మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Editorial - Apr 26, 2020 , 22:52:37

ప్రామాణిక భాషవైపు ప్రయాణం

ప్రామాణిక భాషవైపు ప్రయాణం

మన ప్రాచీన కవులు దేశీయమైన కావ్యాలు రాయడంలోనూ శతకాలను తొలిసారిగా సమకూర్చడంలోను, పురాణాలకు దారులు వేయడంలోను, అచ్చతెలుగు కావ్యాలతో సృజనాత్మక ప్రయోగాలు చేసి ఓ ప్రత్యేకతను సాధించారు.

తొలి, మలి తెలంగాణ రాష్ర్టోద్యమాలకన్న ముందునుంచీ తెలంగాణ కవిత్వం తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ప్రయాణిస్తున్నది. సురవరం ప్రతాపరెడ్డి ‘గోలుకొండ’ తొమ్మిదవ సంవత్సరాది సంచికలో ముడుంబ వెంకట రాఘవాచార్యులు విడ్డూరంగా ‘నిజాం రాష్ట్రములో ఆంధ్రకవులు పూజ్యము’ అని రాసిన దానికి జవాబుగా మూడువందల యాభై నాలుగు మంది కవులతో ‘గోలకొండ కవుల సంచిక’ తేవడంతో మన రహదారి ప్రారంభమైంది.తెలంగాణ ఉద్యమానికి దారిచూపింది గోలుకొండ కవుల సంచికనే. ఆధునిక కవిత్వానికి వారధి సారథి మన దాశరథి. 1949లోనే మార్క్సిస్టు భావాలతో ‘అగ్నిధార’కు దారులు వేశాడు. 1949లో ప్రారంభమైన తెలంగాణ రచయితల సంఘానికి దాశరథి నాయకుడు. కర్మ, క్రియ మన సినారె. ఈ ముగ్గురు మన సాహిత్యానికి త్రినేత్రులయ్యారు. 

తెలంగాణ ఉద్యమం  సాహి త్యాన్ని విస్తరింప చేయడమే కాకుండా సాహిత్యోద్యమకారులను తయారుచేసింది. ఉద్యమకాలంలో అన్ని సాహిత్య ప్ర క్రియల పాత్రల కన్నా ‘పాట’ ప్రధాన పాత్రను పోషించింది. పాట ఉద్యమ శంఖారావం చేస్తే, దాని రహస్య రహదారిని నిర్మించింది ఉద్యమకవులే. 

మన ప్రాచీన కవులు దేశీయమైన కావ్యాలు రాయడంలో, శతకాలను తొలిసారిగా సమకూర్చడంలో, పురాణాలకు దారులు వేయడంలో, అచ్చతెలుగు కావ్యాలతో సృజనాత్మక ప్రయోగాలు చేసి ప్రత్యేకతను సాధించారు. పాల్కుర్కి మొదలుకొని పోతనదాక గోపరాజు మొదలుకొని గోన బుద్ధారెడ్డి దాక మనదైన అస్తిత్వ వైభవాలతో కవిత్వం విరాజిల్లింది. 

తెలంగాణ ఉద్యమం ప్రాచీన భాషలోని పదసంపదను, సంస్కృతిని వెలికితీయడానికి ప్రయత్నించింది. గ్రాంధిక వాదంపై వ్యవహారిక భాషోద్యమం లేవదీసినట్లే తెలంగాణ ప్రామాణిక భాషోద్యమం రావాల్సిన ఆవశ్యకత ఉన్నది. మన తెలంగాణ భాషను, యాసను విడమరిచి చూపే నైపుణ్యం సగటు మనుషులకు తెలియజెప్పవలసిన అవసరముంది. జనంలో ఉండే యాసను గుర్తించి మన కవులు వాటినెట్లా ప్రామాణికంగా సృజనాత్మకంగా ఎలా ఉపయోగించుకోవాలో తెలియజెప్పే ప్రణాళికలు రూపొందాలి. మాండలిక పదాలను ప్రామాణికం చేసుకున్నప్పుడు తెలంగాణ అన్నిప్రాంతాల పదాలకు ప్రయోగ నైపుణ్యాలు పెరుగుతాయి. కవికి తనదైన జాతిభాషా సొగసులు అబ్బకపోతే కవి అస్తిత్వం స్థిరపడదు. 

- డాక్టర్‌ నాళేశ్వరం శంకరం, 94404 51960


logo