సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 27, 2020 , 23:17:37

తల్లి గోదారమ్మ తరలి వచ్చిన వేళ

తల్లి గోదారమ్మ తరలి వచ్చిన వేళ

తల్లి గోదారమ్మ తరలి వచ్చిన వేళ

తనువంత తడిసెనని పరవశించెను నేల 

॥ తల్లిగోదారమ్మ॥ 

చితికిపోయిన బతుకు చింత తీరింది

మోడుబారిన ఆశ మొగ్గ తొడిగింది

డస్సిపోయిన ధరణి దప్పి తీరింది

వాడిపోయిన వనము మరల పూసింది

పూల తీగకు గాలి ముద్దుపెట్టింది 

॥ తల్లిగోదారమ్మ॥ 

అల్లనల్లన సాగె అలల అందెల మోత

జల్లు జల్లున సాగెజాలు జావళీ పాట

పచ్చపచ్చని సిరుల పైరు తలలూచ

పాలకంకుల కాంతి పసిడి వన్నెను మించ 

॥ తల్లిగోదారమ్మ॥ 

గుట్ట గుబురులలోన గువ్వ కూసింది

గుడిలోని స్వామి కడ దివ్వె వెలిగింది

రాశి మీద పాలపిట్ట వాలింది

చెరువులో చెంగలువ చెంగలించింది 

॥ తల్లిగోదారమ్మ॥ 

-కలువకుంట్ల రంగాచారి,

(రంగనాయ సాగర్‌లో నీటి వెల్లువ 

చూసిన సంతోషంతో..)


logo