సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 27, 2020 , 23:19:02

వ్యవసాయ వెన్నెముక కేసీఆర్‌

వ్యవసాయ వెన్నెముక కేసీఆర్‌

రైతే రాజు. రైతుకూలీల చెమటచేతులే లోకం ఆకలి తీరుస్తాయి. అవిలేకపోతే దేశం ఆకలితో అలమటించిపోతుం ది. పంటలు పండని నేలలున్న ప్రాంతాల్లో జీవనం వట్టిపోతుంది. మనది వ్యవ సాయ సంస్కృతి. 

ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ 2020 ఏప్రిల్‌ 19న కరోనా విపత్తు, దాని నియంత్రణాచర్యల గురించి వివరిస్తూ నే, వానకాలపు పంటకు సంబంధించిన సన్నద్ధాలను, ప్రభుత్వ ఏర్పాట్లను వివరిస్తూ దార్శినికునిగా మాట్లాడారు. ఏ ఒక్కరూ తెలంగాణలో ఆకలి తో ఉండకూడదని చెబుతూ ఆహార ఉత్పత్తుల విషయంపై దృష్టిపెట్టారు. 

కేసీఆర్‌ రైతుగా జీవించారు. వ్యవసాయరంగంలో రైతుకూలీలను ప్రాణంగా చూసుకోకపోతే నోట్లోకి ఐదువేళ్లు పోవ న్న విషయాన్ని విశ్లేషించారు. భూమికి కావాల్సిన నీళ్లను అందించే కాళేశ్వరం లాంటి అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించారు. ఈ కరోనా కష్టకాలంలో పండిన పంటలను కొనేవిషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  పండిన పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చూస్తున్నారు. 

వ్యవసాయం ఎంతగొప్పదంటే శ్రీనాథుడు లాంటి కవి కూడా చివరిదశలో కొంతపొలం కౌలుకు తీసుకుని కృష్ణాజిల్లా బొడ్డుపల్లి అనే గ్రామంలో పంట లు వేశాడు. కానీ పంటచేతికి రాక దెబ్బతిన్నాడు. అందుకు కారణాన్ని ఆయనే ఓ పద్యంగా రాసుకున్నారు. ‘కృష్ణవేణమ్మ గొనిపోయే నింతఫలము/ బిలబిలాక్షులు తినిపోయే తిలలు పెసలు/ బొడ్డుపల్లెను నమ్మి గొడ్డేరి మోసపోతి/ ఎట్లు చెల్లింతు టంకంబు ఏడునూర్లు’ అన్న పద్యం రాసుకున్నారు. 

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో వస్తున్న అనేక మార్పుల దృష్ట్యా వ్యవసాయరం గం కూడాఆధునీకరించబడాలని 1927 నాటికే గంగుల శాయిరెడ్డి తన పద్యాలలో చాటిచెప్పారు. ఆనాటి నిజాం రాష్ట్రంలో వ్యవసాయపంటల తీరుతెన్నులు జీవనవిధానంపై ఆయన ఒకరైతుగా సామాజిక కార్యకర్తగా కాపుబిడ్డను రాశారు. ‘వనములు బెంచిన వానలు కురియును, వానలు కురిసిన వాగులు బారును, వాగులు  బారిన కుంటలు నిండును, కుంటలు నిండిన పంటలు పండును, పంటలు పండిన పోవును కరువులు, కరువుల పోయిన కడుపులు నిండును” అని శాయిరెడ్డి రాసిన గేయంలాగే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత తొలిముఖ్యమంత్రిగా ఆయన బీడుభూముల్లోకి నీళ్లను తేవటమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారు. తెలంగాణ పంటలతో పచ్చటి రంగేసినట్లుండాలని తపించి వ్యవసాయరంగానికి వూపిరిపోశారు. 

ఒక పాలకునిగా కేసీఆర్‌ కష్టజీవుల బాధలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. ఇది దార్శనికుడైన పాలకుడు మాత్రమే చేయగలడు. పొలందున్నటం దగ్గర్నుంచి విత్తనాలువేసి, నార్లుపోసి నాట్లువేసి పంట చేతికొచ్చే దాకా కేసీఆర్‌ రైతుల పక్షాన ఆలోచిస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు.  

దేశానికి వెన్నెముక రైతు అని, రైతుకు సాయం చేసేందుకు ఎంత ఖర్చయినా భరించేందుకు సిద్ధమని కేసీఆర్‌ ముందుకొచ్చి వ్యవసాయరంగాన్ని తీర్చిదిద్దుతున్నారు.  ఈయన మది ఒక అక్షయ ధాన్యాగారం. గంగుల సాయిరెడ్డి కలలుగన్న కాపుబిడ్డే ఈ బిడ్డ. మొత్తం భారతావనికి అన్నం బెట్టే ధాన్యాగారంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నారు. రైతును కంటిపాపలా చూసుకుంటున్నారు. 


logo