సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 26, 2020 , 22:56:05

మన మాట నెగ్గింది

మన మాట నెగ్గింది

ప్రపంచ తెలుగు మహాసభలను అందరి మన్ననలు పొందేవిధంగా నిర్వహించారు. ప్రతి పాఠశాలలో క్రమానుగతంగా 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేశారు. రెవెన్యూ శాఖలోని ఇన్‌స్పెక్టర్‌ను ‘గిర్దావరు’గా, డిప్యూటీ తహసీల్దార్‌ను ‘నాయబ్‌ తహసీల్దారు’గా పేరు మార్పించడం ఆయన భాష స్పృహకు గుర్తు.

2001లో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధనకు ముందుకొచ్చారు. ఆయన రాజకీయోపన్యాసాలు ఎంత ఆలోచనకు పురిగొల్పాయో ఆయన ప్రయోగించిన భాష, నుడికారం ఆయనను ప్రజలకు అంత చేరువ చేశాయి. కేసీఆర్‌ ఉద్యమకారుడిగా తన స్వరం సవరించుకున్నాక తెలంగాణ భాషకు మంచిరోజులు ప్రారంభమైనాయి. 

‘తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో’, ‘బొంతపురుగునైనా మేం ముద్దు బెట్టుకుంటం, కుష్టురోగినైనా మేం కౌగిలించుకుంటం. మా తెలంగాణ మాకు కావాలె’ అన్న కేసీఆర్‌ నినాదాలు ఇతర ఉద్యమకారుల సంశయాలను పటాపంచలు చేశాయి. పొసగని విషయాలు మాట్లాడేవాళ్లను చూసి ‘గాడిదకు గడ్డేసి ఆవును పాలియ్యమన్నట్లుంది నీ సంగతి’ అనేవాడు. అప్రస్తుత ప్రసంగాలు చేసేవాళ్లను చూసి ‘భోగిభోగి నీ భోగం ఎన్నాళ్ళు అంటే అంగడిబోయిన మా అత్త వచ్చేదాక అందట’ అనేవాడు. ‘కన్నతల్లికి అన్నం బెట్టనోడు పినతల్లికి బంగారుగాజులు చేయిస్తడా?’, ‘గుమ్మినిండ వడ్లుండాలె, గూటమోలె పిల్లలుండాలె అంటె ఎట్లనయ్య’, ‘కొనంగ రాంది కొసరంగ ఒస్తదా?’ లాంటి సామెతలతో ప్రజల హృదయాల మీద ముద్రవేశారు కేసీఆర్‌. సామెత సారం తెలిసిందే అయినా కేసీఆర్‌ చెప్పే పద్ధతి ఆకట్టుకునేది. సామెత లేకుండా మామూలు పదాలను విరిచి ఉచ్ఛరించే పద్ధతి వల్ల కూడా ఆసక్తి జనించేది. ‘ఆడొగడు ఆడొగడు మోపైనారిట్ల’, లాంటి నుడికారాలతో తెలంగాణ భాషకు కొత్త సత్తువ తెచ్చాడు కేసీఆర్‌.

తెలంగాణ కోసం ఆలోచిస్తున్న బుద్ధిజీవులు తమ రచనల్లో తెలంగాణ భాషను నిస్సంకోచంగా ఉపయోగించారు. తమ భాషలోని ఉన్నత వ్యవహారాలను, గ్రంథ ప్రమాణాలను వెలికితీయనారంభించారు. ముదిగంటి సుజాతరెడ్డి ఒక వ్యాసం రాస్తూ తెలంగాణలోని అన్యదేశాలు సీమాంధ్రుల రచనల్లో కూడా ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రాంత పదాలు తిక్కన కవిత్వంలో చాలా కనిపించడానికి కారణం మనుమసిద్ధి కోరిక మేరకు తిక్కన ఓరుగల్లును సందర్శించాడని విశ్లేషణలొచ్చాయి. అచ్చతెలుగు కావ్యం రాసిన పొన్నగంటి తెలగనార్యుడు, నిరోష్ఠ రామాయణం రాసిన ఆసూరి మరింగంటి సింగరాచార్యుడు తెలంగాణ వాళ్లనే రూఢి ప్రసిద్ధిలోకి వచ్చింది.

అన్ని మాధ్యమాలు 2001 నాటి పరిస్థితికి 2020 నాటి పరిస్థితికి భాష విషయంలో ఎంత మార్పునకు లోనయ్యాయో చూస్తే గర్వించదగిన ఫలితాలు కనిపిస్తాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పరిచారు. అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభలను అందరి మన్ననలు పొందేవిధంగా నిర్వహించారు. ప్రతి పాఠశాలలో క్రమానుగతంగా 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు భాషను తప్పనిసరి చేశారు. రెవెన్యూ శాఖలోని ఇన్‌స్పెక్టర్‌ను ‘గిర్దావరు’గా, డిప్యూటీ తహసీల్దార్‌ను ‘నాయబ్‌ తహసీల్దారు’గా పేరు మార్పించడం ఆయన భాష స్పృహకు గుర్తు. నిన్నటికి నిన్న పంటకాలాలను కూడా వానకాలం, యాసంగి కింద మార్చేశారు.

రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణ భాష ఒక గౌరవనీయమైన స్థాయిని సంతరించుకున్నది. సినిమాలలో, టీవీలలో, పత్రికలలో, లోక వ్యవహారంలో తెలంగాణ భాష తలెత్తుకుంది. 

సినిమా రంగం ఇప్పుడు ప్రధాన పాత్రలకు పాటలకు తెలంగాణ వైపు చూస్తున్నది. హీరో హీరోయిన్ల భాష, పూర్తి పాటలు తెలంగాణ నుడిలో వస్తున్నాయి. ఫిదాలో ‘వచ్చిండే ..  మెల్లామెల్లగ వచ్చిండే/ క్రీము బిస్కెట్‌ ఏసిండే/ గమ్ముగ కూసోనియ్యడే/ కుదురుగ నిలుసోనియ్యడే’ అనేపాట; మల్లేశంలో ‘గునుగు పువ్వులా తంగేడు నవ్వులా/ మన రెండు గుండెలూగె ఉయ్యాల/గోరువంకకి సింగారు చిలకలా/ మన జంట పేరు ప్రేమే అయ్యేలా’ అనే పాట తెలంగాణ భాషకు దొరికిన గౌరవం. చాలా సినిమాలలో సంభాషణలు, ఔట్‌డోర్‌ దృశ్యాలు కూడా తెలంగాణతనాన్ని సంతరించుకుంటున్నాయి. చిన్న చిత్రాలలో మరింతగా వస్తువు, భాష, చిత్రీకరణ తెలంగాణతనంతో తొణికిసలాడుతున్నయి. ఫలక్‌నుమా దాస్‌, ఇస్మాట్‌ శంకర్‌, గద్దలకొండ గణేశ్‌, బిలాల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ తదితర సినిమాలన్నీ తెలంగాణ భాషలోనే వచ్చాయి. టీవీ యాంకర్ల భాషలో మార్పులేకున్నా, క్షేత్రస్థాయి దృశ్యాలు తెలంగాణ భాషలోనే నివేదించడం జరుగుతున్నది. దాదాపు ప్రతి టీవీలో తెలంగాణ భాషతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. తెలంగాణ భాషను పలికే యాంకర్లు కూడా నటీనటుల స్థాయి గ్లామర్‌ను సంపాదించుకోగలుగుతున్నారు.

పత్రికా రచనలో తెలంగాణతనాన్ని ఊహించలేకపోయినప్పటికీ పతాక శీర్షికలకుఇక్కడి నుడికారం బాగా పనికొస్తుందని చాలాసార్లు నిరూపణ అయింది. ‘జరపైలం’, ‘బంద్‌ కరోనా’ తదితర హెడ్‌లైన్స్‌లోని సౌందర్యం ఇక్కడి భాషదే. రచయితలు తెలంగాణ భాషలో రాయడంతో పాటు, పుస్తకాల పేర్లు తెలంగాణ మౌలికతను సూచించేవే పెట్టడం గమనార్హం. తెలంగాణ నుడికారాన్ని  గర్వపడే స్థాయికి తెచ్చింది రాష్ట్రసాధనోద్యమమే.

- డాక్టర్‌  ఏనుగు నరసింహారెడ్డి

8978869183


logo