవంచి నమస్కరిస్తున్నది.

ఒక ఆస్పత్రి దగ్గర ‘ఇక దేవుడే కాపాడాలి’ అని అక్కడున్న వారు అనుకుంటున్నారు. ఒక డాక్టర్‌ సైతం‘God only knows when this tragedy ends’ అంటున్నాడు! ఒక కొడుకు  తనచుట్టూ ఉన్నవారితో  తండ్రి కోసంప్రార్థన చేయమంటున్నాడు. ఇది చూసిన తర్వాత  ఒక్కసారిగా నా ఆలోచన మారిపోయింది. ఏ దిక్కు లేనప్పుడు  మని షి భగవంతుని ఎందుకు ఆశ్రయిస్తాడు? ఎవరికీ సాధ్యం కాని పని, కనబడని దేవునికి ఎలా సాధ్యం!  ఆలోచిస్తే ప్రకృతి మాత, పంచభూతాలు అని మనసులో ఏమూ లో సమాధానం దొరికింది. అవి ఎట్లా ఏర్పడ్డాయనే  ప్రశ్నకు  సైన్స్‌ సమాధానం చెబుతుంది.  ఇంకా వెనుకకు వెళితే పరమాణువు దాకా వెళ్లి ఆగాల్సిందే. అంతేకాక బిగ్‌ బాంగ్‌ థియరీకూడా మనిషి శాస్త్రీయ ఉత్సుకతను ఆదిమ అణువు దగ్గర ఆపేసింది. ఇంకా వెనుకకు పోలేనప్పు డు ఏదో అదృశ్య శక్తి ఆ పరమాణువుల వెనక ఉంది. ఆ శక్తి చేతనే  అన్ని జీవులు బతక కలుగుతున్నాయి. ఆ శక్తే భగవంతుడు. ఆ భగవంతుడే కనిపించే ప్రకృతి.

ఈ వైరస్‌ కారణంగా నైనా ప్రతి ఇంట్లో కుటుంబీ కులంతా కలసి మెలసి ఉంటూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వుండడం చూస్తుంటే సంతోషంగా ఉన్న ది. మనిషి స్వతహాగా పరోపకారి. ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండటం మనిషి సహజగుణం. మనిషి స్వార్థపుఆలోచనలు మారిపోయి మనిషి సహజ లక్షణమైన మానవత్వం వ్యక్తమవుతుందేమోనని ఒక చిన్న ఆశ. ఈ విపత్తువల్ల మానవుడు భవిష్యత్తులో ఎన్నో పాఠాలు నేర్చుకుంటాడేమోనని అనిపిస్తున్నది. ప్రకృతి ముందు సమానులే. ఆ తల్లి ఆగ్రహిస్తే అందరూ శిక్షార్హులేనని గ్రహించి మన నడవడి మారుతుందేమో! వైద్యులు నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేయనిదే ఆ వృత్తికి న్యాయం జరగదని భావించవచ్చు. ఒక మేధావి తనకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచనిదే ఆజ్ఞానం నిరర్దమనుకుంటాడేమో. ఎంతగొప్ప ధనవంతుడైనా ఎప్పుడో ఒకసారి పరోపకారం చేయనిదే ఆ డబ్బుకు విలువ లేదనే సత్యాన్ని గుర్తించగలరేమో. మంచి రోజులు రావడానికే ఈ చీకటి ఆవహించిందేమో. ఇన్నిరోజులు ఎవరి కంటా కనపడ కుండా దాగున్న మనం ప్రకృతి మాతను ప్రార్థిస్తూ బయటికి రావాలి. ఆ తల్లి ఆగ్రహం చల్లారి పోవాలి.

‘ఈ అగ్ని వర్షాలు ఈ రక్తపాతాలు ఎలాగూవచ్చాయి.

ఈసమరం తుది చూడక

ఇక నిలిచిపోరాద’న్న మహాకవి మాటలను  మననం చేసుకుంటూ మానవాళి అం తా  ఐకమత్యంతో విశ్రమించకుండా ముందుకు సాగాలి.

(న్యూయార్క్‌ నుంచి..)


logo